logo

వ్యూహాలకు పదును.. అనుకూలతలపై ఆరా: సొంత సర్వేల ఆధారంగా అభ్యర్థుల అంచనా

మరో ఆరు రోజుల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుండటంతో ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాలకు పోటీ చేయనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు.

Updated : 12 Apr 2024 07:40 IST

  • ఇటీవల ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి తాను పోటీ చేయనున్న లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రైవేటు సంస్థతో సర్వే చేయించుకున్నారు. రెండు మండలాల్లో అనుకూలంగా లేదనే సంకేతాలు వచ్చాయి. వెంటనే ఆ మండలాల ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి స్థానికంగా ప్రజల మద్దతు పెరిగేందుకు ఏం చేయాలన్న అంశంపై సమాలోచనలు జరిపారు. అనంతరం మూడు రోజుల పాటు ఆయా మండలాల్లో పలు కార్యక్రమాలు చేపట్టి జనం మద్దతు కూడగట్టుకునే యత్నం చేశారు.
  • మరో ప్రధాన పార్టీ అభ్యర్థి సొంతంగా నిర్వహించిన నాలుగైదు సర్వేల్లో తనపై ప్రజల్లో సానుకూలత ఉందని గుర్తించారు. అయినా సరే.. ఇంకా కొంత బలహీనంగా కనిపిస్తున్న ప్రాంతాలను గుర్తించి మద్దతు పెంచుకోవడానికి అవలంబించాల్సిన పద్ధతులపై పార్టీ ముఖ్యులతో చర్చించారు. వీలైతే పార్టీ ముఖ్య నేతలను అక్కడికి తీసుకొచ్చి ప్రచారం చేపడితే ఫలితం ఉంటుందని భావిస్తున్నారు.

ఈనాడు, కరీంనగర్‌: మరో ఆరు రోజుల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుండటంతో ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాలకు పోటీ చేయనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మినహాయించి ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఖరారవడంతో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఓ వైపు ద్వితీయ శ్రేణి నాయకులను కలుస్తూ బలాన్ని పెంచుకునే ఎత్తుగడలతో ముందుకు వెళ్తూనే వివిధ సంస్థలతో సర్వేలు చేయించుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థితో పోలిస్తే తమ పరిస్థితి ఏమిటి.. ఎంత శాతం ఓటర్ల మద్దతు తమకుంది? తదితర అంశాలు తెలుసుకుంటున్నారు. ఈ నివేదికల ఆధారంగానే ఏ వర్గం ఓట్లను ఎలా తమ వైపునకు తిప్పుకోవచ్చనే మంతనాల్ని సాగిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, మైనారిటీ వర్గాల వారీగా ఓట్లను రాబట్టుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. పనిలో పనిగా కుల సంఘాలతో ఆత్మీయ సమావేశాల్ని పెట్టి వారి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎలా చేస్తే ముందుకు..

ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ పార్టీకి గత పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను లెక్కగడుతూ ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేసుకుంటున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లున్నాయి. గతేడాది చివరిలో జరిగిన శాసన సమరంలో నియోజకవర్గాల వారీగా వచ్చిన ఓట్ల గణాంకాలను అభ్యర్థులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల్లో తమ పార్టీపై ఉన్న అభిప్రాయం.. శాసనసభ ఎన్నికలకు ఇప్పటికీ సానుకూలత పెరిగిందా.. వ్యతిరేకత ఏమైనా వచ్చిందా తదితర అంశాలను సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. ఏ అంశాల్లో తమకు అనుకూలత ఉంది.. ఏ విషయంలో వెనుకబడి ఉన్నాం తదితర అంశాలను విశ్లేషించుకుంటున్నారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై ఆయా మండలాల ముఖ్య నాయకులతో చర్చిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు ముఖ్యమైన మండలాల్లో దాదాపుగా పర్యటనలు పూర్తి చేసుకున్నారు. ఓట్లను పెంచుకునేందుకు ఎలాంటి హామీలను ఇవ్వాలో కూడా ఎజెండాను రూపొందించుకుంటున్నారు. ఎలా ప్రచారాన్ని సాగిస్తే పోటీదారుకన్నా ముందుకు వెళ్తామనే విషయాలపైనే ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు. తమ వ్యూహాలకు మరింత పదును పెట్టి మున్ముందు ప్రచారంలో మరింత దూసుకెళ్లడానికి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని