logo

అరచేతిలో సమగ్ర సమాచారం

ప్రలోభాలకు లొంగకుండా, నైతికంగా, నిర్భయంగా ఓటేసేందుకు ఎన్నికల సంఘం పలు సంస్కరణలు అమలు చేస్తోంది.

Published : 16 Apr 2024 03:37 IST

ఓటరు గైడ్‌ పుస్తకాల పంపిణీ

పెద్దపల్లిలోని బంధంపల్లిలో ఓటరు గైడ్‌ పంపిణీ చేస్తున్న బీఎల్‌వో

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: ప్రలోభాలకు లొంగకుండా, నైతికంగా, నిర్భయంగా ఓటేసేందుకు ఎన్నికల సంఘం పలు సంస్కరణలు అమలు చేస్తోంది. పోలింగ్‌ శాతం గణనీయంగా పెంచే మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో ‘ఓటరు గైడ్‌’ విధానాన్ని తీసుకొచ్చింది. గత శాసనసభ ఎన్నికల్లో దీన్ని ప్రవేశ పెట్టినప్పటికీ తాజాగా స్వల్ప మార్పులతో ఓటరు నమోదు నుంచి ఓటు హక్కు వినియోగించే వరకు సమగ్ర సమాచార వివరాలు అందులో ముద్రించారు. బీఎల్‌వోలు ఇంటికొక పుస్తకం పంపిణీ చేస్తున్నారు. మరోవైపు సిస్టమెటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఫ్లెక్సీలు, బ్యానర్లలతో ఓటర్లలో చైతన్యం తీసుకొస్తున్నారు.

మంచి నాయకులను ఎన్నుకోవాలనే..

దేశ భవిష్యత్తును మార్చేశక్తి ఓటుకు మాత్రమే ఉందని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే సందేశంతో 15 పేజీల పుస్తకాన్ని ఎన్నికల సంఘం ముద్రించింది. మద్యానికి, డబ్బులకు, బహుమతులకు ఓటును అమ్ముకోకుండా స్వేచ్ఛగా ఓటును వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలనే భావన కలిగించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి, సీ విజిల్‌ యాప్‌, 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఇతరత్రా యాప్‌ల వివరాలతో రూపొందించారు. ‘చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఓటు, అప్రమత్తత-పరిశీలన-నిజాయతీ గల ఓటరు’ అనే నినాదాలతో అందుబాటులో ఉన్నాయి.

ఆలోచన పెంచి.. చైతన్యం కలిగించి

ఓటరు గైడ్‌ (మార్గదర్శి) పుస్తకంలో ఓటు హక్కు మొదలు, పోలింగ్‌ కేంద్రాల్లో వసతులు, సిబ్బంది, ఓటు హక్కు వినియోగం, వేలికి సిరా చుక్క పెట్టడం, ఈవీఎం యంత్రాల బీప్‌ శబ్దం, వీవీప్యాట్‌లో ఓటు నమోదైందో లేదో ఇలా ప్రతి ఓటింగ్‌ ప్రక్రియను సులువుగా తెలుసుకునేలా దీన్ని ముద్రించారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతాననే ప్రతిజ్ఞ అందులో ఉంది. పలు కారణాలతో ఓటింగ్‌కు దూరమవుతున్న ఓటర్లలో ఆలోచన నింపి, ఓటింగ్‌ శాతం పెంచే లక్ష్యం విధించారు. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో 2,189, పెద్దపల్లి 1,850, నిజామాబాద్‌లో 1,807 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఓటరు గైడ్‌ పుస్తకాలను బీఎల్‌వోలు పంపిణీ చేస్తున్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి సరిపడా మార్గదర్శి పుస్తకాలు వచ్చాయి. ముందస్తుగా పోలింగ్‌ కేంద్రాల సమాచారంతో ఓటేసేందుకు వసతులు, ఇతర సందేశాత్మక పుస్తకాలతో పోలింగ్‌ శాతం పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో కంటే లోక్‌సభలో ఓటింగ్‌ శాతం తగ్గడంపై అన్ని మార్గాల్లో చైతన్యం ముమ్మరం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని