logo

గంట ముందే పోలింగ్‌ ప్రారంభం

గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Published : 19 Apr 2024 04:41 IST

మంథని, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో ఏర్పాట్లు

మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం అంతరాష్ట్ర కేంద్రంలో పోలీసుల తనిఖీలు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితాలో పెద్దపల్లి జిల్లాలో మంథని, మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 4 గంటల లోపు వచ్చిన వారికే ఓటేసేందుకు అనుమతిస్తారు.

ఇలా ఎందుకంటే..

పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఏడు శాసన సభ స్థానాలు ఉండగా పెద్దపల్లి జిల్లాలో రామగుండం, మంథని, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాల పొడవునా గోదావరి నది ప్రవహిస్తోంది. అన్ని మండలాల్లో అడవుల శాతం అధికంగా విస్తరించి ఉంది. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులో చాలా గ్రామాలు ఉన్నాయి. ఒకప్పుడు మావోయిస్టు పార్టీలకు కంచుకోటలా ఈ గ్రామాలు పేరొందాయి. మావోయిస్టుల నుంచి ఎలాంటి ఉపద్రవం లేకుండా ముందస్తు పోలింగ్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీస్‌ బలగాలు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఎక్కడికక్కడే భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు.

మౌలిక వసతులే ప్రధానం

ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. పార్లమెంట్‌ పరిధిలో 1,850 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వీటిలో చెన్నూరులో 27, బెల్లంపల్లిలో 25, మంచిర్యాలలో 53, ధర్మపురిలో 27, రామగుండంలో 42, మంథనిలో 43, పెద్దపల్లిలో 56 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో నీడ కోసం టెంట్లు, తాగునీరు, మరుగుదొడ్డి వసతులు సమకూర్చుతున్నామనే అధికారుల మాటలకు పొంతన కుదరడంలేదు. చాలా చోట్ల నామమాత్రంగా టెంట్‌ సౌకర్యం కల్పిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఓటర్లకు మౌలిక వసతులు కల్పిస్తేనే ఓటింగ్‌ శాతం పెరగనుంది.

నియోజకవర్గ ముఖచిత్రం

పోలింగ్‌ కేంద్రాలు : 1,850
సమస్యాత్మక కేంద్రాలు : 273
మొత్తం ఓటర్లు : 15,92,996

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని