logo

మాతాశిశుకు తప్పని ఉక్కపోత

చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు.

Published : 24 Apr 2024 05:21 IST

న్యూస్‌టుడే, పెద్దపల్లి : చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండడంతో చల్లదనం కోసం అధికారులు కనీస కార్యాచరణ చేపట్టడం లేదు. ఐసీయూలకే ఏసీలు పరిమితం కావడంతో సాధారణ వార్డులలోని బాలింతలు, చంటి పిల్లలు ఉక్కపోతలోనే ఉండాల్సి వస్తోంది. వార్డులలో ఫ్యాన్‌లు ఉన్నప్పటికీ పెరిగిన వేడితో వేడి గాలి వస్తుండడంతో కొందరు బాలింతలు ఫ్యాన్‌లను ఆఫ్‌ చేసి, బయటి గాలి కోసం కిటికీలను తెరుస్తున్నారు. తాత్కాలికంగా ఇది ఉపశమనమిస్తున్నటప్పటికీ బయటి నుంచి వచ్చే దుమ్ముతో పాటు దోమలు వార్డులోకి వచ్చి బాలింతలు, చంటి బిడ్డలకు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశముంది.

వేడి కష్టాలు

పాత ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులలో బాలింతలకు ఫ్యాన్‌లు లేకపోవడంతో ఇంటి నుంచి ఫ్యాన్‌లు తీసుకొచ్చి ఇబ్బందులు పడిన ఉదంతాలను ప్రత్యక్షంగా వీక్షించిన అప్పటికి కలెక్టర్‌ అలుగు వర్షిణి మూడు ప్రసూతి వార్డులలో ఏసీలను ఏర్పాటు చేయించారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ వార్డులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇక కొత్త భవనంలో ఏసీలు కేవలం ఆపరేషన్‌ థియేటర్‌కే పరిమితమయ్యాయి. ఇటీవల ఐసీయూలో రెండు ఏసీలను అధికారులు ఏర్పాటు చేశారు. వార్డులలో చల్లదనం కోసం కనీస చర్యలు లేవు. కిటికీలకు తెరలు కట్టడం, కూలర్లు ఏర్పాటు చేయలేదు. పాత ఆస్పత్రి ప్రసూతి వార్డులలోని ఏసీలను ఇతర అవసరాలను వినియోగిస్తున్నారు. కానీ బాలింతల కష్టాలు మాత్రం వారికి కనిపించడం లేదు. ఈ విషయమై ఆసుపత్రి పర్యవేక్షకులు ఆర్‌.రమాకాంత్‌ను వివరణ కోరగా.. పెరిగిన వేడి తీవ్రత నేపథ్యంలో చల్లదనం కోసం ఏసీలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని