logo

ఇక ట్వంటీ20 పోరు!

పోలింగ్‌ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్‌ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం.

Updated : 24 Apr 2024 06:08 IST

ఇరవై రోజుల  ఓట్ల ఆ(వే)ట

ఈనాడు, కరీంనగర్‌ : పోలింగ్‌ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్‌ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. పొట్టి క్రికెట్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠ ఉన్నట్లే.. ఉమ్మడి జిల్లాలోనూ ఈవీఎం మీట నొక్కే వరకు అభ్యర్థులు  క్రికెటర్లలా విజయం కోసం చెమటోడ్చాల్సిందే.. మారుతున్న రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రాజకీయ వ్యూహ యార్కర్లు, బౌన్సర్లు సంధించాల్సిందే.. ఐపీఎల్‌ పోరు ఊపందుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పార్టీల ప్రచారం, మాటల తూటాలు, ఓట్ల కోసం పరితపిస్తున్న తీరు.. క్రికెట్‌ ఆటతో పోలిస్తే.. ఎలా ఉంటుందనే తీరే సరదాగా ఇలా..

పవర్‌ప్లే..!

మొదటి ఆరు ఓవర్ల పవర్‌ ప్లే ఏ జట్టుకైనా కీలకం. మంచి స్కోరును ఆరంభించడానికి మూలం. అదే విధంగా నామినేషన్ల ప్రక్రియ తుది గడువు పూర్తయ్యే ఈ ఆరు రోజులు ముఖ్యమే. అందుకే ఈ సమయంలో అభ్యర్థులు నామినేషన్లు వేయడంతోపాటు మరోవైపు సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్‌ను ఎన్నికల దిశగా సమాయత్తపరుస్తున్నారు.

చివరి ఓవర్లు...

మే 13న పోలింగ్‌ జరగనుండటంతో చివరి ఓవర్‌గా భావించే ఆ రోజు చాలా కీలకం. 19 రోజుల ఆటలో అభ్యర్థులిచ్చిన హామీలు, వీరి ప్రచారం తీరుని గమనించిన ఓటర్లు తమ తుది తీర్పుని ఈవీఎంలో నిక్షిప్తం చేసే ఆ ఓవర్‌ రాజకీయ క్రీడాకారులకు చాలా ముఖ్యం. చివరి ఓవర్లో సాధించిన పరుగులు జట్టు విజయావకాశాల్ని తారుమారు చేసిన సందర్భాలుంటాయి.  చివరి ఓవర్‌కు ముందు ఓవర్లు కూడా ముఖ్యమే. అందుకే మే 9 నుంచి 13వ తేదీ వరకు నాలుగు రోజులు అభ్యర్థులు ఎంత తెలివిగా వ్యవహరించారనేది కూడా ముఖ్యం. తాము చేసిన ప్రచారం ఏ మేరకు పని చేసింది.. జనాన్ని ఆకర్షించడానికి ఇంకా అవలంబించాల్సిన విధానాలపై వ్యూహాలు అమలు చేయాల్సింది ఈ సమయంలోనే. ప్రత్యర్థుల విసిరే బంతులను తెలివిగా ఆడుతూ.. సిక్సర్లు, ఫోర్లు బాదినట్లు.. ప్రచారం చివరి దశలో తెలివిగా సాగితేనే అభ్యర్థులకు విజయం సాధ్యం.

మూడు జట్లు..

2024 ఐపీఎల్‌లో పది జట్లు తలపడుతుంటే.. ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే మూడు లోక్‌సభ స్థానాలనే మైదానంలో ముచ్చటగా మూడు జట్లు పోటీపడుతున్నాయి. కేంద్రంలో అధికారాన్ని మళ్లీ అందుకోవాలనే ఉబలాటంతో భాజపా.. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న జోష్‌తో కాంగ్రెస్‌.. పదేళ్ల పాలనలో పనితీరే కొలమానంగా భారాస (జట్లు)లు తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఇక జట్టులో తుది కూర్పు తరహాలో అనుభవానికి కొన్ని పార్టీలు ప్రాధాన్యతనిస్తే.. ఇంకొన్ని పార్టీలు కొత్త ముఖాలను ఆటలోకి దించి వారికి అవకాశాన్ని కల్పించాయి. కాంగ్రెస్‌ పార్టీ మూడు దశాబ్దాల రాజకీయ అనుభవమున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (నిజామాబాద్‌)ని, యువ నాయకుడిగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన గడ్డం వంశీ(పెద్దపల్లి)కి తొలిసారి టికెట్‌ ఇచ్చి పోటీకి దింపింది. కరీంనగర్‌ స్థానంలో ఎవరిని ఆడించాలనే విషయంలో కాంగ్రెస్‌ ఆలోచిస్తోంది. భారాస అనుభవమున్న ఆటగాళ్లు కొప్పుల ఈశ్వర్‌ (పెద్దపల్లి), బాజిరెడ్డి గోవర్థన్‌ (నిజామాబాద్‌), బోయినపల్లి వినోద్‌కుమార్‌ (కరీంనగర్‌)లను నమ్ముకుంది. భాజపా గత ఎన్నికల్లో విజేతలైన బండి సంజయ్‌ (కరీంనగర్‌), ధర్మపురి అర్వింద్‌ (నిజామాబాద్‌)లకు మరోసారి ఆడే ఛాన్స్‌ ఇచ్చింది. పెద్దపల్లికి మాత్రం ఇతర జట్టులో గతంలో ఆడిన అనుభవమున్న గోమాసె శ్రీనివాస్‌ను రంగంలోకి దింపింది.

వ్యూహాలతో ఇలా...

  •  ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌గా ప్రధాన పార్టీలు ప్రచారానికి ముఖ్య నేతల్ని ఆహ్వానిస్తూ రాజకీయ క్రీడలో పై చేయిని సాధించాలని చూస్తున్నాయి. రోడ్‌షోలు, బహిరంగ సభలతో ఓటర్ల మనసును చూరగొనడానికి ప్రయత్నిస్తున్నాయి.
  •  ఉన్నది కొద్ది సమయమే కావడంతో అభ్యర్థులు క్రీడాకారులు సిక్సర్లు, ఫోర్లు బాది స్కోరు బోర్డును పరిగెత్తించినట్లు ప్రచారాన్ని ముమ్మరం చేసి ఓటర్ల ఆదరణ చూరగొనాలి.
  •  మైదానం నలువైపులా బంతిని పరిగెత్తించే విధంగా ప్రచారమనే ఆటలో అన్ని రకాల షాట్లు (హామీలు, గెలుపు వ్యూహాలు) ఆడాలి. ప్రత్యర్థులు చేసే విమర్శలనే గుగ్లీ, యార్కర్లు, లెగ్‌, ఆఫ్‌ స్పిన్‌లను అవలీలగా ఎదుర్కోవాలి. అవసరాన్ని బట్టి డిఫెన్స్‌ ఆడుతూనే.. ప్రత్యర్థుల వ్యూహాలకు దీటైన జవాబివ్వాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని