logo

కాంగ్రెస్‌ గూటికి మట్టా దయానంద్‌

సత్తుపల్లికి చెందిన భారాస నాయకుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌విజయ్‌కుమార్‌, మట్టా రాగమయి దంపతులు భారాసకు రాజీనామా చేసి శుక్రవారం పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

Published : 27 May 2023 03:33 IST

సత్తుపల్లి, న్యూస్‌టుడే: సత్తుపల్లికి చెందిన భారాస నాయకుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌విజయ్‌కుమార్‌, మట్టా రాగమయి దంపతులు భారాసకు రాజీనామా చేసి శుక్రవారం పెద్దఎత్తున తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎంపీ రేణుకాచౌదరి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరారు. మట్టా ముఖ్య అనుచరులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాసరావు, దొడ్డా శ్రీనివాసరావు, ఎండీ కమల్‌పాషా, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, మొరిశెట్టి సాంబశివరావు, నరుకుళ్ల అప్పారావు, రాంబాబు, మారేశ్వరరావు, జీవన్‌కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ ఫక్రుద్దీన్‌, ఫయాజ్‌, సాయి, కిశోర్‌, నరసింహారావు, పుల్లయ్య, సర్వోత్తమరెడ్డి తదితరులు కాంగ్రెస్‌ గూటికి చేరారు.
వంద కార్లతో  హైదరాబాద్‌కు.. డాక్టర్‌ మట్టా దయానంద్‌, రాగమయి దంపతులతోపాటు నియోజకవర్గం నుంచి సుమారు వంద కార్లలో 400 మందితో భారీ కాన్వాయ్‌గా హైదరాబాద్‌కు తరలివెళ్లారు. నాడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న మట్టా దయానంద్‌ 2014లో వైకాపా నుంచి తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటితో కలిసి తెరాసలో చేశారు. 2018 ఎన్నికల్లో సత్తుపల్లి తెరాస సీటును ఆశించి భంగపడ్డారు. మాజీ ఎంపీ పొంగులేటి పలుమార్లు భాజపా నాయకులతో సంప్రదింపులు చేయడంతో ఆయన భాజపాలో చేరతారని భావించి పొంగులేటికి దూరమయ్యారు. సీఎం కేసీఆర్‌ సైతం సిట్టింగులకే సీట్లు ఇస్తామని పలుమార్లు ప్రకటించడంతో పార్టీకి రాజీనామా చేసి నియోజకవర్గంలోని ఆయన అభిమానులు, అనుచరుల కోరిక మేరకు తాజాగా మాజీ ఎంపీ రేణుకాచౌదరి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు