logo

పోడు పట్టాలతో పది ప్రయోజనాలు

పోడు సాగు రైతులకు అందిస్తున్న పట్టాల ద్వారా పది ప్రయోజనాలు చేకూరుతాయని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

Updated : 01 Jul 2023 06:43 IST

మంత్రి హరీశ్‌రావు

వైద్య కళాశాలలో భవనాలను పరిశీలిస్తున్న మంత్రులు, ఎంపీలు, కలెక్టర్‌ తదితరులు

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: పోడు సాగు రైతులకు అందిస్తున్న పట్టాల ద్వారా పది ప్రయోజనాలు చేకూరుతాయని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పలువురికి పోడు పట్టాలను శుక్రవారం అందజేశారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జిల్లాలో 6,589 మంది రైతులకు 13,139.05 ఎకరాలకు సంబంధించిన హక్కుపత్రాలు అందజేస్తున్నామన్నారు. పోడు పట్టాల ద్వారా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, తదితర పథకాలు వర్తిస్తాయని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ధాన్యం సరఫరా చేసేందుకు తెలంగాణ సిద్ధమయ్యిందని, కేసీఆర్‌ అమలుచేస్తున్న పథకాల ద్వారా రాష్ట్రం ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం స్పందించలేదన్నారు. వైరా, ఇల్లెందులోని ప్రభుత్వ ఆసుపత్రులను వంద పడకల దవాఖానాలుగా మార్చేందుకు యత్నిస్తున్నామని వెల్లడించారు.

అత్యధిక లబ్ధి ఉమ్మడి జిల్లా వాసులకే..

పోడు పట్టాలతో అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం వాసులకే లబ్ధి కలుగుతోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతగా పది నియోజకవర్గాల్లోనూ భారాసను గెలిపించాలని ప్రజలను కోరారు. సీˆతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి సాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. ఖమ్మం నగరాన్ని రూ.కోట్లతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒకేరోజు 1.55లక్షల మందికి భూపట్టాలు ఇచ్చి సీఎం కేసీఆర్‌ చరిత్ర సృష్టించారన్నారు. జిల్లాకు వైద్య కళాశాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయకపోయినా సీఎం ఏర్పాటు చేశారని తెలిపారు. అంతకుముందు గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ వేద సాయిచంద్‌ చిత్రపటానికి మంత్రులు నివాళి అర్పించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆర్థిక శాఖ ప్రిన్పిల్‌ సీఎస్‌ రామకృష్ణారావు, కలెక్టర్‌ గౌతమ్‌, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, ఎమ్మెల్యేలు లావుడ్యా రాములునాయక్‌, హరిప్రియ, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ రాయల శేషగిరిరావు, మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఐటీడీఏ పీఓ పోట్రు గౌతమ్‌, కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌, రైబస జిల్లా సమన్వయకర్త నల్లమల వెంకటేశ్వరరావు, కార్పొరేటర్‌ పాలెపు విజయ పాల్గొన్నారు.

వైద్య కళాశాల ఆధునికీకరణ పనుల పరిశీలన

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాల పనులను 2023-24 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కళాశాల భవన ఆధునికీకరణ పనులను మంత్రి పువ్వాడ, ఎంపీలు నామా, వద్దిరాజుతో కలిసి పరిశీలించారు. 100 సీట్లతో తరగతులు నిర్వహించేందుకు సదుపాయాలను సమకూర్చాలని కలెక్టర్‌ గౌతమ్‌కు సూచించారు. అనంతరం ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఉద్యోగులు, వైద్యాధికారులతో కలిసి మంత్రులు ఫొటో దిగారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సీఎస్‌ రామకృష్ణారావు, సీపీ విష్ణువారియర్‌, ప్రిన్సిపల్‌ రాజేశ్వరరావు, సూపరింటెండెంట్‌ బి.వెంకటేశ్వర్లు, కార్పొరేటర్‌ కర్నాటి కృష్ణ పాల్గొన్నారు.  

ఖమ్మంలో పోడు పట్టాలు పంపిణీ చేస్తున్న రవాణా శాఖ మంత్రి అజయ్‌, చిత్రంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు నామా, వద్దిరాజు, ఎమ్మెల్యేలు రాములునాయక్‌, హరిప్రియ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని