logo

Telangana news: రెండు కోర్సులు.. పుష్కల అవకాశాలు..!

రానున్న విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో రెగ్యులర్‌ కోర్సులతో పాటు బ్యాచులర్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆడ్మినిస్ట్రేషన్‌(బీబీఏ), బ్యాచులర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(బీసీఏ) కోర్సులు తప్పనిసరి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యోచిస్తోంది.

Updated : 24 Dec 2023 08:51 IST

కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే: రానున్న విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో రెగ్యులర్‌ కోర్సులతో పాటు బ్యాచులర్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆడ్మినిస్ట్రేషన్‌(బీబీఏ), బ్యాచులర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(బీసీఏ) కోర్సులు తప్పనిసరి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యోచిస్తోంది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనూ వీటిని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ రెండు కోర్సులకు మార్కెట్‌లో గణనీయమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. ఏళ్లుగా ఈ కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేమితో బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీజడ్‌సీ, ఇతర రెగ్యులర్‌ కోర్సులనే ఎక్కువ మంది అభ్యసిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌, కవిత, ప్రియదర్శిని కళాశాలలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో మాత్రమే బీబీఏ, బీసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు పోటీపడుతున్నారు. ఒక్కో కోర్సులో 60 మంది ప్రవేశం పొందవచ్చు. పీజీ స్థాయిలో ఎంబీఏ చేయాలనుకునేవారు బీబీఏ, ఎంసీఏ అభ్యసించాలనుకునేవారు బీసీఏను ఎంపిక చేసుకుంటున్నారు.

బీబీఏ అభ్యసిస్తే..

వ్యాపార నిర్ణయాలు తీసుకోవటం, నాయకులుగా మారేందుకు బీబీఏ కోర్సు ఉపకరిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ వ్యాపారాల్లో అద్భుతమైన కెరీర్‌ పురోగతికి బాటలు వేస్తుంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన వెంటనే ట్రైనీ మేనేజర్‌, ఇతర అడ్మినిస్ట్రేటివ్‌ ఉద్యోగాల్లో ప్రవేశించే వెసులుబాటు ఉంటుంది. సంస్థలు ఎలా పనిచేస్తాయనే అంశంపై బీబీఏ విద్యార్థులకు సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. పరిశ్రమను అర్థం చేసుకోవటానికి కావాల్సిన నైపుణ్యాలనూ ఈ కోర్సు అందిస్తుంది. స్వయం నిర్ణయానికి అవకాశం కల్పిస్తుంది.

బీసీఏ చదివితే..

కంప్యూటర్‌ అప్లికేషన్ల చుట్టూ సిలబస్‌ తిరుగుతుంది. బీసీఏ కోర్సు విద్యార్థులకు కంప్యూటర్‌ ఇన్నోవేషన్‌ పరిశ్రమల్లో అధిక డిమాండ్‌ ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఉద్యోగం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంప్యూటర్‌ సైన్సు రంగంలో సాంకేతిక మార్పులతో బీసీఏ డిగ్రీ ముందంజలో ఉంది.

ప్రస్తుతం నాలుగు డిగ్రీ కళాశాలల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు: 508


ఆర్థిక సంస్థలు, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలు, బ్యాంకులు, విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ రంగాల్లో ఎన్నో ఉపాధి అవకాశాలున్నాయి. డిగ్రీలో ప్రత్యేక కోర్సుల గురించి తెలుసుకొని ప్రవేశం పొందాను. సీనియర్లు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మా కళాశాలలో బీసీఏ కోర్సులో చేరేందుకు పోటీపడుతున్నారు. అన్ని కళాశాలల్లో ఈకోర్సులు అందుబాటులో వస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది.

సుహానిసాహు, బీసీఏ, ద్వితీయ సంవత్సరం, కొత్తగూడెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు