logo

3వ తేదీ ముగిసింది.. ఖాతాలో కానరాని వేతనం

డిసెంబరు వచ్చింది.. మూడ్రోజులు ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో వేతనాలు జమ కాలేదు.

Published : 04 Dec 2022 01:13 IST

పనిచేయని బిల్‌ స్టేటస్‌ వెబ్‌ సైట్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: డిసెంబరు వచ్చింది.. మూడ్రోజులు ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో వేతనాలు జమ కాలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 ఉప ఖజానా కార్యాలయాలు(ఎస్టీవో) ఉన్నాయి. వీటి పరిధిలో 1250 మందికి పైగా డ్రాయింగ్‌ డిస్‌బర్స్‌మెంట్‌ అధికారులు(డీడీవో)లు ఉన్నారు. అన్ని రకాల బిల్లులు సుమారు మూడు వేలకు పైగా అందుతున్నాయి. ప్రతినెలా 17-25లోపు సంబంధిత డీడీవోల నుంచి ఎస్టీవో కార్యాలయాలకు జీతాల బిల్లులు అప్‌లోడ్‌ చేస్తారు. 26-30 వరకు సదరు ఎస్టీవోలు సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇదంతా నిర్దేశిత గడువులోగా సాగాలి. గతనెల 27 వరకు సర్వర్‌ వేగంగానే పనిచేసింది. 29, 30వ తేదీల్లో నెమ్మదించింది. ప్రస్తుతం జిల్లా ఖజానాశాఖలో ఏ ఒక్క బిల్లు పెండింగ్‌లో లేదు.. అన్ని బిల్లులను అప్‌లోడ్‌ చేసినట్లు ఖజానా ఉద్యోగులు పేర్కొంటున్నారు. కానీ మూడో తేదీ ముగిసినా ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు జరగకపోవడం గమనార్హం.

ఆ శాఖలకు వేతనాలు

* ఆర్థికశాఖ పరిధిలో ఉండే ట్రెజరీ, ఏపీజీఎల్‌ఐ, ఆడిట్‌, పే అండ్‌ అకౌంట్స్‌, పోలీసు, జలవనరులశాఖ, ఆప్కాస్‌ ఉద్యోగులకు వేతనాలు అందాయి.  

* ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల వేతనాలు, పెన్షన్లు ఇంతవరకు జమ కాలేదు. సీఎఫ్‌ఎంఎస్‌-బిల్‌ స్టేటస్‌ వెబ్‌సైట్‌ పనిచేయడం లేదు. ఈనెల నుంచే ఆ సైట్‌ను మూసేశారు. ఆ వెబ్‌సైట్‌ పనిచేసి ఉంటే ఉద్యోగి బిల్లు ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకునే వీలుండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు వేతనాల కోసం ఎదురు చూడక తప్పడం లేదు.

* జిల్లాలో ఉద్యోగుల వేతనాల బిల్లులకు సంబంధించి నెలాఖరులో సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్‌ కొంత నిదానమైంది. ఏ ఒక్క బిల్లు పెండింగ్‌లో లేదు. ఆర్‌బీఐకి బిల్లులు చేరాయని ఖజానా శాఖ అధికారులు చెబుతున్నారు.

తప్పని ఎదురు చూపులు

* కర్నూలు, నంద్యాల జిల్లాలవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి మొత్తం సుమారు 80 వేల మంది  వరకు ఉన్నారు. ఇందులో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీసు, ప్రజారవాణా, విశ్వవిద్యాలయాలు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులు 27 వేల మంది, పెన్షనర్లు 31 వేల మందికిపైగా ఉన్నారు.

* సచివాలయ ఉద్యోగులు 10 వేల మంది, ఆప్కాస్‌ ఉద్యోగులు 6,500, ఆర్టీసీ ఉద్యోగులు నాలుగు వేలమంది మొత్తం కలిపి 78,500 మందికి పైగా ఉన్నారు. వీరిలో 80 శాతం మందికి పైగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకటో తేదీన జీతం కోసం ఎదురుచూసినా వేతనం అందలేదు. ఇంటి అద్దె, సరకులు, నెలవారీగా చెల్లింపులు ఉంటాయి. జీతం ఆలస్యమవడంతో ఇబ్బందులు పడక తప్పడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని