logo

వాహన మిత్ర ద్రోహి.. జగన్‌

బతకడానికి సొంత ఆటో కొనుక్కుని నడిపే ప్రతి ఆటో సోదరుడికీ మాట ఇస్తున్నా.. అధికారంలోకి వచ్చాక ప్రతి ఆటో డ్రైవరుకూ రూ.10 వేలు ఇస్తాం.. వాటితో ఇన్సురెన్సు, రోడ్డు ట్యాక్స్‌ కట్టుకోవచ్చు. చిన్నచిన్న రిపేర్లు చేయించుకోవచ్చు.

Updated : 16 Apr 2024 06:38 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే

‘‘బతకడానికి సొంత ఆటో కొనుక్కుని నడిపే ప్రతి ఆటో సోదరుడికీ మాట ఇస్తున్నా.. అధికారంలోకి వచ్చాక ప్రతి ఆటో డ్రైవరుకూ రూ.10 వేలు ఇస్తాం.. వాటితో ఇన్సురెన్సు, రోడ్డు ట్యాక్స్‌ కట్టుకోవచ్చు. చిన్నచిన్న రిపేర్లు చేయించుకోవచ్చు.

ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు జగన్‌ ఇచ్చిన హామీ.!!

‘‘గతేడాది వాహనమిత్ర కింద నాకు రూ.10 వేలు ఇచ్చారు. బీమా కింద రూ.7 వేలు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం రూ.4 వేలు, కాలుష్య ధ్రువీకరణ కోసం మరో రూ.వెయ్యి కట్టించుకున్నారు. రూ.12 వేలు కట్టించుకుని రూ.10 వేలు ఇచ్చారు. ఇచ్చే లెక్కకంటే తీసుకునే లెక్కనే ఎక్కువగా ఉంది.

ఓ ఆటో డ్రైవర్‌ ఆవేదన.!!

జగనన్న సీఎం అయితే ఏడాదికి రూ.10 వేలిస్తారని నమ్మి ఓట్లేసిన ఆటో డ్రైవర్లకు.. అప్పుడు తెలియలేదు ఆయన మాటలకు అర్థాలే వేరని. కుడిచేత్తో ఇస్తూ ఎడమచేత్తో వాతలు పెడతారని.. పన్నుల బాదుడుతో తమ జేబుల్ని ఖాళీ చేస్తారని ఊహించలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆయనిచ్చిన ఊకదంపుడు ఉపన్యాసాలు వినీ వినీ.. ఆయనొస్తే నిజంగానే ధరల్ని తగ్గిస్తారేమోనని ఆశపడ్డారు. చివరికి  మోసపోయారు. జగన్‌ అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచే.. ఆటోడ్రైవర్లకు చుక్కలు చూపడం మొదలైంది. వాహనమిత్ర పథకాన్ని ప్రకటించిన తర్వాత.. ఆటో రోడ్డెక్కితే చాలు ఎడాపెడా కేసులతో బడుగుజీవుల ఆదాయానికి కత్తెర వేయడం ప్రారంభమైంది.

రూ.10 వేలు రావాలంటే రూ.19,200 కట్టాలి

వాహనమిత్ర లబ్ధిదారులు కచ్చితంగా తమ వాహనానికి బీమా చేయించాలి. ఇదే సమయంలో గతంలో కంటే బీమా మొత్తాన్ని పెంచేశారు. ఏడేళ్లు దాటిన ఆటోకు గ్రీన్‌ ట్యాక్స్‌ కట్టించుకుంటున్నారు. వాహనానికి ఎఫ్‌సీ (ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌) తప్పనిసరి చేశారు. పథకం అమలు కాకముందు ఆటోకు రూ.3 వేలు బీమా చెల్లించేవారు. దీనిని ప్రస్తుతం రూ.8,800కు పెంచారు.

ఏడేళ్లు దాటిన ఆటోలకు ఏటా గ్రీన్‌ ట్యాక్స్‌ కింద ప్రస్తుతం రూ.400 కట్టించుకుంటున్నారు. ఇదే సమయంలో ఆటోకు ఎఫ్‌సీ చేయించుకోవాలంటే రూ.10 వేల వరకు ఖర్చవుతోంది. ఇవన్నీ ఉంటేనే పథకానికి అర్హులవుతారు.

‘‘ ఉదాహరణకు ఓ ఆటో డ్రైవరు వాహన మిత్ర పథాకానికి అర్హుడు కావాలంటే.. సొంత వాహనం కలిగి ఉండటంతోపాటు గ్రీన్‌ ట్యాక్స్‌ రూ.400, బీమా రూ.8,800 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.9,200 కచ్చితంగా ఆర్టీఏ కార్యాలయాల్లో చెల్లించాలి. ఇక ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ అవసరమైతే రూ.10 వేల మొత్తం అదనం. ఒక ఆటో డ్రైవర్‌కు వాహనమిత్ర పథకం కింద రూ.10 వేలు చెల్లిస్తున్న ప్రభుత్వం రూ.19,200 తీసుకుంటుండటం గమనార్హం.’’

షరతులు వర్తిస్తాయి

ఏడాదికి రూ.10 వేల చొప్పున అందిస్తానని హామీ ఇచ్చిన జగన్‌.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే సొంత వాహనాలు ఉన్నవారికే ఈ పథకం అంటూ మెలికపెట్టారు. ఆ తర్వాత రూ.10 వేలు ఇచ్చేందుకు పలు నిబంధనలు అమల్లోకి తెచ్చారు. కుటుంబంలో ఒకరికే పరిమితం చేశారు. కుటుంబంలో మరో వ్యక్తికి ఏదైనా కారు వంటి వాహనం ఉంటే వర్తించదు. ఆటోకు రిజిస్ట్రేషన్‌, యజమానికి చోదక అనుమతి పత్రం లేకపోయినా, విద్యుత్తు బిల్లు నెలకు 300 యూనిట్లు దాటినా వాహనమిత్ర పథకం రాదు.

ఇచ్చేదెంత.. నొక్కేదెంత

రాష్ట్రంలో ఇంధనం ధరలు భారీగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం డీజిల్‌ ధర రూ.97.62 ఉంది. ఇదే కర్ణాటకలో రూ.87కే విక్రయిస్తున్నారు. మనవద్ద లీటరుపై రూ.10 అదనంగా తీసుకుంటున్నారు. ఒక ఆటో డ్రైవరు సగటున రోజుకు ఐదు లీటర్ల డీజిల్‌ వేయించినా రూ.50 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు రూ.1,500, ఏడాదికి రూ.18 వేలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వైఎస్సార్‌ వాహనమిత్ర పేరుతో ఇచ్చేది రూ.10 వేలు మాత్రమే. ఈ ప్రకారం జగనన్న ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్‌ నుంచి రూ.8 వేలు అదనంగా లాక్కుంటున్నట్లే.

ఇదో రకం బాదుడు

జగన్‌ పాలనలో పెనాల్టీల బాదుడూ ఎక్కువే. బీమా లేకపోతే రూ.5 వేలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ చేయించుకోకుంటే రూ.5 వేలు, కోటు వేసుకోకున్నా.. రూ.235 చొప్పున వసూలు చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుంటే రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. వాహనమిత్ర కింద ఏడాదికి ఇచ్చే రూ.10 వేలతో పోలిస్తే.. నెలకు నమోదయ్యే కేసులు, చెల్లించే జరిమానాలకే ఎక్కువ అవుతోంది.

  • ఆటో డ్రైవర్లు : 26 వేలు
  • ట్యాక్సీ డ్రైవర్లు : 3 వేలు
  • వాహన మిత్ర లబ్ధిదారులు : 11,236 (కర్నూలు), 7,698 (నంద్యాల)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు