logo

బీమా.. జగన్‌ డ్రామా

తెదేపా హయాంలో చంద్రన్న బీమా పథకం అమలు చేశారు. సాధారణ మరణం అయితే యాబై ఏళ్ల వయస్సు ఉన్నవారికి రూ.2 లక్షలు, 50 ఏళ్లకు పైబడి 59 ఏళ్ల వయస్సు వారికి రూ.30 వేల బీమా పరిహారం అందించారు.

Updated : 17 Apr 2024 05:26 IST

మృతులు వేలల్లో.. పరిహారం వందల్లో
వైకాపా ప్రభుత్వం విచిత్ర నిబంధనలు
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే


చంద్రన్న ఉదారత..

తెదేపా హయాంలో చంద్రన్న బీమా పథకం అమలు చేశారు. సాధారణ మరణం అయితే యాబై ఏళ్ల వయస్సు ఉన్నవారికి రూ.2 లక్షలు, 50 ఏళ్లకు పైబడి 59 ఏళ్ల వయస్సు వారికి రూ.30 వేల బీమా పరిహారం అందించారు. కుటుంబంలో ఎవరు చనిపోయినా పరిహారం ఇచ్చేవారు. ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు ఇచ్చారు. డ్రైవింగ్‌ లైసెన్సుతో సంబంధం లేకుండా వర్తింపజేశారు. రెండు నెలల్లోపే పరిహారం పంపిణీ చేశారు.

జగనన్న కక్కుర్తి

వైఎస్సార్‌ బీమా కింద మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో 30.63 లక్షల మంది పాలసీదారులను నమోదు చేశారు. 18-50 ఏళ్లు ఉండి సంపాదించే వ్యక్తి సహజ మరణం చెందితే ఆ కుటుంబానికి రూ.లక్ష, 18-70 ఏళ్ల మధ్య ఉండి సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 42 లక్షల వరకు జనాభా ఉంది. కుటుంబ యజమాని చనిపోతేనే వైఎస్సార్‌ బీమా వర్తిస్తుంది. ఆ కుటుంబంలో భార్య, పిల్లలు చనిపోతే బీమా పరిధిలోకి రారు. కుటుంబ యజమానికి 50 ఏళ్లకు పైబడి ఉండి సాధారణ మరణమైతే బీమా వర్తించదు.


గొప్పలు చెప్పారు

కేంద్రం ఇచ్చే 50 శాతం వాటా ఇప్పుడు లేనప్పటికీ దేశంలో ఎక్కడా లేనివిధంగా పూర్తి ఖర్చు రాష్ట్రమే భరిస్తూ ఉచిత బీమా అమలు చేస్తోంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయి నిస్సహాయ స్థితిలోని నిరుపేద కుటుంబాలకు ఆలంబనగా జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ వైఎస్సార్‌ బీమా.!!

ముఖ్యమంత్రి జగన్‌ ప్రగల్భాలు!


వేదన మిగిల్చారు

తెదేపా ప్రభుత్వ హయాంలో కార్డులో ఉన్నవారందరికీ బీమా వర్తించేది. వైకాపా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత 2021-22 నుంచి వైఎస్సార్‌ బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఒక కార్డుకు ఒక్కరికే పరిమితం చేసింది. సాధారణంగా 18-70 ఏళ్ల మధ్య వయస్సు వారికి బీమా వర్తింపజేయాలి. 50-70 ఏళ్ల మధ్య వయస్సువారు ఎక్కువగా చనిపోతుంటారని భావించిన ప్రభుత్వం బీమా పథకం వర్తింపజేయడంలో కక్కుర్తి పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. గత మూడేళ్లలో 37,500 మృతి చెందితే 7,386 మందికే బీమా కల్పించారు.


కొర్రీలు పెట్టి.. కోత విధించి

  • కర్నూలు జిల్లాలో మూడేళ్లలో 4,281 మంది వైఎస్సార్‌ బీమా పాలసీదారులు మరణిస్తే అందులో 3,895 మంది బాధిత కుటుంబాలకే బీమా వర్తింపజేశారు. వివిధ కారణాలతో 386 మందికి బీమాలో కోత విధించారు. ప్రమాద మరణాలు చాలా తక్కువగా చూపుతున్నారు. మూడేళ్లలో కేవలం 360 మంది ప్రమాద మృతులను చూపారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో నెలకు 10 ప్రమాద మరణాలు జరిగినట్లు.. అవి బీమా కింద నమోదైనట్లు చూపడం గమనార్హం.
  • అధికారుల లెక్కల ప్రకారం నంద్యాల జిల్లాలో మూడేళ్లలో 3,602 పాలసీదారులు మరణించగా ఏటా 1,163 మంది చొప్పున మూడేళ్లకు 3,491 మంది బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా పరిహారం చెల్లించారు. వివిధ కారణాలతో వందకుపైగా క్లెయిమ్‌లకు  అందలేదు.

మట్టి ఖర్చులూ ఇవ్వడం లేదు

  • బాధితులు మృతి చెందిన రోజునే మట్టి ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాల్సి ఉంది. నెలలు గడిచినా ఇవ్వడం లేదు. ప్రమాద మరణాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌, మరణ ధ్రువీకరణ పత్రం, శవ పరీక్ష నివేదిక (పోస్టుమార్టం) ఉంటేనే పరిహారం వస్తుందని అధికారులు చెబుతున్నారు. రహదారి ప్రమాదాల్లో చనిపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధన కచ్చితం చేశారు. ఈ కారణంతో ఏటా వేలాది మందికి బీమా అందడం లేదు.
  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకు 205 మంది బాధిత కుటుంబాలకు బీమా పరిహారం పంపిణీ అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓ వ్యక్తి సాధారణ మరణమైతే ఆ కుటుంబానికి రూ.లక్ష సాయమందించాలి. దరఖాస్తు చేసుకున్న బాధిత కుటుంబానికి మొదట రూ.10 వేలు ఇస్తున్నారు. మిగిలిన సొమ్ముకు బాధిత కుటుంబాలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాయి.

ఆందోళన చేసినా ఆలకించరు

2021 నుంచి ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన 236 మంది బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ప్రమాద బీమా పరిహారం మంజూరు చేయలేదు. దీంతో బాధిత కుటుంబాలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నాయి. యూనివర్సల్‌ సోం బీమా కంపెనీ బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల చేయడం లేదు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల మరణాలు రెండు వేల వరకు ఉన్నాయి. సాధారణ మరణాలు ఉమ్మడి జిల్లాలో 10 వేలకుపైగా ఉన్నాయి. ఆ బాధిత కుటుంబాలు బీమా పరిహారం కోసం ఎదురుచూసి చివరికి మరిచిపోయే పరిస్థితి నెలకొంది.


7,386 మందికే పరిహారం

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏటా సాధారణ, ప్రమాదవశాత్తుగా 7,500 మంది చనిపోతుండగా.. అందులో 1,200 వరకు ప్రమాద మరణాలే ఉన్నాయి. మరో 5 వేలకుపైగా ఇళ్ల దగ్గర చనిపోతున్నవారున్నారు. ఈ లెక్కన సాధారణ, ప్రమాద మరణాలు ఏటా 12,500 సంభవిస్తున్నాయి. మూడేళ్లలో 37,500 మరణాలు సంభవిస్తే.. వైఎస్సార్‌ బీమా కింద మూడేళ్లలో కేవలం 7,386 క్లెయిమ్‌లకే బీమా వర్తింపజేశారు. వివిధ కారణాలతో 497 క్లెయిమ్‌లకు దక్కలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని