logo

వరాల జల్లు కురిపించేనా..!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనపై పాలమూరు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి సీఎంగా కేసీఆర్‌ గతేడాది వనపర్తి, మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ భవనాల ప్రారంభోత్సవానికి వచ్చారు.

Updated : 06 Jun 2023 05:38 IST

కేసీఆర్‌ పర్యటనపై పాలమూరువాసుల ఆశలు
నాగర్‌కర్నూల్‌కు నేడు సీఎం రాక

ఈనాడు, మహబూబ్‌నగర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనపై పాలమూరు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి సీఎంగా కేసీఆర్‌ గతేడాది వనపర్తి, మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ భవనాల ప్రారంభోత్సవానికి వచ్చారు. 2019లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పరిశీలించడానికి వచ్చారు. అధికారికంగా జరిగిన ఈ మూడు కార్యక్రమాల్లో ఇక్కడి ప్రాంత ప్రజలకు కేసీఆర్‌ ఎన్నో వరాలు గుప్పించారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, గద్వాల ఎమ్మెల్యే కృష్ణామోహన్‌రెడ్డిలను పరామర్శించడానికి వ్యక్తిగతంగా వచ్చారు. నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించడానికి మంగళవారం మరోసారి సీఎం ఈ ప్రాంతానికి రానున్నారు. ఈ సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు. పాలమూరుకు వరాల జల్లు గుప్పిస్తారని, గత హామీలపై కూడా దృష్టి పెడతారన్న భరోసాలో ఉన్నారు.

 

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని  వట్టెం జలాశయం కరకట్ట

ప్రాజెక్టులే ప్రధాన అస్త్రంగా..

ఉమ్మడి పాలమూరులో ప్రాజెక్టులే ప్రధాన అస్త్రంగా కేసీఆర్‌ హామీలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సచివాలయం ప్రారంభోత్సవం కాగానే అధికారులతో మొదటి సమీక్ష పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపైనే పెట్టారు. ఈ నెలగానీ, వచ్చే నెలాఖరుకుగానీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 2019లో పాలమూరు ప్రాజెక్టు పనులను పరిశీలించిన సమయంలో ఏడాది లోపు పనులను పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు పనులు మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదు. 2020లో కరోనా రావడం, హరిత ట్రైబ్యునల్‌ కేసులు, నిధుల కొరత వెరసి పనులు నెమ్మదించాయి. ఈ పనులు గడువులోగా పూర్తి కావాలంటే పెద్ద ఎత్తున నిధులు కావాలి. శ్రీశైలం తిరుగు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. తాగునీరు, పరిశ్రమల అవసరాలకు కూడా నీటి కొరత తీరనుంది. దీనిపైనే పాలమూరు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
* నిర్మిత ప్రాజెక్టులైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ పరిధిలో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన అదనపు ఆయకట్టు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తి కావాలంటే భారీగా నిధులు అవసరం. గత నాలుగైదేళ్లుగా నిర్మిత ప్రాజెక్టుల అదనపు ఆయకట్టు పనులు ముందుకు సాగడం లేదు. వీటికి కూడా నిధులు భారీగా అవసరం. వీటికి నిధుల ప్రకటనపై  ఆయకట్టు రైతులు ఆశ పెట్టుకున్నారు.
* తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పరిధిలో మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు జలాశయాలను నిర్మించాల్సి ఉంది. ఇటీవల సీఎం మల్లమ్మకుంట జలాశయానికి ఆమోదం తెలిపారు. జూలకల్లు, వల్లూరు జలాశయాల కోసం నిధులు మంజూరు చేస్తే వరద ఉన్నప్పుడే నీటిని తోడుకుని అవసరాలకు వాడుకోవచ్చు. సుమారు రూ.380 కోట్లు అవసరం ఉంటుంది.
* నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జూరాల జలాశయం ముంపు గ్రామాలైన అనుగొండ, దాదాన్‌పల్లి, అంకెన్‌పల్లిలకు ఇప్పటికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పనులు పూర్తికాలేదు.
* బీమా ప్రాజెక్టు పరిధిలో నేరడ్‌గం, సంగంబండ, భూత్పూరు జలాశయాల ప్రజలు కూడా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పరిధిలోని కానాయిపల్లి ప్రజలు శంకరసముద్రం జలాశయానికి భూములు ఇచ్చారు. వీరికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు.

సారూ.. వీటిపై దృష్టి సారించరూ!

ప్రజలు రెండు పడక గదుల ఇళ్లపై ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో వీటి నిర్మాణం ముందుకు సాగడం లేదు. నిధులు కొరతతోగుత్తేదారులు ముందుకు రావడంలేదు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 5 వేల మందికి రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేశారు. మరో ఐదు వేల వరకు ఇళ్లను పూర్తి చేయాల్సి ఉంది.   పాలమూరు జిల్లాల్లో వనపర్తి మినహా ఎక్కడా కూడా ఇంజినీరింగ్‌ కళాశాల లేదు. కనీసం మహబూబ్‌నగర్‌కైనా ఒక్క ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఉన్న 40వేల మంది మాదాసి కురువలు తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతున్నారు.

సభకు భారీగా ఏర్పాట్లు

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌ సమీపంలోని వెలమ సంఘం ఫంక్షన్‌ హాల్‌ పక్కన బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు.  పోలీసులు సభా ప్రాంగనాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. 1,200 మంది పోలిస్‌ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎస్పీ మనోహర్‌   బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  

షెడ్యూల్‌ ఇలా..: సీఎం కేసీఆర్‌ హెలీప్యాడ్‌లో సాయంత్రం 4 గంటలకు దిగుతారు. అక్కడి నుంచి నేరుగా భారాస జిల్లా కార్యాలయం వద్దకు వెళ్లి ప్రారంభిస్తారు. తర్వాత ఎస్పీ కార్యాలయాన్ని  ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొత్త కలెక్టరేట్‌కు వస్తారు. కలెక్టరేట్‌తోపాటు వైద్య కళాశాల శిలాఫలకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే కొద్దిసేపు ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షిస్తారు. 6 గంటలకు బహిరంగ సభ స్థలికి చేరుకొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని