logo

ఐటీ పరిశ్రమలో కొలువులేవీ?

రాష్ట్రంలో టైర్‌-2 పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న లక్ష్యం ఉమ్మడి జిల్లాలో నీరుగారిపోతోంది. భారాస ప్రభుత్వం మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో ఐటీ టవర్‌ నిర్మాణాలకు సంకల్పించింది.

Published : 16 Apr 2024 03:34 IST

పాలమూరుపై కంపెనీల అనాసక్తి  
వనపర్తిలో శంకుస్థాపనకే పరిమితం

మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌

ఈనాడు, మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలో టైర్‌-2 పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలన్న లక్ష్యం ఉమ్మడి జిల్లాలో నీరుగారిపోతోంది. భారాస ప్రభుత్వం మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో ఐటీ టవర్‌ నిర్మాణాలకు సంకల్పించింది. మహబూబ్‌నగర్‌లో 2018 జులై 7న ఐటీ టవర్‌ పైలాన్‌ను ఆవిష్కరించింది. జిల్లా కేంద్రం శివారులోని ఎదిర, దివిటిపల్లిలోని 556, 607 సర్వే నంబర్లలో 371 ఎకరాల్లో ఐటీ, మల్టీపర్పస్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని ఐదెకరాల్లో ఐటీ టవర్‌ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. గతేడాది మేలో దీనిని ప్రారంభించారు. కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు రాలేదు. రెండు, మూడు కంపెనీలు వచ్చినా నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. వనపర్తి శివారులో గతేడాది సెప్టెంబరులో రూ.45 కోట్లతో ఐటీ టవర్‌ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఏడు నెలలు గడుస్తున్నా ఈ నిర్మాణానికి అడుగు కూడా ముందుకు పడలేదు.

మహబూబ్‌నగర్‌లో ప్రారంభించినా..: మహబూబ్‌నగర్‌ శివారులో 5 ఎకరాల్లో ఐటీ టవర్‌ భవనాన్ని గత ఏడాది ప్రారంభించారు. ఈ టవర్‌ను 19,370 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం జీ+4 అంతస్తుల్లో ఏర్పాటు చేయగా రూ.40 కోట్లు ఖర్చయ్యాయి. ఈ భవనం ప్రారంభం సందర్భంగా తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ కేంద్రం(టాస్క్‌), టీ-హబ్‌, వీ హబ్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముల్లర్‌ డాట్‌ కనెక్షన్‌, అమరరాజ గ్రూప్‌, జువెన్‌ టెక్నాలజీస్‌, ఇంటూట్స్‌ ఎల్‌ఎల్‌సి, ఉర్పాన్‌ టెక్నాలజీస్‌, ఈ-గ్రోస్‌ సిస్టమ్స్‌, ఐటీ విజన్‌ 360 ఇంక్‌, ఫొర్‌ ఓక్స్‌ఇంక్‌, బీసీడీసీ క్లౌడ్‌ కేంద్రాలకు ఈ టవర్‌లో పని చేసేందుకు అనుమతి పత్రాలను అందించారు. వాటిలో చాలా కంపెనీలు ప్రస్తుతం ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు. ఇటీవల రెండు, మూడు పరిశ్రమలు ముందుకొచ్చినా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు చేపట్టడం లేదు. మిగతా పరిశ్రమలిక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపడంలేదు. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉండడం, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట వ్యవధిలో చేరుకోవడం తదితర కారణాలతో ఇక్కడికి ఐటీ పరిశ్రమలు ఎక్కువగా వస్తాయని ఆశించినా ఇవేవీ జరగలేదు. ఈ టవర్‌ పూర్తయితే కనీసం 10 వేల మందికి ఉద్యోగాలొస్తాయని అప్పట్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించారు. కనీసం ఇక్కడ 300 మంది కూడా సరిగ్గా ఉపాధి పొందడం లేదు. అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.

పురోగతి లేదు..: ఉమ్మడి జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న పట్టణాల్లో వనపర్తి ఒకటి. జిల్లా కేంద్రం కూడా కావడంతో ఇక్కడ ఐటీ టవర్‌ నిర్మాణానికి భారాస ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టణ శివారులోని నాగవరంలో రెండెకరాల స్థలంలో రూ.45కోట్లతో అప్పటి ప్రభుత్వం భూమి పూజ చేసింది. టీఎస్‌ఐసీసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణంతోపాటు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ ఐటీ టవర్‌ ఏర్పాటుకు సంబంధించిన ఎలాంటి పురోగతి లేదు. దీనిపై టీఎస్‌ఐఐసీ మహబూబ్‌నగర్‌ ఇన్‌ఛార్జి మేనేజర్‌ విజయ్‌కుమార్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో అప్పట్లో తొమ్మిది సంస్థలు ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమేనని ప్రస్తుతం రెండు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని