logo

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 25 వరకు నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో నామ పత్రాలను సమర్పించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తేజస్‌నందలాల్‌ పవార్‌ అన్నారు.

Published : 17 Apr 2024 05:28 IST

మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి తేజస్‌ నందలాల్‌ పవార్‌

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 25 వరకు నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో నామ పత్రాలను సమర్పించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తేజస్‌నందలాల్‌ పవార్‌ అన్నారు. మంగళవారం వనపర్తి కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. వారికి నోటిఫికేషన్‌ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18న నాగర్‌కర్నూల్‌ రిటర్నింగ్‌ అధికారి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు నేరుగా రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించాలన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా కూడా అవకాశం ఉందన్నారు. ఆన్‌లైన్‌లో హార్డ్‌ కాపీలను రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రచార అనుమతులు సహాయ రిటర్నింగ్‌ అధికారి నుంచి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాయ రిటర్నింగ్‌ అధికారి నగేశ్‌, ఆర్డీవో పద్మావతి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

24 గంటల్లో ఆన్‌లైన్‌లో ధాన్యం కొనుగోలు వివరాల నమోదు

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను 24 గంటల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 242 కేంద్రాలన్నింటినీ ప్రారంభించాలని సూచించారు. కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలన్నారు. పంట విక్రయించిన రైతులకు 24 గంటల్లోనే వారి ఖాతాలో డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లుల నుంచి రావాల్సిన సీఎంఆర్‌ బియ్యం సకాలంలో అందించే విధంగా ఉప తహసీల్దార్లు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గత మూడు సీజన్లకు సంబంధించి మిల్లర్లు కార్పొరేషన్‌కు 18 వేల మెట్రిక్‌ టన్నులు ఇవ్వాల్సి ఉందన్నారు. నాణ్యత లేని బియ్యం ఇచ్చిన మిల్లర్లకు నోటీసులు పంపి ధాన్యాన్ని వెనక్కి పంపామన్నారు. వారి నుంచి నాణ్యమైన ధాన్యం తిరిగి సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్‌వో శ్రీనివాసులు, డీఎం ప్రవీణ్‌, మార్కెటింగ్‌ అధికారి స్వరణ్‌సింగ్‌, డీఆర్డీవో నాగేంద్ర, ఉప తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని