logo

అడవిలో జలధార

అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వేసవి సమీపిస్తుండటంతో వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు సమీప గ్రామాల్లోకి వస్తూ ప్రమాదాలకు గురవుతున్నాయి.

Published : 17 Apr 2024 05:38 IST

నల్లమలలో సౌర బోరు మోటార్లతో నీటి వసతి

సౌర బోరు ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు

బిజినేపల్లి, న్యూస్‌టుడే : అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వేసవి సమీపిస్తుండటంతో వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు సమీప గ్రామాల్లోకి వస్తూ ప్రమాదాలకు గురవుతున్నాయి. కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం, వేటగాళ్ల బారినపడుతుండటాన్ని గుర్తించిన అధికారులు వన్యప్రాణులను రక్షించేందుకు కృషి చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఏర్పాటు చేసిన సోలార్‌ బోరు మోటార్లు మంచి ఫలితాలు ఇవ్వనున్నాయి. వన్యప్రాణులు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో, బోర్లు వేయడానికి ప్రతికూల పరిస్థితులు ఉన్నచోట సాసర్లు, గుంతలు ఏర్పాటు చేసి, వాటిలో నీళ్లు నింపుతున్నారు.

  • ఒక్కో సోలార్‌ బోర్‌ మోటార్‌కు రూ. 4.5 లక్షల వ్యయం చేశారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌) పరిధిలో నల్లమల అటవీప్రాంతంలో సుమారు 28 సోలార్‌ బోర్‌ మోటార్లు ఏర్పాటు చేశారు.

ఖీమ్యాతండా పరిధిలో మచ్చల జింక సంచారం

  • బిజినేపల్లి మండలం గంగారం అటవీక్షేత్ర పరిధిలో సుమారు 2 వేల ఎకరాలకుపైగా విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో వందలాది కృష్ణజింకలు, చుక్కలజింకలు, నెమళ్లు, అడవి పందులు, వివిధ రకాలు పక్షులు ఉన్నాయి. వర్షాకాలం, శీతాకాలంలో వాటి మనుగడకు ఎటువంటి ప్రమాదం లేకపోయినా, వేసవిలో మాత్రం తాగునీటి కోసం సమీప గ్రామాలైన మీఠ్యాతండా, కీమ్యాతండా, శాయిన్‌పల్లి గ్రామ సమీపంలోకి వస్తూ కుక్కలదాడిలో మృత్యువాత పడుతున్నాయి. గతంలో పదుల సంఖË్యలో కృష్ణజింకలు కుక్కల దాడిలో మృతిచెందిన ఘటనలున్నాయి. స్పందించిన అటవీశాఖ అధికారులు రూ.లక్షల వ్యయంతో కీమ్యాతండా పరిధిలో సోలారు బోరు మోటారు, సాసర్లు ఏర్పాటు చేశారు. వాగులు, వంకలు ఉన్నచోట గుంతలను ఏర్పాటుచేసి ట్యాంకర్ల ద్వారా నిత్యం నీటిని నింపుతున్నారు. దీంతో మూగజీవాలు జనావాసాల్లోకి రాకుండా దాహార్తిని తీర్చుకుంటున్నాయి. తద్వారా అటవీ జంతువుల మరణాలు తగ్గడంతో పాటూ, సంతతి వృద్ధి చెందుతోందని అధికారులు చెబుతున్నారు.

వన్యప్రాణుల దాహార్తి తీరనుంది : గంగారం అటవీ పరిధిలోని కీమ్యాతండా సరిహద్దులో ఏర్పాటు చేసిన సోలార్‌ బోరు ద్వారా నిత్యం నీటి సరఫరా జరుగుతోంది. జింకలు సంచరించే ప్రదేశాల్లో కాలువలు, గుంతలు ఏర్పాటు చేసి నీటితో నింపుతున్నాం. దీంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా దాహాన్ని తీర్చుకుంటూ, స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.

ఫర్వేజ్‌ అహ్మద్‌, అటవీశాఖ రేంజ్‌ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని