logo

ఆదాయం ఘనం.. వసతులు అధ్వానం

ఆదాయం పెంపుపై దృష్టిపెడుతున్న ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలన్న బాధ్యత మాత్రం విస్మరిస్తోంది. ఉమ్మడి జిల్లాలో అత్యధిక బస్సులు, ప్రయాణికులు రాకపోకలు సాగించే జడ్చర్ల బస్టాండులో అనేక సమస్యలు పేరుకుపోయాయి.

Published : 17 Apr 2024 05:47 IST

అందుబాటులో మరుగుదొడ్లు లేక మహిళల పాట్లు

జడ్చర్ల బస్టాండులో ప్రయాణికుల రద్దీ

న్యూస్‌టుడే, జడ్చర్ల గ్రామీణం: ఆదాయం పెంపుపై దృష్టిపెడుతున్న ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలన్న బాధ్యత మాత్రం విస్మరిస్తోంది. ఉమ్మడి జిల్లాలో అత్యధిక బస్సులు, ప్రయాణికులు రాకపోకలు సాగించే జడ్చర్ల బస్టాండులో అనేక సమస్యలు పేరుకుపోయాయి. ఈ బస్టాండుకు నిత్యం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకకు చెందిన 1,200 బస్సులు వచ్చి పోతున్నాయి. 60వేలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఇక్కడి ఏడు వ్యాపార సముదాయాలు, క్యాంటీన్‌ నుంచి ఆర్టీసీకి రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నా ప్రయాణికుల సమస్యలు పట్టించుకోవటం లేదు.

బస్టాండులో పరిస్థితి ఇదీ..

  • ప్రస్తుతం ఇక్కడ ద్విచక్ర వాహన పార్కింగ్‌ సౌకర్యం మాత్రమే ఉంది. కార్లకు పార్కింగ్‌ సౌకర్యం లేకపోవటంతో ఖాళీ స్థలంలో నిలుపుతున్నారు. చాలామంది ప్రైవేటు స్థలాల్లో డబ్బులు చెల్లించి కార్లు నిలుపుతున్నారు. బస్టాండులోని ఖాళీ స్థలంలో కారు పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తే ఆదాయం పెరగటంతో పాటు ప్రయాణికుల సమస్య తీరనుంది.
  • డ్రైవర్లు, కండక్టర్లకు ఉచితంగా అల్పాహారం, భోజనం అందిస్తుండటంతో బస్సులన్నీ క్యాంటీన్‌ ముందే ఆపుతున్నారు. పెరిగిన రద్దీ దృష్ట్యా కర్నూల్‌ వైపు ఖాళీ స్థలంలో మరో క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తే ఆదాయం పెరగడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. బస్సులు ఎక్కడికక్కడ నిర్దేశిత స్థలంలో ఆగుతాయి.
  • ఇక్కడ వ్యాపారులకు పాల ఉత్పత్తులు, చల్లని పానీయాలు, టీస్టాల్‌ నిర్వహణకు టెండర్‌ నిర్వహించి అవకాశం కల్పిస్తే అన్ని రకాల వస్తువులు విక్రయించటంతో పాటు అధిక ధరలతో ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు.
  • గతంలో ఎమ్మెల్సీగా ఉన్న ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ తన నిధులతో ఇక్కడ నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. దీని నీటిని ప్రయాణికులు తాగేలా బస్టాండు నలుమూలల నల్లాలు ఏర్పాటు చేయొచ్చు. ఆర్టీసీ అలా చేయలేదు. వేసవిలో ప్రయాణికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల సత్యసాయి ట్రస్టు వారు చలివేంద్రం ఏర్పాటుచేసి కొంత ఉపశమనం కల్పించారు.

నిరుపయోగంగా మరుగుదొడ్లు


దూరప్రాంతాల నుంచి వచ్చే లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఇక్కడ ఆగుతాయి. అందుబాటులో మరుగుదొడ్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్‌నగర్‌ వైపు, జాతీయ రహదారి-44 వైపు ఉచితంగా వాడుకునేలా గతంలో నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్లు ఇప్పుడు వృథాగా మారాయి. ప్రైవేటు సులభ్‌ కాంప్లెక్స్‌ మూలన ఉంది. దూరంగా ఉన్న ఆ ప్రైవేటు మరుగుదొడ్ల వద్దకు వెళ్లి వచ్చేలోపు బస్సులు వెళ్లిపోతాయని అక్కడికి వెళ్లడం లేదు. ఖాళీ స్థలం ఉన్నందున అందుబాటులో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.


అధికారులేమన్నారంటే.. : ఆర్టీసీ మహబూబ్‌నగర్‌ ఆర్‌ఎం శ్రీదేవిని ‘న్యూస్‌టుడే’ ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేయగా ఆమె అందుబాటులోకి రాలేదు. జడ్చర్ల బస్టాండు మేనేజర్‌ జమరాజ్‌ని సంప్రదించగా సమస్యలను తాము గుర్తించి ఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లామని, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని