logo

వారసత్వంపై అలసత్వం

రాష్ట్రంలోనే వారసత్వ సంపదకు పాలమూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. రాజుల కోటలు, ఆలయాలు, శిల్పకళలు, సంస్థానాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పెట్టింది పేరు.

Published : 18 Apr 2024 04:16 IST

నిరాదరణకు గురవుతున్న పురాతన కట్టడాలు ఇలా...

ఈనాడు, మహబూబ్‌నగర్‌:  రాష్ట్రంలోనే వారసత్వ సంపదకు పాలమూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. రాజుల కోటలు, ఆలయాలు, శిల్పకళలు, సంస్థానాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పెట్టింది పేరు. నంద వంశం నుంచి అసఫ్‌ జాహీ రాజవంశం వరకు 22 రాజ వంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు గుట్టలను కోటలు, దుర్గాలుగా మలచుకొని రాజ్యపాలన చేశారు. కోటలను ఎంతో నైపుణ్యంగా, కళాత్మక దృష్టితో తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ కోటలు శిథిలావస్థకు చేరాయి. ఉమ్మడి జిల్లాలోని సంస్థానాధీశులు నిర్మించిన భవనాలు కూలిపోయే పరిస్థితికి వచ్చాయి. ఆదిమానవులు నివసించిన ప్రాంతంగా కృష్ణా తీరంలోని మూడుమాల్‌కు గుర్తింపు ఉంది. వారు ఏర్పాటు చేసిన నిలువురాళ్లకు ప్రత్యేక గుర్తింపు రావడం లేదు. ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల్లో ఉన్న శిల్పకళా సంపద కూడా ధ్వంసమయ్యే పరిస్థితి వచ్చింది. కృష్ణా, తుంగభద్ర, దుందుభి నదీ తీరాల్లో ఉన్న ఆలయాలు నిరాదరణకు గురవుతున్నాయి. పూర్వ మహబూబ్‌నగర్‌లో మొత్తం 34 ప్రాంతాలను పర్యాటకంగా, ప్రపంచ వారసత్వ సంపదకు నిలయంగా ప్రభుత్వాలు గుర్తించాయి. నేడు ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’ సందర్భంగా ప్రాభవం కోల్పోతున్న కోటలు, శిల్పకళా సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ప్రత్యేక నిధులు కేటాయించి వీటిని అభివృద్ధి చేస్తే ఈ వారసత్వ కట్టడాలకు మనుగడ ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని