logo

నామపత్రాల సమర్పణకు వేళాయె

పాలమూరులోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో గురువారం నుంచి నామపత్రాల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Published : 18 Apr 2024 04:19 IST

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ రిటర్నింగ్‌ కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తి
నేడు నామినేషన్లు సమర్పించనున్న డీకే అరుణ, భరత్‌ప్రసాద్‌, మల్లు రవి

ఈనాడు, మహబూబ్‌నగర్‌: పాలమూరులోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో గురువారం నుంచి నామపత్రాల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబ్‌నగర్‌  పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌లో, నాగర్‌కర్నూల్‌ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాల్లో నామపత్రాలు స్వీకరించనున్నారు.  మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రవినాయక్‌, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఈ నెల 18 నుంచి  25 వరకు నామినేషన్లు తీసుకుంటారు. 21న ఆదివారం సెలవు కావడంతో ఆ రోజు స్వీకరించరు. మొత్తం ఏడు రోజులు అభ్యర్థుల నుంచి నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారులు తీసుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీటిని సమర్పించవచ్చు. నామపత్రాలు సమర్పించే అభ్యర్థులకు రిటర్నింగ్‌ కార్యాలయం వరకు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగతా వాహనాలను 100 మీటర్ల దూరంలో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థి వెంట ఐదుగురికి మాత్రమే లోపలికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థులకు నియోజకవర్గం పరిధిలోని ఒక ఓటరు, ఇతరులకు 10 మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. నామపత్రాలు సమర్పించే అభ్యర్థులు రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్‌ సమర్పించాల్సి ఉంటుంది. రిటర్నింగ్‌ కార్యాలయం పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

నేటి నుంచి సందడి..: మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ(భాజపా), వంశీచంద్‌రెడ్డి(కాంగ్రెస్‌), మన్నె శ్రీనివాస్‌ రెడ్డి (భారాస) బరిలో ఉన్నారు. నాగర్‌కర్నూల్‌లో భరత్‌ప్రసాద్‌(భాజపా), మల్లు రవి (కాంగ్రెస్‌), ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ (భారాస) పోటీలో ఉన్నారు. నామపత్రాల సమర్పణకు గెజిట్‌ నోటిఫికేషన్‌ గురువారం విడుదల కానుండటంతో సందడి నెలకొననుంది. భాజపా అభ్యర్థి డీకే అరుణ నేడు నామపత్రాలు సమర్పించనుండగా కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి గడియారం చౌరస్తా కూడలిలో సభ ఏర్పాటు చేయనున్నారు. 19న కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామపత్రాలు దాఖలు చేయనుండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. అనంతరం గడియారం చౌరస్తాలో ఏర్పాటు చేసే సభలో సీఎం మాట్లాడతారు. భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి కూడా 19న నామపత్రాలు దాఖలు చేయనుండగా పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గురువారం భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి నామపత్రాలు దాఖలు చేయనున్నారు. 19న భారాస అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ నామినేషన్‌ వేయనున్నారు. వీరితోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. 18, 19, 24వ తేదీల్లో మంచి రోజులు ఉండటంతో ఈ మూడు రోజుల్లోనే పెద్ద ఎత్తున నామపత్రాలు దాఖలయ్యే అవకాశాలున్నాయి. నాగర్‌కర్నూల్‌ భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ 25న రెండోసారి వేసే నామినేషన్‌కు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని