logo

ఎరువుల రేక్‌ పాయింట్‌ జిల్లాకు వరం

 ఎరువుల రేక్‌పాయింట్‌ జిల్లా రైతాంగానికి వరం లాంటిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏరువుల రేక్‌పాయింట్‌ను వారు సోమవారం ప్రారంభించారు.

Published : 28 Jun 2022 01:11 IST

కేసీఆర్‌ కృషితో గజ్వేల్‌ గడ్డ అభివృద్ధిలో అగ్రగామి

మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి


గూడ్స్‌ రైలు వద్ద స్థానికుల సందడి

గజ్వేల్‌, న్యూస్‌టుడే:  ఎరువుల రేక్‌పాయింట్‌ జిల్లా రైతాంగానికి వరం లాంటిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏరువుల రేక్‌పాయింట్‌ను వారు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గజ్వేల్‌ ఏఎంసీ ఛైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రైతులకు ఎరువుల కష్టాలు తీర్చేందుకు ఉమ్మడి జిల్లా కోసం తూప్రాన్‌ ప్రాంతంలో ఎరువులు రేక్‌పాయింట్‌ ఏర్పాటు చేయాలని సమైక్య రాష్ట్రంలో ఎన్నో సార్లు విజ్ఞప్తులు చేసినా, జడ్పీ సమావేశంలో నెత్తినోరు మొత్తుకున్నా అప్పటి ప్రభుత్వాలు చెవిన పెట్టలేదన్నారు. జిల్లాకు ఎరువులు రావాలంటే హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ నుంచి వచ్చేవని ట్రాఫిక్‌ ఆంక్షలతో రాత్రిపూట మాత్రమే తీసుకొచ్చేందుకు వీలుండేదన్నారు. తద్వారా సీజన్‌లో సకాలంలో ఎరువులు అందక రైతులు అరిగోస పడేవారన్నారు. బస్తా ఎరువు కోసం వరుసలో నిలబడే రోజుల నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో రైలు వచ్చి, రేక్‌పాయింట్‌ అందుబాటులోకి రావటంతో మన వద్దనే 20 వేల మెట్రిక్‌ టన్నుల స్టాక్‌ పెట్టుకునే స్థాయికి ఎదిగామన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రేక్‌పాయింట్‌ వల్ల ఎరువులు దిగుమతి చేసుకోవటంతోపాటు గూడ్స్‌ రైలు సౌకర్యంతో అనేక రకాలైన వస్తువులను ఎగుమతి చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. రైతులకు, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించి లబ్ధిపొందాలని కాంగ్రెస్‌, భాజపా నాయకులు పగటి కలలు కంటున్నారన్నారు. కేంద్రాన్ని ఏలుతున్న భాజపా ప్రభుత్వం వరిసాగు, వడ్ల కొనుగోలులో బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుందన్నారు.

హమాలీలతో మాటామంతీ
గూడ్స్‌ రైలులోంచి ఎరువులు దింపుతున్న బిహార్‌ హమాలీలతో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణలో చేతినిండా పని దొరుకుతుందని ఇక్కడ ఎంతో బాగుందని హమాలీలు బదులిచ్చారు. గజ్వేల్‌లోని ఐఓసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 557 లబ్ధిదారులకు రూ.5.56 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. 108 మంది లబ్ధిదారులకు రూ.82.60 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశారు. కొత్త గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధుల మంజూరు పత్రాన్ని మంత్రి హరీశ్‌రావు ఆయా సర్పంచులకు అందజేశారు. పట్టణంలోని సమీకృత విపణిని మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం సందర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఫారూఖ్‌ హుస్సేన్‌, యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు రోజాశర్మ, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు దేవీ రవీందర్‌, జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియా అధ్యక్షుడు రాజమౌళి, ఉపాధ్యక్షుడు జకీ, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ వెంకటేశం గౌడ్‌, సర్పంచ్‌ల ఫోరం గజ్వేల్‌ అధ్యక్షుడు చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైలు రాకతో స్థానికుల హర్షం
మనోహరాబాద్‌-గజ్వేల్‌ సెక్షన్‌లో అధికారికంగా మొదటి గూడ్స్‌ రైలు సోమవారం కూతపెడుతూ ఎరువుల లోడుతో అడుగిడటంతో స్థానికులు సంతోషంలో మునిగిపోయారు. రైలును చూసేందుకు తండోపతండాలుగా రావటంతో గజ్వేల్‌లోని రైల్వేస్టేషన్‌ జన సందడితో కళకళలాడింది. దక్షిణమధ్య రైల్వే శాఖ గజ్వేల్‌ను రైల్వే డివిజన్‌గా 2022లో నమోదు చేసింది. కాకినాడ నుంచి గజ్వేల్‌కు ఎరువులతో వచ్చిన రైలును పూలదండలతో అలంకరించారు. రోజాశర్మ, మహిళ ప్రజాప్రతినిధులు రైలుతో స్వీయ చిత్రాలు దిగారు. మంత్రులు ప్రారంభించిన అనంతరం ప్లాట్‌ఫారంపై లారీలను ఉంచి బస్తాలను హమాలీలు దించారు. అనంతరం గజ్వేల్‌ మార్కెట్‌యార్డులోని రేక్‌పాయింట్‌కు తరలించారు. మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు రైలు మార్గాన్ని సకాలంలో పూర్తి చేసి సరుకు రవాణాకు కృషి చేసిన నిర్మాణం, పర్యవేక్షక అధికారులను దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ ఒక ప్రకటనలో అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని