logo

అందోలు విజయం.. అధికారానికి మార్గం

అందోలు నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. 1985 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది.

Updated : 05 Nov 2023 05:04 IST

1985 నుంచి కొనసాగుతున్న సెంటిమెంటు

జోగిపేట పట్టణం

న్యూస్‌టుడే, జోగిపేట: అందోలు నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. 1985 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుపొందిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది. సిలారపు రాజనర్సింహ, ఆయన కుమారుడు దామోదర రాజనర్సింహ, అనంతరం మల్యాల రాజయ్య, సినీనటుడు బాబూమోహన్‌, చంటి క్రాంతికిరణ్‌ గెలుపొందినప్పుడు.. వారి పార్టీనే అధికారంలో ఉంది. ఇదొక సెంటిమెంటుగా స్థానికులు చర్చించుకుంటున్నారు.

వ్యవసాయ ఆధారిత ప్రాంతం

నియోజవకర్గ ప్రజలు అధికంగా వ్యవసాయంపైనే అధారపడి జీవిస్తున్నారు. పుల్కల్‌ మండలం సింగూరులో ప్రాజెక్టు ఉంది. ఈ జలాశయం ద్వారా పుల్కల్‌, చౌటకూరు, అందోలు మండలాల్లోని 40వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అందోలు మండలం తాలెల్మా వద్ద రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా మరో 10వేల ఎకరాలకు సాగు నీరు అందడంతో పాటు 15 చెరువులు, కుంటలను నింపుతున్నారు. మునిపల్లి, రాయికోడ్‌, జహీరాబాద్‌ ప్రాంతాల్లోని రైతుల కోసం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ఇటీవలే ప్రారంభించారు. దాని ద్వారా మరో లక్ష ఎకరాలకు సాగు నీటిని అందిచాలన్న లక్ష్యంతో ఉన్నారు.

ఎక్కువ సార్లు కాంగ్రెస్‌దే విజయం

అందోలు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009 వరకు అందోలు స్థానం పరిధిలో అందోలు, పుల్కల్‌ మునిపల్లి, అల్లాదుర్గం, రేగోడు, సదాశివపేట మండలాలు ఉండేవి. పునర్విభజన తరువాత సదాశివపేట మండలం సంగారెడ్డి నియోజకవర్గంలోకి వెళ్లింది. కొత్తగా రాయికోడ్‌, టేక్మాల్‌ మండలాలను అందోలు పరిధిలోకి చేర్చారు. 1952 నుంచి 1967 వరకు అందోలు జనరల్‌ కేటగిరీలో ఉండేది. 1967లోనే ఎస్సీ రిజర్వుడ్‌గా మార్చారు. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్‌ అభ్యర్థులు అధికంగా తొమ్మిది సార్లు విజయం సాధించారు. అందులో ఆరు సార్లు రాజనరసింహ కుటుంబ సభ్యులే గెలుపొందారు. నాలుగు సార్లు తేదేపా, రెండు సార్లు భారాస ఒక సారి స్వతంత్ర అభ్యర్థులను విజయం వరించింది.

మహిళా ఓటర్లే అధికం

అందోలు నియోజకవర్గం పరిధిలో అందోలు, పుల్కల్‌, చౌటకూరు, మునిపల్లి, రాయికోడ్‌, రేగోడు, వట్‌పల్లి, అల్లాదుర్గం, టేక్మాల్‌ మండలాలతో పాటు.. అందోలు-జోగిపేట మున్సిపాలిటీ ఉంది. మొత్తం ఓట్లు 2,45,409 మంది. వీరిలో పురుషులు 1,20,894 మంది కాగా మహిళలు 1,24,510. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని