logo

మెరిసిన ఆణిముత్యం

చదువు గురించి తెలియని అమ్మానాన్నలు నన్ను కష్టపడి చదివించారు. వారి కలలు నెరవేర్చడమే నా లక్ష్యమంటూ చదువులో ప్రతిభ చాటారు ఆ యువకుడు. మారుమూల తండాకు చెందిన

Published : 17 Aug 2022 04:39 IST

అడవిదేవులపల్లి, న్యూస్‌టుడే

చదువు గురించి తెలియని అమ్మానాన్నలు నన్ను కష్టపడి చదివించారు. వారి కలలు నెరవేర్చడమే నా లక్ష్యమంటూ చదువులో ప్రతిభ చాటారు ఆ యువకుడు. మారుమూల తండాకు చెందిన గిరిజన ఆణిముత్యం జాతీయ స్థాయిలో రాణించారు. ఐఎఫ్‌ఎస్‌లో జాతీయ స్థాయి ర్యాంకు సాధించి ఉన్న ఊరికి, కన్న తల్లిదండ్రులకు పేరు తెచ్చిపెట్టారు. భవిష్యత్తులో ఐఏఎస్‌ సాధించి పేదలకు సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఆయనే అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లికి చెందిన కుర్ర తావుర్యానాయక్‌ - మారోని దంపతుల కుమారుడు శ్రీను.

కుటుంబం
వ్యవసాయ కుటుంబానికి చెందిన తావుర్యాకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పెళ్లిళ్లు చేసిన తావుర్యా గ్రామ రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవలందించారు. ఆ తర్వాత వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు రాజకీయ హత్యకు గురయ్యారు. తావుర్యా మృతితో ఆయన భార్య మారోని 2013లో జరిగిన సర్పంచి ఎన్నికల్లో గెలుపొంది 2018 వరకు కొనసాగారు.

విద్యాభ్యాసం
కుర్ర శ్రీనివాస్‌ బాల్యం నుంచే చదువుపై ఎంతో శ్రద్ధ వహించేవారు. స్థానికంగా పదోతరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్‌ విజయవాడలోని ఓ ప్రయివేట్‌ కళాశాలలో పూర్తిచేసి ఐఐటీ జేఈఈలో ఎస్టీ కేటగిరీలో ఆలిండియా 22వ ర్యాంకు సాధించి మద్రాస్‌ ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం, రూ.లక్షల వేతనాలతో దేశీయంగా ఉద్యోగావకాశాలు వచ్చినా  సివిల్‌ సర్వీసెస్‌కు వెళ్లాలన్న సంకల్పంతో వాటిని వదిలేశారు. బీటెక్‌ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరి, ఉద్యోగం చేస్తూనే సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణ తీసుకున్నారు. ప్రైమ్‌ మినిస్టర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫెలోషిప్‌, భద్రాచలంలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు విద్య, వైద్యం, నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా అవగాహన కల్పించే విషయంలో అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఇలంబర్దికి ఏడాదిపాటు సహాయకుడిగా సేవలందించారు. 2014-15లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌(ఐఎఫ్‌ఎస్‌), 2015లో ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ఎస్‌) ఎంపికయ్యారు. ఐఏఎస్‌కు ఇంటర్వ్యూ వరకు వెళ్లి వచ్చారు. తదుపరి ఐఎఫ్‌ఎస్‌లో చేరి శిక్షణ అనంతరం ప్రస్తుతం కేరళలోని త్రిచూర్‌లో డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారిగా పనిచేస్తున్నారు.


 ఐఏఎస్‌ సాధించడమే లక్ష్యం

- కుర్ర శ్రీనివాస్‌

తల్లిదండ్రులు ఎంతో శ్రమించి నన్ను చదివించారు. నాన్న నిత్యం ప్రజల మధ్య ఉండి వారి కోసం పనిచేశారు. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది ఆయన కల. ప్రస్తుతం ఐఎఫ్‌ఎస్‌లో కొనసాగుతూ ప్రజలకు సేవలందిస్తున్నా, తండ్రి ఆశయ సాధనకు ఐఏఎస్‌ సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నా. భవిష్యత్తులో ఐఏఎస్‌ సాధించడం ద్వారా పేదలకు మరిన్ని సేవలందిస్తా. గెలుపోటములను సమానంగా స్వీకరించే గుణం అలవర్చుకోవాలి. ఆలోచన ధోరణి పాజిటివ్‌గా ఉండాలి. ఒకసారి పరాజయం ఎదురవగానే నిర్వేదం తగదు. నువ్వు యుద్ధం గెలిచేంత వరకూ ఏ శబ్దం చేయకు. నీ విజయమే పెద్ద శబ్దమై ప్రపంచానికి వినిపిస్తుందన్న మహాత్మాగాంధీ మాటలు మరువరాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని