logo

నూతన కలెక్టర్‌గా వినయ్‌ కృష్ణారెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి బదిలీ అయ్యారు. జిల్లా నూతన కలెక్టర్‌గా వినయ్‌కృష్ణారెడ్డి నియమితులయ్యారు.

Published : 01 Aug 2023 06:21 IST

కలెక్టర్‌ పమేలా సత్పతి బదిలీ

వినయ్‌కృష్ణారెడ్డి

భువనగిరి, న్యూస్‌టుడే: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి బదిలీ అయ్యారు. జిల్లా నూతన కలెక్టర్‌గా వినయ్‌కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ జిల్లాకు ఆయన మూడో కలెక్టర్‌. పమేలా సత్పతిని సాధారణ పరిపాలనా విభాగానికి బదిలీ చేశారు. రెండేళ్లపాటు ఆమె కలెక్టర్‌గా పనిచేశారు.
జిల్లాపై చెరగని ముద్ర... నృసింహసాగర్‌ భూసేకరణ.. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలు.. తుది దశకు చేరుకున్న యాదాద్రి ఆలయ పనులు.. సీఎం దత్తత గ్రామంగా వాసాలమర్రి పనులు ప్రారంభం.. ఇలా జిల్లాలో క్లిష్టతరమైన సమస్యలు నెలకొన్న సమయంలో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌గా పమేలా సత్పతి రెండేళ్ల కాలంలో జిల్లాపై చెరగని ముద్ర వేశారు. వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా పనిచేస్తూ ఆమె కలెక్టర్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్‌ పనిచేయకున్నా.. పాలనానుభవం లేకున్నా.. తనదైన శైలిలో జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే తనకు వచ్చిన ఆలోచనలు జిల్లాలో అమలు చేసి రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలిచారు. శుక్రవారం సభలు పేరుతో ఆమె గర్భిణులు, మహిళలు, బాలికల్లో రక్తహీనత తొలగించేందుకు అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశాలు సత్ఫలితాలనిచ్చాయి. మహిళలల్లో రక్తహీనత 51 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. బుధవారం బోధన, స్నేహిత, విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బస్వాపూర్‌లో నిర్మిస్తున్న నృసింహసాగర్‌ జలాశయంలో ముంపునకు గురవుతున్న బీఎన్‌ తిమ్మాపూర్‌ వాసులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భువనగిరిలో నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, పరిహారం అందించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని