logo

18న నోటిఫికేషన్‌, నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్‌

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్‌ జారీచేయడంతో పాటు అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు.

Updated : 17 Apr 2024 06:34 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ దాసరి హరిచందన, చిత్రంలో ఎస్పీ చందనా దీప్తి, తదితరులు

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్‌ జారీచేయడంతో పాటు అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఎస్పీ చందనా దీప్తితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్‌లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. పోటీచేసే అభ్యర్థులు ఫారం 2ఏ లో అన్ని వివరాలు పూరించి నామినేషన్‌ దాఖలు చేయాలన్నారు. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల వరకు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయవచ్చని తెలిపారు. పోటీచేయాలనుకునే జనరల్‌ అభ్యర్థులు రూ.25వేలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్‌ సమర్పించాలని చెప్పారు. గుర్తింపు పొందిన రాజకీయపార్టీల అభ్యర్థులను ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుందని, గుర్తింపు పొందని రాజకీయపార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను పది మంది ప్రతిపాదించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్‌తో పాటు ఫారం 26 ద్వారా అఫిడవిట్‌ దాఖలు చేయాలని, అందులో విద్యార్హతలు, కేసులు తదితర అంశాలు తప్పనిసరిగా పొందుపరచాలని స్పష్టం చేశారు. 25 ఏళ్ల వయసు కలిగి భారతీయుడై ఉండాలని, ఏదైనా నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలని అన్నారు. సంబంధిత రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువపత్రం తీసుకురావాలని వివరించారు. నామినేషన్‌ వేసే కంటే ముందే ఏదేని జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాలని సూచించారు. సెలవు దినాల్లో నామినేషన్‌ల స్వీకరణ ఉండదని చెప్పారు.

17,22521 మంది ఓటర్లు..

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో 2061 పోలింగ్‌ స్టేషన్లలో 17,22,521 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 18-19 ఏళ్ల వయసు గ్రూపు వాళ్లు 60,116 మంది ఉండగా, 85 ఏళ్లు నిండిన సీనియర్‌ సిటిజన్స్‌ 9587 మంది, పీడబ్ల్యూడీ ఓటర్లు 33865 మంది, 736 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని తెలిపారు.

రూ. 9.18 కోట్లు సీజ్‌: ఎస్పీ

ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో రూ.9.18 కోట్లు విలువగల నగదు, మద్యం, ఆభరణాలు సీజ్‌ చేశామని చెప్పారు. 184 కేసుల్లో నగదు ఆభరణాలు వంటివి సీజ్‌ చేశామని తెలిపారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. స్పెషల్‌ కలెక్టర్‌ నటరాజ్‌, మీడియా నోడల్‌ అధికారి కోటేశ్వరరావు, కేంద్ర ప్రభుత్వ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ కోటేశ్వరరావు, సమాచారశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ సంక్షేమం: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు నియమించిన సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహించాలని దాసరి హరిచందన ఆదేశించారు. నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియకు నియమించిన అధికారులు, సిబ్బందితో మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పొరపాట్లకు తావులేకుండా పూర్తిచేయాలన్నారు. పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రత్యేకించి హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి రోజు ఎన్నికల సంఘానికి పంపించే నివేదికలు జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కంట్రోల్‌రూం, ఎన్నికల అనుమతులను ఇచ్చే సువిధ విభాగం, ఎన్నికల వ్యయనిర్వహణకు ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ విభాగాలను తనిఖీ చేసి పనితీరును పరిశీలించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, స్పెషల్‌ కలెక్టర్‌ నటరాజ్‌, డీఆర్‌వో రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని