logo

పశుగ్రాసం కరవు.. పశు పోషణ బరువు

ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం తగ్గడంతో పశుగ్రాసం కష్టాలు మొదలయ్యాయి. ఆధునిక వ్యవసాయం పేరిట కోత యంత్రాలతో వరి పంట కోయడం,

Published : 18 Apr 2024 02:51 IST

చిట్యాల: కొనుగోలు చేసిన గడ్డిని ట్రాక్టర్లపై తీసుకువస్తున్న రైతు

చిట్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం తగ్గడంతో పశుగ్రాసం కష్టాలు మొదలయ్యాయి. ఆధునిక వ్యవసాయం పేరిట కోత యంత్రాలతో వరి పంట కోయడం, మండుతున్న ఎండలకు బోర్లలో నీరు తగ్గిపోయి పంటలు ఎండిపోవడంతో గ్రాసం కొరత ఏర్పడింది. పశువుల మేత కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు గడ్డి కోసం పోటీ పడుతుండటంతో పశుగ్రాసం ధరలకు రెక్కలొచ్చాయి. జిల్లాలో అధిక శాతం పాడి పశువులే కావడంతో పాల ఉత్పత్తితో వచ్చే రాబడి కంటే, గ్రాసం దాణా కొనుగోలుకు ఎక్కువ ఖర్చవుతోంది. గ్రాసం కొరతను నివారించేందుకు ప్రతి ఏడాది ప్రభుత్వం వేసవి ప్రారంభంలోనే గడ్డి విత్తనాలను ప్రభుత్వం పశువైద్య శాఖ ద్వారా రైతులకు అందించేది. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌ నెల ముగిసే సమయానికి రైతులకు సరఫరా చేయలేదు. గతంలో మండలంలోని పరిసర ప్రాంతాల్లో ట్రాక్టర్‌ గడ్డి ధర రూ.6 వేల నుంచి 7 వేల ధరకు లభించేది. ప్రస్తుతం రైతులు పొరుగునున్న రామన్నపేట మండలంలోని మూసి పరివాహక ప్రాంత గ్రామాలకు వెళ్లి రూ.10వేల నుంచి 15వేల వరకు వెచ్చించి పశుగ్రాసం తెచ్చుకుంటున్నారు. మూసి పరివాహక గ్రామాలు మండలం నుంచి సుమారు ఇరవై కిలోమీటర్లు ఉండటంతో ట్రాక్టర్‌ కిరాయిలు ఎక్కువ అవుతున్నాయి.


ఈ ఏడాది గడ్డి విత్తనాలు అందలేదు:

డా.అమరేందర్‌, పశు వైద్యాధికారి, చిట్యాల

ప్రతి ఏటా పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో విత్తనాలు రైతులకు సబ్సిడీ ధరలతో అందిస్తుంది. మండలానికి ఐదు టన్నుల వరకు రైతులకు విత్తనాల అవసరం ఉన్నట్లు ప్రతిపాదనలు పంపించాం. కానీ ఇప్పటి వరకు విత్తనాలు అందలేదు. దీంతో రైతులు ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది.


గడ్డి ధర పెరిగింది:

లింగస్వామి, రైతు, చిట్యాల

వ్యవసాయంతో పాటుగా నాలుగు గేదెలను పోషిస్తూ వాటి పాలు విక్రయిస్తున్నాం. గడ్డి, దాణా ఖర్చులు పెరిగినంతగా.. పాల ధరలు పెరగక పోవడంతో గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం గడ్డి విత్తనాలు వేసవి కాలం ముందే అందిస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని