logo

గురుకులాల్లో గందరగోళం!

Published : 18 Apr 2024 03:00 IST

భువనగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమ గురుకులాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 28 గురుకులాలు, ఐదు డిగ్రీ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచేందుకు, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సదుపాయాలు కల్పిస్తున్నప్పటికి సంబంధిత ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. బోధన, బోధనేతర సిబ్బంది మధ్య సమన్వయ లోపంతో పలు సందర్భాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికి వెలుగులోకి రావడం లేదు. భువనగిరి గురుకులంలో చోటుచేసుకున్న విద్యార్థుల అస్వస్థత ఘటన రెండు రోజుల  తర్వాత వెలుగులోకి రావడం గమనార్హం. సిబ్బంది సమన్వయలోపం, నిర్లక్ష్యంతోనే భువనగిరి గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా విచారణలో తేలడంతో ప్రిన్సిపల్‌ శ్రీరాముల శ్రీనివాస్‌ను సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి సస్పెండ్‌ చేయడం పైఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. సంబంధిత ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగానే భువనగిరి గురుకుల పాఠశాలలోని విద్యార్థి ప్రశాంత్‌ మరణంతో పాటు, మరో 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం జరిగింది.

నిర్వహణ లోపాలు ఇలా..

యాదాద్రి భువనగిరిలో ఏడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. బీబీనగర్‌లో ఆర్మీ ఫోర్సెస్‌ డిగ్రీ కళాశాల ఉంది. పాఠశాల, కళాశాలల ఏర్పాటుకు జిల్లాలో వసతి లభించని కారణంగా పొరుగు జిల్లాలోని జగద్గిరిగుట్టలో ఒక పాఠశాలను, శామీర్‌పేటలో డిగ్రీ కళాశాలను, ఘట్కేసర్‌ పరిసరాల్లో మరో కళాశాలను నిర్వహిస్తున్నారు. - ప్రతి ఏటా పాఠశాలల్లోని ఐదు నుంచి పదో తరగతి వరకు 640 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్‌లో మరో 240 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లో కోర్సుల వారీగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. నల్గొండ జిల్లాలో 12 పాఠశాలల్లో 7010 మంది విద్యార్థులు, ఒక డిగ్రీ కళాశాలలో 710 మంది విద్యార్థులు, సూర్యాపేట జిల్లాలోని ఎనిమిది పాఠశాలు, ఒక డిగ్రీ కళాశాలలో 5007 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.


వారం రోజుల పాటు మెనూ ఇలా...

ఉదయం: పాలు, బూస్ట్‌
ఉదయం: రోజు ఏదో ఒక అల్పాహారం
మధ్యాహ్నం: రైస్‌, కర్రీ, సాంబర్‌, పెరుగు
సాయంత్రం: స్నాక్స్‌ లేదా పండ్లు
రాత్రి: రైస్‌, కర్రీ, సాంబర్‌, పెరుగు
మాంసాహారం: వారంలో మూడు రోజులు చికెన్‌, ఒక రోజు మటన్‌తో భోజనం.


త్యధిక గురుకులాల్లో డార్మిటరీలు, వంటశాలలు, పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. విద్యార్థులకు సీజనల్‌ వ్యాధులతో పాటు ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మెనూ ప్రకారం భోజనం అందించే ప్రక్రియ అంతంతగానే కొనసాగుతోంది. టెండర్లు దక్కించుకున్న కూరగాయలు, పాలు, వంట సరకులు, మాంసాహారం సరఫరాదారులు ఎవరికి వారుగా నెలనెలా సరఫరా చేస్తున్నారు. దీనిపై పర్యవేక్షణ కొరవడినట్లు ఆరోపణలు ఉన్నాయి.


భోజనం తయారీకి క్యాటరింగ్‌ గుత్తేదారును ప్రభుత్వం నియమించింది. కేర్‌ టేకర్‌ నుంచి సరకులు తీసుకుని నిత్యం గుత్తేదారు భోజనం తయారు చేసి విద్యార్థులకు వడ్డిస్తుండటం గమనార్హం. కేర్‌ టేకర్‌ కింది ఉద్యోగికి బాధ్యతలు అప్పగిస్తుండటం, నెలకోసారి కేర్‌ టేకర్‌ను మారుస్తుండటం, హౌస్‌ కీపింగ్‌ కమిటీ, మెస్‌ కమిటీల మధ్య సమన్వయలోపం, విధుల పట్ల నిర్లక్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


వండిన భోజనం బాధ్యులు రుచి చూడకపోవడంతో ఆహారంలో నాణ్యత లోపిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులపై రోజువారి పర్యవేక్షణ లోపించింది. బయటి ఆహార పదార్థాలు తీసుకుని భుజించడం గమనార్హం. వీరిపై ప్రిన్సిపల్‌, ఆర్‌సీవో అధికారులు పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుండటం గమనార్హం.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని