logo

అట్టహాసంగా కంచర్ల నామినేషన్‌

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 24 Apr 2024 02:35 IST

నల్గొండ లోక్‌సభ స్థానం ఎన్నికల అధికారి హరిచందనకు నామినేషన్‌ పత్రాన్ని అందజేస్తున్న భారాస ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, చిత్రంలో గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి,   బడుగుల లింగయ్య యాదవ్‌, బొల్లం మల్లయ్య యాదవ్‌, రవీంద్రకుమార్‌ తదితరులు

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. భారాస లోక్‌సభ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి నామపత్రాల సమర్పణలో భాగంగా మంగళవారం నల్గొండలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. పూటకో మాట మార్చే కాంగ్రెస్‌ నాయకుల గురించి తక్కువ కాలంలోనే ప్రజలకు పూర్తిగా అర్ధమైందన్నారు. రుణమాఫీ మాట మార్చడంతో పాటు అన్నదాతలను నిలువునా ముంచారంటూ ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిపక్ష నేతలను తిడుతూ అబద్ధాలు ఆడుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అడగక ముందే అన్ని ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. అంతకు ముందు భారాస లోక్‌సభ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి సొంత గ్రామం ఉరుమడ్లలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముందుకు వస్తున్నానని,  తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, భారాస నాయకులు బడుగుల లింగయ్య యాదవ్‌, రమావత్‌ రవీంద్రకుమార్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, బొల్లం మల్లయ్య యాదవ్‌, నోముల భగత్‌, రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

భారీగా వాహన ర్యాలీ..

భారాస లోక్‌సభ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి నామపత్రాల సమర్పణలో భాగంగా జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డు నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ఎత్తున వాహన ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ రోడ్డు, గడియారం సెంటర్‌ మీదుగా దాదాపు 5 కి.మీ దూరం భారాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు గులాబీ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని