logo

అడ్డుకునేవారు లేరని.. అడ్డంగా ఆక్రమించాడు

అది కనుపూరు కాలువ పరిధిలో కీలకమైంది. అలాంటి నీటివనరును ఓ వ్యక్తి అడ్డంగా ఆక్రమించి గట్లను చదును చేసి పంటలు, నిర్మాణాలు చేపడుతున్నాడు.

Published : 06 Feb 2023 02:19 IST

న్యూస్‌టుడే, వెంకటాచలం

కాలువ కట్టను ధ్వంసం చేస్తున్న పొక్లెయిన్‌

అది కనుపూరు కాలువ పరిధిలో కీలకమైంది. అలాంటి నీటివనరును ఓ వ్యక్తి అడ్డంగా ఆక్రమించి గట్లను చదును చేసి పంటలు, నిర్మాణాలు చేపడుతున్నాడు. కనుపూరు కాలువ నుంచి వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి బ్రాంచి కాలువ ద్వారా చింతగుంట, మామిడిగుంట, వలిపేగుంటతో పాటు ఇడిమేపల్లి ప్రధాన చెరువుకు సాగునీరు సరఫరా అవుతోంది. అలాగే జంగాలపల్లి, ఇడిమేపల్లి, పలుకూరువారిపాళెం, తదితర గ్రామాలకు చెందిన దాదాపు 10 వేల ఎకరాలు సాగవుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట దీన్ని ఏర్పాటు చేశారు. రామదాసుకండ్రిగ, ఇడిమేపల్లి గ్రామాల మధ్య వలిపేగుంట చెరువు సమీపంలో కాలువకు రెండు వైపులా ఉన్న పొలాన్ని కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం యంత్రాల సాయంతో అడ్డంగా ఆక్రమించాడు. కాలువకు రెండు వైపులా 10 అడుగుల వరకు ఉన్న గట్లు, అక్కడి మట్టిని చదును చేశాడు. ఓ వైపు కాలువ గట్లను చదును చేసి మిరప పంట వేయగా.. మరోచోట ఏకంగా గది నిర్మాణాలు చేపట్టారు. మొత్తం కాలువ స్థలానికి కంచె ఏర్పాటు చేశారు.

ఆదేశాలు ధిక్కరించి..

రెండు నెలల కిందట కాలువ గట్లు చదును చేసి ఆక్రమిస్తుండటంతో సమాచారం తెలుసుకున్న నీటిపారుదలశాఖ అధికారులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. గట్లు ఎలా చదును చేస్తారని ఆ వ్యక్తిని ప్రశ్నించి పనులను ఆపేయాలని హెచ్చరించినా ఫలితం లేకపోయింది. కాలువ ఆక్రమణలపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇడిమేపల్లి బ్రాంచి కాలువ తమకు అత్యంత నీటి ఆధారమైందని, దాన్ని ఆక్రమిస్తే భవిష్యత్తులో తమ ప్రాంతానికి తాగు, సాగునీటి ఇబ్బందులు తప్పవని ఆవేదన చెందుతున్నారు.

చదును చేసి అడ్డంగా నాటిన కంచె

మంత్రి, అధికారుల దృష్టికి..

రెండు రోజులుగా యంత్రాలతో కాలువ గట్లు చదును, కంచె వేయడాన్ని ఆదివారం తెలుసుకున్న ఇడిమేపల్లి, జంగాలపల్లి గ్రామాల రైతులు, ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లి పనులను అడ్డుకున్నారు. కాలువను ఆక్రమించి ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆ వ్యక్తి ఖాతరు చేయకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు పనులను యథాతథంగా కొనసాగించాడు. దాంతో రైతులు.. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి, నీటిపారుదల శాఖ అధికారులకు తెలిపారు. పనులు ఆపకుంటే కాలువ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు హుటాహుటిన వచ్చారు. ఆ సమయంలో దాదాపు గంట పాటు ఉద్రిక్తత నెలకొంది. అధికారులు వెంటనే పనులను నిలిపివేశారు.


గట్లు యథాతథంగా నిర్మిస్తాం

- గురజాల, కనుపూరు కాలువ డీఈ

రైతుల ఫిర్యాదుతో వచ్చి పరిశీలించాం. కాలువ గట్లు తొలగించి చదును చేసి ఉన్నారు. స్థలంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు, మిరపతోట సాగును తొలగించాలని ఆదేశించాం. కాలువపై సర్వే నిర్వహించి గట్లు యథాతథంగా నిర్మించి స్థలం ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని