logo

లక్షణాలున్నా పరీక్షలకు రావట్లే..

కొవిడ్‌ లక్షణాలున్న చాలామంది పరీక్షలకు రావడం లేదు. సోమవారం 412 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా 80 పాజిటివ్‌ రావడం కలకలం రేపుతోంది. నిర్లక్ష్యంగా సంచరిస్తుండటంతోనే కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు.

Published : 18 Jan 2022 03:31 IST

తాజాగా 80 మందికి పాజిటివ్‌
న్యూస్‌టుడే, కామారెడ్డి వైద్యవిభాగం

జిల్లాకేంద్రంలో ఇంటికొచ్చి టీకా ఇస్తున్న వైద్య సిబ్బంది

కొవిడ్‌ లక్షణాలున్న చాలామంది పరీక్షలకు రావడం లేదు. సోమవారం 412 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా 80 పాజిటివ్‌ రావడం కలకలం రేపుతోంది. నిర్లక్ష్యంగా సంచరిస్తుండటంతోనే కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. జిల్లాకేంద్రంలో, సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ మంది వైరస్‌ బారినపడుతున్నారు. మిగతా ప్రాంతాల్లో కొద్దోగొప్పో కొవిడ్‌ ఆంక్షలు అమలవుతుండగా.. ఇక్కడ ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. మహారాష్ట్ర నుంచి బస్సులు, రైళ్లలో వస్తున్నారు. మాస్క్‌, భౌతికదూరం నిబంధనలు పాటించడం లేదు. గతేడాది పురపాలికల్లో మాస్కులేని వారికి రూ.5.2 లక్షల జరిమానా వేశారు. తాజాగా అలాంటి కఠిన చర్యలేవీ కనిపించడం లేదు.

ఇళ్లలోనే కోలుకుంటున్నారు
ప్రస్తుతం వందలాది మందికి పాజిటివ్‌ వస్తున్నా ఇళ్లలోనే చికిత్స పొంది కోలుకుంటున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు మూడు రోజులే ఉంటున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆసుపత్రుల్లో చేరే పరిస్థితులు లేవు. ప్రాణానికి ముప్పేమీ లేదని పేర్కొంటున్నారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ తగ్గింది. లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

నెగెటివ్‌ వచ్చినా..
వారం రోజులుగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో అత్యధిక పాజిటివ్‌లు వస్తున్నాయి. తాజాగా జిల్లా ఆసుపత్రిలో 36 మందికి పరీక్షలు చేయగా 23 మందికి కొవిడ్‌ తేలింది. లక్షణాలుండి ర్యాపిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వస్తే ఆర్టీపీసీఆర్‌కు రావాలని వైద్యులు సూచిస్తున్నారు.
కలెక్టరేట్‌లో కలకలం..  కామారెడ్డి కలెక్టరేట్‌లో పని చేసే ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది 12 మంది కొవిడ్‌ బారినపడ్డారు. మండలాల్లోని పోలీసు సిబ్బందికి వైరస్‌ సోకింది. వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే అధికారులు, సిబ్బందికి వైరస్‌ ముప్పు అధికంగా ఉంటుందని వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

6,099 మందికి వ్యాక్సినేషన్‌.. కామారెడ్డి పట్టణం: జిల్లావ్యాప్తంగా సోమవారం 6,099 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 340, దేవునిపల్లి 126, రాజీవ్‌నగర్‌ 152, భిక్కనూరు 319, డోంగ్లీ 129, బాన్సువాడ 153, నిజాంసాగర్‌ 402, రాజంపేట 126, మత్తమాల 109, పుల్కల్‌ 110, నస్రుల్లాబాద్‌ 137, అంకోల్‌ 106, నెమ్లి 167, భిక్కనూరు-బి 115, దుర్కిలో 101 మందికి వేశారు. ఇప్పటి వరకు 11,60,216 డోసులు పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని