logo

రేషన్‌...పరేషాన్‌

బీర్కూరు మండలంలో 13 రేషన్‌ దుకాణాలుండగా ఇందులో గతేడాది బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేయలేదు. సమీపంలోని గ్రామాల్లో మొదటగా పంపిణీ పూర్తి చేసి.. మిగతా చోట్ల మెల్లిగా ఇస్తూ నెట్టుకొచ్చారు. బాన్సువాడ మండలంలోని

Published : 20 Jan 2022 02:40 IST

 బయోమెట్రిక్‌ యంత్రాల్లో సాంకేతిక సమస్య

పాత బాన్సువాడలో రేషన్‌ బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులు

బీర్కూరు మండలంలో 13 రేషన్‌ దుకాణాలుండగా ఇందులో గతేడాది బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేయలేదు. సమీపంలోని గ్రామాల్లో మొదటగా పంపిణీ పూర్తి చేసి.. మిగతా చోట్ల మెల్లిగా ఇస్తూ నెట్టుకొచ్చారు. బాన్సువాడ మండలంలోని సంగోజిపేట్‌లో పనిచేయకపోతే సమీపంలోని కొనాపూర్‌ నుంచి తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల బాన్సువాడ పట్టణంలోని రెండు పడక గదుల ఇళ్ల కాలనీ, పాతబాన్సువాడ, కొనపూర్‌లో యంత్రాలు పనిచేయకపోతే మార్చి ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులు చాలా గ్రామాల్లో ఉత్పన్నమవుతున్నాయి. దీంతో రేషన్‌బియ్యం సకాలంలో అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 100 యంత్రాలకు వివిధ సమస్యలు ఉండగా వీరి వద్ద 20 మాత్రమే ఉండటంతో ఎక్కడ పంపించి సరిచేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా కొత్త యంత్రాలు తీసుకొచ్చి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

న్యూస్‌టుడే, బాన్సువాడ

ఛౌక ధర దుకాణాల్లో అక్రమాలు నిరోదించేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ అమలు చేస్తోంది. 2017 సెప్టెంబరులో ఈ విధానం ప్రారంభించారు. జిల్లాలో 578 రేషన్‌ దుకాణాలుండగా అన్నింటికి బయోమెట్రిక్‌ యంత్రాలు సరఫరా చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇవి సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రజలకు సకాలంలో రేషన్‌ సరకులు పంపిణీ చేయలేకపోతున్నారు. కొందరు రేషన్‌ డీలర్లు సమీప గ్రామంలోని యాంత్రాలు తీసుకొచ్చి బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొందరు థర్డ్‌పార్టీ వేలిముద్రలతో త్వరగా పంపిణీకి డీలర్లు ప్రయత్నించారు.     ఇది అక్రమాలకు తావిస్తోంది. థర్డ్‌పార్టీ వేలిముద్రలతో వందల క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని మాయం చేసిన సంఘటనలు జిల్లాలోని బాన్సువాడ, బీర్కూరు, ఎల్లారెడ్డి మండలాల్లో గతేడాది చోటు చేసుకున్నాయి. బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
పక్క దారికి ప్రణాళికలు
జిల్లాలో మొత్తం 2,48,000 ఆహారభద్రత కార్డులున్నాయి. సుమారు 2,23,000 మందికి ప్రతినెల 9,026.10 మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. సాంకేతికతను ఉపయోగించుకొని బయోమెట్రిక్‌ విధానం తీసుకొచ్చి అక్రమాలను అరికట్టాలని ప్రభుత్వం యోచించినా ఇవి ఆగడం లేదు. కొందరు డీలర్లు అక్రమాలకు తెరలేపుతూనే ఉన్నారు. సర్వర్‌ సమస్య ఉందని కొందరివి, స్థానికంగా లేనివారివి, వేలిముద్రలు రావడం లేదని ఇలాంటి కొందరి బియ్యాన్ని కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టబులిటీ విధానాన్ని ఆసరా చేసుకొని ఇతర జిల్లాల రేషన్‌ బియ్యాన్ని జిల్లాలో కొందరు డీలర్లు కాజేసి ఇప్పటికే జైలు పాలయ్యారు. పేదల బియ్యం పక్కదారి పట్టకుండా అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నిధులు లేవన్నారు..  
శశికాంత్‌రెడ్డి, ఈపాస్‌యంత్రం జిల్లా మేనేజర్‌

ఈపాస్‌ యంత్రాల సమస్యను జిల్లా అధికారులకు తెలియజేశాం. నిధుల కొరత ఉందని చెప్పారు. చెడిపోయిన యంత్రాలను చాలా వరకు బాగు చేస్తున్నాం. కొందరు డీలర్లు సక్రమంగా ఉపయగించకపోవడంతో సమస్య వస్తోంది. రేషన్‌ పంపిణీ పూర్తయ్యాక మరోసారి వచ్చే వరకు పక్కన పెడుతున్నారు. రెండు, మూడు రోజులకు ఒకసారి ఛార్జింగ్‌ పెట్టాలి. లేకపోతే బ్యాటరీ సమస్య వచ్చి చెడిపోతున్నాయి. ప్రస్తుతానికి అన్ని కేంద్రాల్లో బియ్యం పంపిణీ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని