logo

వ్యాపారవేత్తలుగా అతివలు

గ్రామీణ మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు సెర్ప్‌ శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో రెండు బ్లాక్‌లుగా ఎంపిక చేసి కొంతమంది అతివలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Published : 27 Jan 2022 05:05 IST

స్టార్టప్‌ విలేజ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ కార్యక్రమం రూపకల్పన

ఉమ్మడి జిల్లాలో ఎల్లారెడ్డి, బోధన్‌ బ్లాక్‌లుగా ఎంపిక

న్యూస్‌టుడే, బీర్కూర్‌

కామారెడ్డిలో సీఆర్పీలకు అవగాహన కల్పిస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు

గ్రామీణ మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు సెర్ప్‌ శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో రెండు బ్లాక్‌లుగా ఎంపిక చేసి కొంతమంది అతివలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎంపిక ఇలా..

అనుభవం, ఆసక్తి ఉన్న రంగంలో వ్యాపారం చేయడానికి సెర్ప్‌, స్టార్టప్‌ విలేజ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (గ్రామీణ వ్యాపార ప్రారంభం) పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని మూడు విడతల్లో వివిధ ప్రాంతాల్లో అమలు చేశారు. నాలుగో విడతగా రాష్ట్రంలో పది జిల్లాలకు చోటు కల్పించారు. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి బ్లాక్‌లో లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి మండలాలు, నిజామాబాద్‌ జిల్లాలో బోధన్‌ బ్లాక్‌లో ఎడపల్లి, రెంజల్‌, నవీపేట్‌, బోధన్‌ మండలాలను ఎంపిక చేశారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉంది. పైగా ఉపాధి పని దినాలు ఎక్కువగా నమోదై ఉన్నాయి. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సీఐఏఎఫ్‌ రుణాల వసూళ్లు సక్రమంగా ఉండటంతో ఈ కార్యక్రమానికి ఆ మండలాలను ఎంపిక చేసినట్లు సెర్ప్‌ అధికారులు పేర్కొంటున్నారు.

ఒక్కో దానికి రూ.5.97 కోట్లు

ఉమ్మడి జిల్లాలో ఎల్లారెడ్డి, బోధన్‌ బ్లాక్‌లు ఎంపిక చేశారు. ఒక్కో బ్లాక్‌కు రానున్న నాలుగేళ్లలో భారీగా నిధులు ఖర్చు చేయనున్నారు. ఒక్కో బ్లాక్‌కు రూ.5.97 కోట్లు కేటాయించారు. కామారెడ్డి జిల్లాలో లింగంపేట్‌, నిజామాబాద్‌ జిల్లాలో బోధన్‌లో బ్లాక్‌ రిసోర్స్‌ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమ నిర్వహణకు బ్లాక్‌కు ఒక ఏపీఎంను కేటాయించారు. మండలం నుంచి ఐదుగురు సీఆర్పీలను నియమించారు. ఇటీవల రాత పరీక్ష నిర్వహించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 మందిని ఎంపిక చేశారు. ఒక్కో సీఆర్పీకి నాలుగు నుంచి ఐదు గ్రామాలు కేటాయిస్తారు. వారికి మొదటి విడత శిక్షణ పూర్తయింది. ఇంకా మూడు విడతల్లో ఇవ్వనున్నారు. వీరికి కేటాయించిన మూడు మండలాల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికి తిరగాలి. కుటీర పరిశ్రమలు నిర్వహిస్తున్న మహిళలను గుర్తించి వారికి ఎంత ఆదాయం వస్తుంది? ఖర్చులు ఎలా ఉన్నాయి? వినియోగదారుల మన్ననలు పొందాలంటే ఏం చేయాలి? తదితర వివరాలను సర్వే చేసి సెర్ప్‌ అధికారులకు ఇవ్వనున్నారు. అనంతరం ఒక్కో మహిళకు తొలి విడత రూ.10 వేల రుణం అందిస్తారు. తర్వాత అవసరాలకు అనుగుణంగా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తారు.

జిల్లాకు 2,400 మంది

కామారెడ్డి జిల్లాలో 2,400, నిజామాబాద్‌లో 2,400 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం కలిపి అతివలకు రుణాలు ఇవ్వనున్నారు. వీలైనంత వరకు స్థానికంగా ఉండే ముడి సరకులు సేకరించి వాటికి విలువ కట్టి మార్కెటింగ్‌ చేయాలన్నది సెర్ప్‌ లక్ష్యం.

అర్హులను గుర్తించి రుణాలిస్తాం

- వెంకటమాధవరావు, డీఆర్‌డీవో, కామారెడ్డి జిల్లా

గ్రామీణ మహిళలకు చేయూతనిచ్చి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ఉద్దేశం. త్వరలో సీఆర్పీలతో ఇంటింటి సర్వే చేపట్టి అర్హులైన మహిళలను గుర్తించి రుణాలు మంజూరు చేస్తాం. వారు వ్యాపారాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని