logo

నైపుణ్యం నేర్పక.. కొలువు దక్కక

ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాల ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి. అది సర్కారుదైనా.. ప్రైవేటైనా.. ప్రస్తుతం కార్పొరేట్‌ సంస్థలు రూ.లక్షల వేతన ప్యాకేజీలు ఇస్తున్నాయి.

Published : 06 Feb 2023 05:56 IST

తెవివిలో విద్యార్థులకు శిక్షణ కరవు 
ప్రాంగణ నియామకాలపైనా నిర్లక్ష్యం
న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌

ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాల ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి. అది సర్కారుదైనా.. ప్రైవేటైనా.. ప్రస్తుతం కార్పొరేట్‌ సంస్థలు రూ.లక్షల వేతన ప్యాకేజీలు ఇస్తున్నాయి. వీటిని అందుకోవాలంటే.. విద్యార్థులు ఉన్నతవిద్య అభ్యసించే సమయంలోనే ఆయా విద్యాసంస్థలు మంచి నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఔత్సాహికులుగా తీర్చిదిద్ది కొలువులకు సిద్ధం చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బయటికి వెళ్తున్నవారి సంఖ్య ఏటా వందల్లో ఉంటోంది. వీరిలో ఉపాధి పొందుతున్న వారు పదుల్లోనే ఉండటం ఆందోళనకరం. సరైన నైపుణ్య శిక్షణ ఇవ్వకపోవడం, ప్రాంగణ నియామకాలు చేపట్టక పోవడమే ఇందుకు ప్రధాన కారణం.

శ్రద్ధ చూపరే.. గత నెలలో ఉస్మానియా భారీ ఉద్యోగ మేళా నిర్వహించింది. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ తాజాగా చేపడుతోంది. తెవివిలో మాత్రం అయిదేళ్లుగా నిర్వహించిన దాఖలాలు లేవు. అడపాదడపా కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగాల్లో వివిధ కంపెనీలు, మాస్‌ కమ్యూనికేషన్‌లో పత్రిక, టీవీ ఛానళ్ల సంస్థలు చేపడుతున్నాయి. మిగతా విభాగాల్లో ఉద్యోగ మేళాల ఊసే కనిపించడం లేదు. స్థానికంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌, కెరీర్‌ గైడెన్స్‌ విభాగం ఉంటున్నప్పటికీ సంబంధిత అధికారులు శ్రద్ధ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.

న్యాక్‌లో ప్రాధాన్యం..  ప్రతిష్ఠాత్మక ‘న్యాక్‌’ గుర్తింపునకు ప్లేస్‌మెంట్స్‌ అంశం దోహదపడుతుంది. న్యాక్‌ బృందం వచ్చినప్పుడు ఏడాదిలో ఎన్నిసార్లు ఉద్యోగ మేళాలు చేపట్టారు? ఎంత మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించారు? అని గత మూడేళ్ల వివరాలు పరిశీలిస్తుంది. తెవివికి మెరుగైన గ్రేడింగ్‌కు ప్రయత్నిస్తున్న తరుణంలో నైపుణ్య శిక్షణ, ప్లేస్‌మెంట్స్‌ నిర్వహణపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది.


కంపెనీలతో మాట్లాడుతున్నాం
- ఆచార్య రవీందర్‌, తెవివి వీసీ

కంపెనీలు ఎక్కువగా కెమిస్ట్రీలో అడుగుతున్నాయి. ఇక్కడేమో విద్యార్థులు దొరకడం లేదు. విప్రో ప్రతినిధులు 10 వేల మంది అవసరముందన్నారు. వర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు విప్రోతో ప్రాంగణ నియామకాలు ఏర్పాటు చేస్తాం.


పోటీపడే అవకాశం
- అరుణ్‌, ఎంసీఏ

కోర్సు చివర్లో ఉద్యోగం వస్తే కుటుంబానికి చేదోడుగా నిలిచినవారమవుతాం. యూనివర్సిటీలో చేరేందుకు విద్యార్థులు పోటీపడే అవకాశం ఉంటుంది.


అధ్యాపకులు లేరు
- శివకుమార్‌, ఐఎంబీఏ, తృతీయ ఏడాది(తెవివి)

వర్సిటీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ నేర్పించే అధ్యాపకులు లేక చాలా నష్టపోతున్నాం. క్యాంపస్‌ ఇంటర్వ్యూలతో విజ్ఞానం, అనుభవం వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని