logo

ఉమ్మడి జిల్లలో 8 ఉప ఎన్నికలు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొన్ని నియోజకవర్గాల్లో వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగాయి.

Updated : 28 Oct 2023 06:02 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొన్ని నియోజకవర్గాల్లో వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు సార్లు జరగగా.. బాన్సువాడ, కామారెడ్డి, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, బాల్కొండ, అప్పటి డిచ్‌పల్లిలో ఒకసారి ఉప ఎన్నిక జరిగింది.

వివరాలు ఇలా..

  • 2010లో తెదేపా బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ ఉద్యమం సందర్భంగా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాసలో చేరడంతో 2011లో ఉప ఎన్నిక జరిగింది. ఇందులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్‌గౌడ్‌పై తెరాస అభ్యర్థి అయిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు.
  • కామారెడ్డి తెదేపా ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో (2012) పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాసలో చేరారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తెరాస తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గంప గోవర్ధన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి యెడ్ల రాజిరెడ్డిపై విజయం సాధించారు.
  • తెలంగాణ ఉద్యమంలో (2010) నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అయిన యెండల లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. తిరిగి ఆయన అదే పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ ఎలక్షన్‌లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన డి.శ్రీనివాస్‌పై యెండల లక్ష్మీనారాయణ విజయం సాధించారు.
  • పార్టీ పిలుపు మేరకు 2008లో ఎల్లారెడ్డి తెరాస ఎమ్మెల్యేగా ఉన్న ఏనుగు రవీందర్‌రెడ్డి పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన జనార్దన్‌గౌడ్‌ గెలుపొందారు.
  • 2009 సాధారణ ఎన్నికల్లో గెలుపొంది ఎల్లారెడ్డి తెరాస ఎమ్మెల్యేగా ఉన్న ఏనుగు రవీందర్‌రెడ్డి అధిష్ఠానం నిర్ణయంతో 2010లో మరోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో జరిగిన ఉప ఎన్నికలో ఏనుగు రవీందర్‌రెడ్డి తిరిగి విజయం సాధించారు.
  • అధిష్ఠాన నిర్ణయంతో 2008లో డిచ్‌పల్లి తెరాస ఎమ్మెల్యేగా ఉన్న కేశ్‌పల్లి గంగారెడ్డి రాజీనామా చేశారు. అనంతరం అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా ఆయన తనయుడు కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి పోటీ చేయగా.. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఎ.లలిత విజయం సాధించారు.
  • 1962లో బోధన్‌తో పాటు మరో నియోజకవర్గంలో పోటీ చేసిన రాంభూపాల్‌రెడ్డి రెండు చోట్ల గెలుపొందారు. ఈయన బోధన్‌ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో 1963లో ఉప ఎన్నిక వచ్చింది. అందులో కేవీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • 1981లో బాల్కొండ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న గడ్డం రాజారాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో బాల్కొండ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఇందులో రాజారాం సతీమణి సుశీలాదేవి గెలుపొందారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని