logo

6 Murders Case: దురాశ పుట్టి.. స్నేహితుడి కుటుంబాన్ని మట్టుబెట్టి

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న స్నేహితుడికి తొలుత అప్పు ఇచ్చాడు. ఆ తర్వాత ఆస్తిపై దురాశతో అతడిని, కుటుంబసభ్యులను ఒకరి తర్వాత మరొకరిని మట్టుబెట్డడం ఉభయ జిల్లాల్లో సంచలనంగా మారింది.

Updated : 20 Dec 2023 09:30 IST

ఆస్తి కోసమే ఆరు హత్యలు

ఈనాడు, కామారెడ్డి, న్యూస్‌టుడే, మాక్లూర్‌: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న స్నేహితుడికి తొలుత అప్పు ఇచ్చాడు. ఆ తర్వాత ఆస్తిపై దురాశతో అతడిని, కుటుంబసభ్యులను ఒకరి తర్వాత మరొకరిని మట్టుబెట్డడం ఉభయ జిల్లాల్లో సంచలనంగా మారింది. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ గ్రామానికి చెందిన ప్రశాంత్‌ స్నేహితుడైన ప్రసాద్‌తో పాటు ఆయన కుటుంబసభ్యుల్ని ఐదుగురిని హత్యచేసిన తీరు హృదయ విదారకంగా ఉంది. పోలీసులు సాంకేతికతను వినియోగించి కేసును ఛేదించకుంటే ప్రసాద్‌ తల్లి సుశీలను సైతం ప్రశాంత్‌ మట్టుబెట్టేవాడు.

రూ.20 లక్షల విలువైన  ఇళ్ల కోసం

ప్రసాద్‌కు చెందిన సుమారు రూ.20 లక్షల విలువైన ఆస్తి(రెండు ఇళ్ల్ల)పై కన్నేసిన నిందితుడు ప్రశాంత్‌ మిత్రుడి ఇంటిల్లిపాదిని పొట్టనపెట్టుకునేందుకు పన్నాగం పన్నాడు. ఇందులో భాగంగానే ఆరుగురిని హతమార్చాడు. ప్రసాద్‌ తల్లి సుశీలను సైతం హత్య చేసేందుకు ఎత్తుగడ వేయగా సదాశివనగర్‌ పోలీసులు కేసును ఛేదించడంతో విఫలమైంది. ఐదుగురు నిందితులు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు.

స్నేహితుడి పేరిట  ఆస్తి మార్టిగేజ్‌

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రసాద్‌ అప్పు కోసం తన పేరిట ఉన్న రెండు ఇళ్లు, స్థలాన్ని స్నేహితుడైన ప్రశాంత్‌ పేరిట మార్టిగేజ్‌ చేయించాడు. 2018 సంవత్సరంలో మాక్లూర్‌ గ్రామానికి చెందిన ఒక అమ్మాయి చనిపోయిన విషయంలో ప్రసాద్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఆయన అప్పటికే దుబాయ్‌ వెళ్లిపోగా కేసు పెండింగ్‌లో ఉంది. ఆ సమయంలో స్నేహితుడు ప్రశాంత్‌తో మాట్లాడుతూ కేసు వివరాలు, గ్రామంలోని పరిస్థితిని తెలుసుకున్నాడు. 2022 అక్టోబరు నెలలో ప్రసాద్‌ స్వదేశానికి తిరిగి రాగా మాక్లూర్‌ పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రసాద్‌ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించడంతో.. ఆయన భార్య, పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు, తల్లితో సహా కామారెడ్డి జిల్లా పల్వంచ మండలకేంద్రంలో నివాసం ఉంటున్నాడు. ఉపాధి లేకపోవడం, సమస్యల కారణంగా ఆర్థికంగా దివాలు తీశాడు. అంతకు ముందు దుబాయ్‌లో ఉన్నప్పుడు ప్రశాంత్‌కు సుమారు రూ.3.50 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అప్పులు తీర్చే నిమిత్తం తనకు ఇవ్వాల్సిన నగదును ఇవ్వాలని ప్రసాద్‌ ప్రశాంత్‌పై ఒత్తిడి తెచ్చాడు. తనకు అప్పు ఇప్పించాలని కోరాడు. ఇందుకుగాను తన రెండు ఇళ్లను ప్రశాంత్‌ పేరిట మార్టిగేజ్‌, రిజిస్ట్రేషన్‌ చేయించాడు. అప్పు ఇప్పిస్తానని చెప్పిన ప్రశాంత్‌ కాలయాపన చేస్తుండడంతో పాటు తిరిగి తన ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు ససేమిరా అనడంతో గొడవ జరిగింది. కక్ష పెంచుకున్న ప్రశాంత్‌ స్నేహితుడి ఆస్తిపై కన్నేసి ఆ కుటుంబాన్నే మట్టుబెట్టాడు.

దొరకని ప్రసాద్‌, శాన్విక(రమణి)ల మృతదేహాలు

హంతకులు ఆరుగురిని హత్య చేసి మృతదేహాలను ఒక్కోచోట వేశారు. ప్రసాద్‌ను మాక్లూర్‌ అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు నిందితులు చెబుతున్నారు. ఇదే విధంగా ప్రసాద్‌ భార్య శాన్విక(రమణి) శవాన్ని బాసర వద్ద గోదావరిలో పడేసినట్లు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయా శవాల కోసం వెతుకుతున్నారు.

నిందితులపై  నాలుగు కేసులు

ఆరుహత్యలలో పాల్గొన్న నిందితులపై మెదక్‌ జిల్లా చేగుంట, సదాశివనగర్‌ పోలీస్‌స్టేషన్‌లలో రెండు కేసులు నమోదయ్యాయి. మెండోరా ఠాణాలో సైతం మరో రెండు కేసులు పెట్టారు. మాక్లూర్‌, బాసరలో మరో రెండు కేసులు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.

సమగ్ర విచారణకు  ప్రత్యేక బృందం

కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కామారెడ్డి జిల్లా పోలీసు అధికారులు సమగ్ర విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రాథమిక విచారణ మాత్రమే పూర్తిచేసి నిందితులు వెల్లడించిన వివరాలను మాత్రమే విలేకరుల సమావేశంలో తెలిపారు. సమగ్ర విచారణ చేపట్టి పూర్తివివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సదాశివనగర్‌ సీఐ రామన్‌, ఎస్సై రాజులతో పాటు పాల్గొన్న సిబ్బంది అశోక్‌, సయీద్‌, జానకీరాం, ఇర్ఫాన్‌, రవికుమార్‌, అబ్దుల్‌ హమీద్‌, శశికాంత్‌, సుధాకర్‌రెడ్డి, అరుణ్‌, రవి, రాజేందర్‌లను ఎస్పీ సింధుశర్మ ప్రత్యేకంగా అభినందించారు.


దేవుడా ఎందుకింత పెద్ద శిక్ష వేశావ్‌

రోదిస్తున్న సుశీల

మాక్లూర్‌, న్యూస్‌టుడే: ప్రసాద్‌ తల్లి సుశీల ఎట్టకేలకు మంగళవారం రాత్రి మాక్లూర్‌ చేరుకున్నారు. ఆమె కూతురు లాస్యతో ఇక్కడికి వచ్చారు. దారుణహత్యకు గురైన కుటుంబ సభ్యులను తలుచుకుంటూ.. దేవుడా ఎందుకింత పెద్దశిక్ష వేశావని బోరున విలపించారు. ఇంకెవరి కోసం బతకాలంటూ రోదిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. గ్రామస్థులు, బంధువులు కూడా కంటతడి పెట్టారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


ప్రసాద్‌ బంధువుల ఆందోళన

ప్రశాంత్‌ ఇంటిపై దాడికి యత్నం

మృతుల బంధువులను సముదాయిస్తున్న ఎస్సై సుధీర్‌రావు

మాక్లూర్‌, న్యూస్‌టుడే: మాక్లూర్‌లో మంగళవారం సాయంత్రం ప్రసాద్‌ బంధువులు ఆందోళన చేశారు. ఆరుగురిని హతమార్చిన ప్రశాంత్‌ను కఠినంగా శిక్షించాలని నినదించారు. ఒక దశలో నిందితుడి ఇంటిపై దాడి చేయడానికి యత్నించారు. తమకు సహకరించాలని సర్పంచి అశోక్‌రావుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆయన ఒప్పుకోనందున చాలాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు గ్రామ పెద్దలు నచ్చచెప్పడంతో ప్రసాద్‌ బంధువులు శాంతించారు. తర్వాత ఎస్సై సుధీర్‌రావు అక్కడికి రావడంతో వారు మళ్లీ కోపోద్రేక్తులయ్యారు. హంతకులపై వెంటనే చర్యలు చేపట్టాలంటూ ఆయనతో వాగ్వాదానికి దిగారు. చట్ట ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారిని ఎస్సై సముదాయించారు. హత్య కేసులో ప్రమేయమున్న ప్రశాంత్‌ వల్ల 33 గుంటల భూమిని లస్మన్న అనే రైతు కోల్పోయాడు. మరికొందరూ ప్రశాంత్‌కు అప్పు ఇచ్చి లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వారు వేడుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని