logo

కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డికి కష్టాలే

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సమర్థుడైనప్పటికీ కాంగ్రెస్‌లో పనులు చేయనీయరని.. ఆయనకు కష్టాలు తప్పవని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పేర్కొన్నారు.

Published : 17 Apr 2024 04:14 IST

రైతుబంధు నిధులు ఖమ్మం, నల్గొండ నేతలకు 

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌, చిత్రంలో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, జిల్లా దినేష్‌, నాయకులు

ఈనాడు, నిజామాబాద్‌ : రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సమర్థుడైనప్పటికీ కాంగ్రెస్‌లో పనులు చేయనీయరని.. ఆయనకు కష్టాలు తప్పవని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పేర్కొన్నారు. ఆ పార్టీలో యువ నాయకులను ఎదగనీయరని, రాజేష్‌ పైలెట్‌, మాధవ్‌రావు సింధియా, శశిథరూర్‌, గతంలో మమత బెనర్జీ ఆ కోవకు చెందిన వారేనని తెలిపారు. ఎవరినీ ఎక్కువ కాలం ముఖ్యమంత్రి సీటులో ఉండనీయరని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆయన మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికొదిలేసి..దిల్లీ పెద్దలకు డబ్బులు ముట్టజెప్పటంపైనే సీఎం దృష్టిసారిస్తున్నారంటూ విమర్శించారు. భాజపా, భారాస ఒక్కటే అని.. కేసీఆర్‌ డమ్మీ అభ్యర్థులను నిలుపుతున్నారని రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణపై ఆయన స్పందించారు. ఖమ్మం, కరీంనగర్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక, మెదక్‌ తదితర సీట్లలో డమ్మీలను నిలిపిన అభ్యర్థుల విషయంలో రేవంత్‌ ఏమంటారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుబంధు కోసం కేసీఆర్‌ కేటాయించిన నిధులను ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బు కింద ఖమ్మం, నల్గొండ కాంగ్రెస్‌ నేతలకు ముట్టజెప్పారని ఆరోపించారు. అందుకే రైతుబంధు ఇవ్వలేకపోయారన్నారు. డిసెంబరు 9న అమలు చేస్తామన్న రూ.2 లక్షల రుణమాఫీ, ఆగస్టు 15కు మార్పు చేయడం కూడా మోసమే అన్నారు. భాజపా విడుదల చేసిన సంకల్ప్‌ పత్ర్‌ అన్నివర్గాల అభ్యున్నతి, దేశాభివృద్ధికి సూచికగా నిలువనుందని వెల్లడించారు.

12 ఎంపీ సీట్లు గెలవడం ఖాయం

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: రోజురోజుకు భాజపా గ్రాఫ్‌ పెరుగుతోందని, తాజా సర్వేల ప్రకారం 12 సీట్లు గెలవబోతుందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం 35వ డివిజన్‌ పరిధిలోని నాందేవ్‌వాడలో మంగళవారం గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి ప్రచార స్టిక్కర్లు అతికించారు. మహిళలు ఎంపీకి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆగస్టులో రూ.రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్‌ చెబుతోందని విలేకర్లు ప్రశ్నించగా...అప్పటి వరకు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారో లేదో చూడాలని వ్యాఖ్యానించారు. కాలనీలో పర్యటించి ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి గురించి వివరించారు. అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ కార్పొరేటర్‌ ఎర్రం సుధీర్‌, భాజపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు