logo

సాగర్‌లో పూడిక.. తొలగించాలిక

ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్‌లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు.

Published : 24 Apr 2024 06:03 IST

 

ఈనాడు, కామారెడ్డి: ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్‌లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. నిర్మాణ సమయంలో 29.70 టీఎంసీలు, ఆయకట్టు 2.75 లక్షల ఎకరాలు ఉండగా కాలక్రమేణా పూడిక చేరడంతో సామర్థ్యం తగ్గింది. పూడిక తొలగించేందుకు చేస్తున్న కార్యాచరణపై కథనం.

ప్రభుత్వానికి ప్రతిపాదన

రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల బృందం ఇటీవల రాజస్థాన్‌లోని బీసల్‌పుర్‌ జలాశయంలోని పూడిక తొలగించేందుకు ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రక్రియ పరిశీలించింది. ప్రైవేటు గుత్తేదారు ఆధ్వర్యంలో 25 ఏళ్ల కాలపరిమితితో అక్కడ పూడిక తొలగిస్తున్నారు. ఇదే మాదిరిగా నిజాంసాగర్‌తో పాటు రాష్ట్రంలో మరో ఐదు ప్రాజెక్టుల్లో పూడిక తొలగించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచి ఆమోదముద్ర వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కానరాని వరద కుంటల నిర్మాణం

1965లో పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం 11.2 టీఎంసీలకు పడిపోయింది. 1974-78 మధ్య కాలంలో గేట్లు ఎత్తు పెంచి అదనంగా మరో 20 వరద గేట్ల నిర్మాణం పూర్తిచేసి 17.9 టీఎంసీలు నిల్వ ఉండేలా ఆధునీకరించారు. నిబంధనల ప్రకారం ప్రాజెక్టులోకి వరద వచ్చే ప్రాంతాల్లో కుంటల నిర్మాణం చేపట్టి పూడిక పేరుకుపోకుండా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఏర్పాట్లు లేవు. ఎగువ భాగంలో ఆశించిన వర్షాలు కురవకపోవడంతో వరద దిగువకు రాని పరిస్థితి. పోచారం, సింగూర్‌ జలాశయాలు నిండిన సమయంలో వదిలిన వరద కారణంగానే పూడిక వస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

ఆయకట్టుకు జీవం

నిజాంసాగర్‌ కింద 2.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. పూడిక తొలగిస్తే వానాకాలంలోనే నిండి రెండు సీజన్లకు సరిపడా సాగునీరు సరఫరా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయకట్టు ప్రాంత ప్రజాప్రతినిధులు పూడిక తొలగించే ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడేలా చూడాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని