logo

అమృత్‌ అందలే

పురపాలక సంఘాల్లో మరో 20 ఏళ్ల వరకు దాహార్తి సమస్య లేకుండా చేయాలన్నది అమృత్‌ 2.0 ఉద్దేశం.  పార్కులు, మురుగునీటి శుద్ధి ప్లాంటు వంటి పనులు ప్రతిపాదించారు. తీరా ఈ ప్రభుత్వంలో పనులు చేస్తే బిల్లులు వస్తాయా?

Updated : 19 Mar 2024 06:05 IST

మౌలిక సదుపాయాలకు ప్రతిపాదించిన రామన్నదొరవలస జగనన్న కాలనీ. ఇక్కడ ఎలాంటి పనులు జరగలేదు

పురపాలక సంఘాల్లో మరో 20 ఏళ్ల వరకు దాహార్తి సమస్య లేకుండా చేయాలన్నది అమృత్‌ 2.0 ఉద్దేశం.  పార్కులు, మురుగునీటి శుద్ధి ప్లాంటు వంటి పనులు ప్రతిపాదించారు. తీరా ఈ ప్రభుత్వంలో పనులు చేస్తే బిల్లులు వస్తాయా? రావా? ఉన్న అనుమానంతో గుత్తేదారులు వెనుకంజ వేస్తున్నారు.

న్యూస్‌టుడే, బొబ్బిలి, నెల్లిమర్ల


 బొబ్బిలి, నెల్లిమర్లలో టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. బొబ్బిలి పురపాలక సంఘంలో నీటి సరఫరాకు రూ.10.70 కోట్లు, చెరువుల సుందరీకరణకు రూ.1.19 కోట్లు మొత్తం రూ.11.89 కోట్లు కేటాయించగా భూమిపూజ చేసి వదిలేశారు. జగనన్న కాలనీల్లో ఈ నిధులు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కౌన్సిల్‌ తీర్మానం చేశారు. పట్టణంలోని రామన్నదొరవలస వద్ద జగనన్న లేఅవుటు-1, 2లో సుమారు రెండు వేల ఇళ్ల నిర్మాణాలకు, ఐటీఐ కాలనీ వద్ద కాలనీలో 400 మందికి పట్టాలు ఇచ్చారు. అక్కడ రిజర్వాయర్లు నిర్మించి ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చెరువుల సుందరీకరణలో భాగంగా భైరవసాగరం గట్టు అభివృద్ధి, విద్యుద్దీకరణ పనులు ప్రతిపాదించారు. భైరవసాగరం చెరువు గట్టును చదును చేసి వదిలేశారు.


ఇంకా డీపీఆర్‌లో..

విజయనగరం పురపాలక సంఘానికి అమృత్‌ 2.0లో రూ.66.62 కోట్లు కేటాయించారు. ఇందులో నీటి సరఫరాకు రూ.31.56 కోట్లు, సీవేజ్‌ మేనేజ్‌మెంటుకు రూ.28.05 కోట్లు, చెరువుల సుందరీకరణకు రూ.3.51 కోట్లు ఉంది. వీటితో ఇంకా ఎక్కడెక్కడ ఏయే పనులు చేపట్టాలో తెలిపే సమగ్ర నివేదిక (డీపీఆర్‌) తయారీలోనే ఉన్నారు.
బీ రాజాం పురపాలక సంఘానికి రూ.9.34 కోట్లు కేటాయించారు. ఇందులో తాగునీటి పనులకు రూ.8.40 కోట్లు, చెరువుల సుందరీకరణకు రూ.93 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా నివేదికలు తయారు చేయలేదు.


నెల్లిమర్ల నగర పంచాయతీకి రూ.4.97 కోట్లు కేటాయించారు. ఇందులో తాగునీటి సరఫరా పనులకు రూ.4.48 కోట్లు, చెరువుల సుందరీకరణకు రూ.50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. కొంచవాని చెరువులో తూడు తొలగించి, పనులు సగంలో వదిలేశారు.


గుత్తేదారులకు సూచించాం

బొబ్బిలి, నెల్లిమర్లలో టెండర్లు పూర్తయ్యాయి. ఇక్కడ పనులు చేయాలని గుత్తేదారులకు సూచించాం. కానీ తాత్సారం చేస్తున్నారు. విజయనగరం, రాజాంలో పనులకు సంబంధించి డీపీఆర్‌లు తయారు చేస్తున్నాం. ఇక్కడ టెండర్లు పిలిచేందుకు చర్యలు చేపట్టాం.

దక్షిణామూర్తి, ఈఈ, ప్రజారోగ్య శాఖ, విజయనగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని