logo

‘నోటు’మాట కుదరదు

ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు వినియోగించే మద్యం, నగదు రవాణా, పంపిణీపై విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పోలీసు యంత్రాంగం నిఘా వేసింది.

Published : 30 Mar 2024 03:01 IST

సమాధానం చెప్పాల్సిందే

దండిగాం కూడలిలో తనిఖీలు

ఈనాడు-విజయనగరం: ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు వినియోగించే మద్యం, నగదు రవాణా, పంపిణీపై విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పోలీసు యంత్రాంగం నిఘా వేసింది. ఎవరైనా తన వెంట రూ.50 వేలు వరకు మాత్రమే తీసుకెళ్లవచ్చు. అంతకు మించితే ఆధారాలు చూపించాలి. ముఖ్యంగా వ్యాపారులు సంబంధిత పత్రాలు, లావాదేవీల బిల్లులు కలిగి ఉండాలి. బ్యాంకు నుంచి డ్రా చేస్తే ఆ నగదు ఎక్కడ నుంచి మీ ఖాతాలోకి వచ్చింది.. ఆ మొత్తాన్ని ఎందుకు వినియోగిస్తారో తెలియజేయాలి. రూ.రెండు లక్షలకు మించితే ఎన్నికల విభాగంలోని రెవెన్యూ, పోలీసు అధికారులు లోతుగా పరిశీలిస్తారు. దానికి ఆధారాలు లేకుంటే స్వాధీనం చేసుకుంటారు. రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటే జిల్లా ఎన్నికల అధికారులు నియమించే కమిటీ ముందుకు వెళ్తుంది. ఆ కమిటీ ముందు నగదు యజమాని హాజరై సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై ఆ కమిటీ సంతృప్తి చెందితే నగదు అప్పగిస్తుంది. లేకుంటే పోలీసు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రూ.10 లక్షలకు మించి స్వాధీనం చేసుకుంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఆ నగదు సీజ్‌ చేసిన అధికారులు బాధ్యులకు నోటీసులు జారీ చేస్తారు. వారిచ్చే సమాధానాన్ని వివిధ కోణాల్లో పరిశీలించి చర్యలు తీసుకుంటారు.

  • చేతి గడియారాలు, బంగారంతో తయారు చేసిన కొత్త వస్తువులు, వెండి బొమ్మలు, భరిణెలు, పట్టీలు వంటి చిరు ఆభరణాలతో పాటు బహుమానాలు, కుక్కర్లు, క్రికెట్‌ కిట్లు వంటి సామగ్రి విలువ రూ.10 వేలకు మించితే పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. వీటిని తరలించే వారు వ్యాపార నిమిత్తం అయితే పత్రాలు చూపిస్తే తిరిగి అప్పగిస్తారు. లేకుంటే సీజ్‌ చేస్తారు.
  • పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు రూ.50 వేలు లోపైనా.. వస్తువులు రూ.10 వేలు లోపైనా.. ఓటర్లను ప్రలోభ పెట్టడానికని ఆధారాలు లభిస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారు. బాధ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తారు. అధికార పార్టీ నాయకులు పెద్ద మొత్తంలో ఆర్డర్‌ ఇచ్చి ఈ నెల 16 నాటికి వాటిని దాదాపు పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని