logo

కన్నుమూస్తున్నా.. కనికరం లేదా?

‘మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను’ అని చెప్పుకొచ్చే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఎన్నడూ లేని విధంగా మాతృ మరణాలు సంభవిస్తున్నాయి.

Updated : 15 Apr 2024 06:16 IST

ఐదేళ్లలో 90కి పైగా మాతృ మరణాలు 

 న్యూస్‌టుడే, విజయనగరం వైద్యవిభాగం : ‘మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను’ అని చెప్పుకొచ్చే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఎన్నడూ లేని విధంగా మాతృ మరణాలు సంభవిస్తున్నాయి. గత అయిదేళ్లలో విజయనగరం జిల్లాలో 96 మంది వరకు మరణించారు. ఘటనలపై వైద్యారోగ్యశాఖ వివిధ కారణాలు చెబుతున్నా.. కేసులు మాత్రం నమోదవుతూనే ఉన్నాయి. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

హైరిస్క్‌ కేసులు అధికం..

వివాహిత గర్భం దాల్చినప్పటి నుంచి వైద్యారోగ్యశాఖ సిబ్బంది ప్రత్యేకంగా పర్యవేక్షించాలి. అవసరమైన వైద్య సేవలు అందించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. లోటుపాట్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత అయిదేళ్లలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేలకు పైగా హైరిస్క్‌ కేసులు నమోదయ్యాయి. రక్తహీనతతో బాధపడినవారు సైతం ఎక్కువగానే ఉన్నారు. ఈక్రమంలో సాధారణ ప్రసవాలు భారీగా తగ్గిపోయాయి. ఉమ్మనీరు తగ్గిపోవడం, రక్తపోటు, ఇతర అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడుతున్నారు.

కానరాని సేవలు..

వైకాపా ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. సచివాలయానికో ఏఎన్‌ఎంను నియమించినా వారి సేవలు అంతంత మాత్రమే. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల పరిధిలోని ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది గర్భిణులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. ఈ ప్రక్రియ అంతంత మాత్రంగానే సాగుతోంది. అంగన్‌వాడీల ద్వారా పోషకాహార కిట్లు అందజేస్తున్నా వాటిల్లో నాణ్యతా లోపంతో ఇబ్బందులు తప్పడం లేదు.


 ప్రత్యేక చర్యలు..

గర్భిణులపై పర్యవేక్షణ పెంచాం. వారి ఆరోగ్యానికి సంబంధించి జవాబుదారులుగా వైద్యాధికారులను, ఏఎన్‌ఎంలను నియమించాం. 104, ఫ్యామిలీ డాక్టర్‌ తదితర సేవలు అందుతున్నాయి. ఇటీవల కిల్కారీ విధానాన్ని తీసుకొచ్చి, మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించి, బిడ్డకు పాలిచ్చే వరకు 75 సార్లు ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నాం. మరణాలు సంభవించకుండా చూస్తాం.

 డా.ఎస్‌.భాస్కరరావు, డీఎంహెచ్‌వో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని