logo

‘ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మునే కాజేశారు’

‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారిని కేసుల్లో ఇరికించి, జైళ్లకు పంపించారు. పోరాడాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు’ అని ఏపీజీఈఏ(ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్‌) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 15 Apr 2024 02:54 IST

మాట్లాడుతున్న రాష్ట్రాధ్యక్షుడు సూర్యనారాయణ

విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారిని కేసుల్లో ఇరికించి, జైళ్లకు పంపించారు. పోరాడాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు’ అని ఏపీజీఈఏ(ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్‌) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఐక్యవేదిక సమావేశం ఆదివారం విజయనగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీపీఎస్‌ రద్దు చేసి, ఓపీఎస్‌ తీసుకు రావాలని ఆందోళనలు చేసినా ప్రయోజనం చేకూరలేదన్నారు. కొత్తగా జీపీఎఫ్‌ చట్టం తీసుకొచ్చారని, రాష్ట్రంలో ఏ చట్టం ఎప్పుడు వస్తోందో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదని మండిపడ్డారు. జీపీఎఫ్‌ సొమ్మును అక్రమంగా కాజేసిందని ఆరోపించారు. రూ.483 కోట్ల నిధులు సంబంధిత ఖాతా నుంచి పక్కదారి పట్టినట్లు స్వయంగా కేంద్రమే ప్రకటించిందని గుర్తుచేశారు. ఉద్యోగుల అవసరాలకు దాచుకున్న సొమ్మును ఎలా తీసేస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ప్రైవేటు ఉద్యోగులో, ప్రభుత్వ ఉద్యోగులో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. సచివాలయాల వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందన్నారు. మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ పథకానికి సంబంధించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులను మోసం చేశారని విమర్శించారు. ఆరోగ్య కార్డులతో ఆసుపత్రులకు వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులంతా మేల్కోవాలని పిలుపునిచ్చారు. వారిలో చైతన్యం నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. అందులో భాగంగా విజయనగరంలో తొలి సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో 30 సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి 12 ప్రాధాన్యత అంశాలను లేవనెత్తనున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని