logo

అన్నా.. రాయితీ పరికరం ఏదన్నా?

తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి గత అయిదేళ్లలో అన్నదాతలకు తీవ్ర అన్యాయం చేశారు.

Published : 15 Apr 2024 02:57 IST

అద్దె పరికరంతో పిచికారీ చేస్తున్న రైతు

పార్వతీపురం పట్టణం, సీతానగరం, విజయనగరం వ్యవసాయ విభాగం, న్యూస్‌టుడే: తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి గత అయిదేళ్లలో అన్నదాతలకు తీవ్ర అన్యాయం చేశారు. కనీస అవసరాలను సమకూర్చడంలోనూ విఫలమయ్యారు. పంటలకు ఆశించిన చీడ, పీడల నివారణకు రసాయనాల పిచికారీ తప్పనిసరి. నారుమడుల దశ నుంచి పంట చివరి దశ వరకు అనేక సందర్భాల్లో ఈ ప్రక్రియ చేపట్టాలి. ఈమేరకు పరికరాలు ఉండాలి. అలాగే ఉత్పత్తులను భద్రపరిచేందుకు టార్పాలిన్లు అవసరం. గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ అందేవి. వైకాపా వచ్చాక వీటన్నింటి పంపిణీకి మంగళం పాడేసింది.

ఎదురుచూపులు..

ఉమ్మడి జిల్లా పరిధిలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 5.36 లక్షల ఎకరాలు. గత ఖరీఫ్‌లో 4.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. 3.50 లక్షల మంది రైతులు పొలాల్లోనే ఉంటున్నారు. ఈ రబీలో 70 వేల ఎకరాల్లో పంటలు వేశారు. కాలాన్ని అనుసరించి అన్నదాతలకు స్పేయర్లు, టార్పాలిన్లు, నూర్పు యంత్రాలు, బ్రష్‌ కట్టర్లు, పవర్‌ టిల్లర్లు తదితరాలు అవసరం. తెదేపా ప్రభుత్వ హయాంలో 50 శాతం రాయితీపై వ్యవసాయ, ఉద్యాన శాఖల ద్వారా వీటిని సమకూర్చేవారు. ప్రభుత్వం మారాక ఈ పథకాన్ని ఎత్తేసింది. రైతు భరోసా కేంద్రం పరిధిలో గ్రూపులు ఏర్పాటు చేసి వారికి మాత్రమే ట్రాక్టర్లు, నూర్పు యంత్రాలు అందించింది. వాటిని కూడా అద్దె ప్రాతిపదికన వినియోగించాలి.

తప్పని అద్దె బాధలు..

యంత్రాలు, పరికరాలు లేకపోవడంతో చాలామంది అద్దెకు తెచ్చుకుని వాడుతున్నారు. ఉదాహరణకు తైవాన్‌ స్ప్రేయర్‌ ధర రూ.23 వేలు ఉంటుంది. కొనేందుకు చాలామందికి స్థోమత లేదు. దీంతో అద్దెకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. పిచికారీ యంత్రాలను సైతం అలానే తీసుకొస్తున్నారు. మొక్కజొన్న, వరి రైతులు టార్పాలిన్లు లేక ఇబ్బంది పడుతున్నారు.


పెరిగిన పెట్టుబడులు..

మూడెకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశాను. గత ప్రభుత్వం రాయితీపై స్ప్రేయర్లు అందించింది. ఈ ప్రభుత్వ హయాంలో ఇంత వరకు ఒక్క పరికరం కూడా రాలేదు. అధికారులను అడిగితే లేవని చెప్పేవారు. బయట మార్కెట్‌లో వాటి ధర ఎక్కువగా ఉంది. దీంతో అవసరం మేరకు అద్దెకు తెచ్చుకుంటున్నాం.

 సీహెచ్‌.సింహాచలం, సీతానగరం మండలం


అధికారులు ఏమన్నారంటే...

వ్యక్తిగత పరికరాలు, టార్పాలిన్లు, స్ప్రేయర్లు తదితర పరికరాలు రాయితీపై కావాలని రైతులు అడుగుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఆర్బీకేల వద్ద ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

 రాబ ర్ట్‌పాల్‌, వీటీ.రామారావు, వ్యవసాయాధికారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని