logo

ఇసుకాసురులు... నదులను రక్షిస్తారా?

నదులు కనిపిస్తే చాలు.. అధికార పార్టీ నాయకులు ఓ కన్నేస్తారు.. ఎందుకంటారా.. ప్రవాహం తగ్గిన వెంటనే ఇసుక దోచేయడానికి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పెద్దఎత్తున తవ్వేశారు కొందరు కేటుగాళ్లు.. అలాంటిది వారు నదులను సంరక్షిస్తారని కేంద్రం నమ్మేసినట్లుంది.

Published : 15 Apr 2024 03:02 IST

మురుగుశుద్ధికి కేంద్రమిచ్చిన నిధులు నిరుపయోగం
ఐదేళ్లలో వైకాపా చేసింది శూన్యం

చినహరిజనపేట వద్ద నదిలో కలుస్తున్న వ్యర్థాలు, మురుగునీరు

నదులు కనిపిస్తే చాలు.. అధికార పార్టీ నాయకులు ఓ కన్నేస్తారు.. ఎందుకంటారా.. ప్రవాహం తగ్గిన వెంటనే ఇసుక దోచేయడానికి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పెద్దఎత్తున తవ్వేశారు కొందరు కేటుగాళ్లు.. అలాంటిది వారు నదులను సంరక్షిస్తారని కేంద్రం నమ్మేసినట్లుంది. మురుగు, వ్యర్థాలు కలవకుండా రూ.కోట్ల మేర నిధులు విడుదల చేసింది. మాటల మూటలే తప్ప.. పనులు చేయడం చేతగాని ఈ ప్రభుత్వం సరే అని చెప్పింది. అరకొరగా ట్యాంకులు పెట్టి, పదే పది రోజులు ప్రక్రియను చేపట్టింది. అంతే.. ఆ తరువాత గాలికొదిలేసింది. ఈ చర్యలను చూసిన సాలూరు పరిధిలోని వేగావతి నది బోరుమంటోంది.

 న్యూస్‌టుడే, సాలూరు

నదులు, చెరువులు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం రూ.కోట్ల నిధులు మంజూరు చేసింది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాలుష్య నియంత్రణ మండలి సైతం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ వైకాపా అయిదేళ్ల పాలనలో కనీస చర్యలు లేవు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన వేగావతి నది మురుగుమయం అవుతోంది. పాచిపెంట, సాలూరు, బొబ్బిలి మండలాల్లో దాదాపు 40 కి.మీలకు పైగా ఇది ప్రవహిస్తోంది. ఒకప్పుడు తీర ప్రాంతాల వారు ఈ నీటినే వినియోగించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పెద్దఎత్తున వ్యర్థాలు చేరుతున్నాయి. ఒక్క సాలూరు పట్టణంలోనే గుమడాం, రెల్లివీధి, శివాలయం రోడ్డు, గాంధీనగర్‌, నెయ్యిలవీధి, చినహరిజనపేట, కర్రివీధి, మజ్జులపేట ప్రాంతాల్లో మురుగునీరు నేరుగా కలిసిపోతోంది. వ్యర్థజలాలు కలవకుండా ఔట్‌లెట్‌ కాలువ నిర్మించాల్సి ఉంది. ఐదేళ్లలో అదీ లేదు. గతంలో సగం వరకు నిర్మించిన కాలువ కూడా పూడికతో నిండిపోయింది.

మురుగునీటి శుద్ధి కోసం గతంలో గాంధీనగర్‌ వద్ద ఏర్పాటు చేసిన రసాయన ట్యాంకులివి. నిర్వహణ లేక పది రోజులకే తొలగించారు

ప్రతిపానలకే పరిమితం..

మురుగునీరు నదిలో కలవకుండా చర్యలు చేపట్టి, ఆ నీటిని శుద్ధి చేసే కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సుమారు రూ.5 కోట్ల నిధులు వెచ్చించేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. ఔట్‌లెట్‌ కాలువ, శుద్ధి కేంద్రం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈమేరకు రూ.1.50 కోట్ల నిధులు విడుదలయ్యాయి. స్థలం అందుబాటులో లేకపోవడంతో శుద్ధి కేంద్రం ఏర్పాటు ప్రక్రియ ప్రతిపాదనలకే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మండిపడింది. ఆ చర్యలను తప్పించుకునేందుకు మొక్కుబడిగా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. రెండు రసాయన ట్యాంకులు, నిరంతర పర్యవేక్షణకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పదిరోజుల్లోనే అవన్నీ మాయమయ్యాయి.

రసాయనాలు సైతం..

సాలూరు పట్టణంలో లారీ మోటారు పరిశ్రమకు చెందిన వేలాది మందితో పాటు బంగారు, వెండి, ఇత్తడి పనులు చేసే కార్మికులున్నారు. వాహనాలకు మరమ్మతులు చేసిన తరువాత వచ్చే ఆయిల్‌, ఆభరణాల తయారీ, శుభ్రతకు వినియోగించే రసాయనాలు కూడా నదిలో చేరుతున్నాయి. సాలూరు, బొబ్బిలి పట్టణాల ప్రజలకు నిత్యం అందించాల్సిన 7 ఎంఎల్‌డీ నీటికి ఇదే దిక్కు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో అందడం లేదు. శుభ్రతకే సగం మేర ఖర్చవుతోంది. బొబ్బిలి పట్టణ ప్రజలకు తాగునీరు అందించే భోజరాజపురం నీటి సరఫరా కేంద్రానికి కూడా ఈ నది నీరే దిక్కు. జలాలు కలుషితం కావడంతో గతంలో శివరాంపురం, పారన్నవలస, రొంపల్లి గ్రామాల్లో ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు.

సాలూరులో వేగావతి వంతెన కింద దుస్థితి..

చర్యలు చేపడుతున్నాం..

‘శుద్ధి కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన జరుగుతోంది. అవసరమైతే కొనుగోలుకు చర్యలు తీసుకుంటాం. నిధులు సైతం ఉన్నాయి. నదిలోకి కాలువల నీరు చేరకుండా చూస్తున్నాం.’ అని పురపాలిక ఏఈ సూరినాయుడు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని