logo

బలసలరేవు వంతెనపై కపట ప్రేమ

సంతకవిటి మండలంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, పొందూరు మండలాల ప్రజల కష్టాలను తీర్చే బలసలరేవు వంతెన నిర్మాణ పనుల్లో ప్రభుత్వం కపట ప్రేమ బయటపడింది.

Published : 15 Apr 2024 03:07 IST

నిర్మిస్తామని చేతులెత్తేసిన ముఖ్యమంత్రి 

సంతకవిటి మండలంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, పొందూరు మండలాల ప్రజల కష్టాలను తీర్చే బలసలరేవు వంతెన నిర్మాణ పనుల్లో ప్రభుత్వం కపట ప్రేమ బయటపడింది. వారధి నిర్మిస్తామని చెప్పిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. రూపాయి కూడా విదల్చలేదు. వాల్తేరు, ఇసుకలపేట మధ్యగల నాగావళి నదిపై వంతెన నిర్మించాల్సి ఉంది. వరదల సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని వాల్తేరు గ్రామస్థులు, వంతెన పోరాట కమిటీ సభ్యులు దాదాపు రెండేళ్ల పాటు ఆందోళనలు చేపట్టారు. ఈక్రమంలో గత ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి బలసలరేవు వద్ద వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత రూ.87 కోట్ల నిధులు మంజూరు చేశారు. 2022 ఫిబ్రవరిలో పనులు ప్రారంభమయ్యాయి. 18 నెలల్లో పూర్తిచేయాల్సి ఉంది. ఏడాదిలో 16 పిల్లర్లకు గానూ ఎనిమిదింటిని నిర్మించారు. అప్పటికే రూ.12 కోట్లు వెచ్చించిన గుత్తేదారుకు రూపాయి కూడా రాకపోవడంతో ఆగిపోయారు. దీంతో అక్కడున్న నిర్మాణ సామగ్రి పాడవుతోంది. ఇనుప చట్రాలు, ఊచలు ఇప్పటికే తుప్పుపట్టాయి. వాహనాలు, జనరేటర్లు, ఇతర పరికరాలు మాయమవుతున్నాయి. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆర్‌అండ్‌బీ(శ్రీకాకుళం) ఈఈ రవినాయకర్‌ తెలిపారు. తుప్పుపట్టిన పరికరాలను ఉపయోగించకుండా చూస్తామన్నారు.  

 న్యూస్‌టుడే, సంతకవిటి

 

వాల్తేరు గ్రామ సమీపంలో తుప్పు పడుతున్న ఇనుప చట్రాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని