logo

జగనన్న ‘నయా మోసం’

‘ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన ఆరు నెలల్లో వడ్డీతో సహా డబ్బులు చెల్లించి బాధితులకు న్యాయం చేస్తా.’

Published : 15 Apr 2024 03:17 IST

 అగ్రిగోల్డ్‌ బాధితుల ఎదురుచూపులు

‘ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన ఆరు నెలల్లో వడ్డీతో సహా డబ్బులు చెల్లించి బాధితులకు న్యాయం చేస్తా.’

 అగ్రిగోల్డ్‌ బాధితులకు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ.

 హామీ ఇవ్వడంతో ప్రభుత్వం వైపు ఎంతో ఆశగా అయిదేళ్లు ఎదురుచూశాం. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి వినతులు అందజేశాం. చివరకు వైద్య ఖర్చులు, పిల్లల వివాహాలు ఇతరత్రా ఖర్చులకు డబ్బులు లేక అప్పుల పాలయ్యాం.. కొందరు ఆర్థిక, మానసిక ఒత్తిళ్లతో ఆత్మహత్యలకు, అసహజ మరణాలకు గురయ్యారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.


 బాధితులు న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్‌

ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల మందికి పైగా అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నారు. 2020, 2021లో రెండు విడతలుగా రూ.10 వేలు, రూ.20 వేలు లోపు మొత్తాలు 1,20,225 మందికి రూ.102.83 కోట్లు చెల్లించినట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు. వడ్డీ కాకుండా కేవలం లబ్ధిదారులు కట్టిన మొత్తాన్ని మాత్రమే చెల్లించారు. రెండో విడతగా ఇచ్చిన రూ.20 వేల మొత్తాలు కొందరికి అందని పరిస్థితి ఉంది. రూ.20 వేల పైబడిన మొత్తాల డిపాజిట్ల ఊసే లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. ఒక వ్యక్తికి ఒకే బాండు మేరకే చెల్లింపులు చేశారు. దీంతో రెండు, మూడు బాండ్లు ఉన్న వారు నష్టపోయారు. రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.20 లక్షల మొత్తాలు డిపాజిట్లు చేసిన వారికి రూ.10 వేలు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం వీరంతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

కలెక్టరేట్‌కు వచ్చిన బాధితులు (పాత చిత్రం)

తెదేపా హయాంలో న్యాయస్థానంలో ఉన్న ఆస్తులు అమ్మి ఇచ్చారు. ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన మాట మేరకు జగన్‌ న్యాయం చేయలేదు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం లేదు. సంస్థ ఆస్తులు స్వాధీనం చేసుకుని సత్వరమే డిపాజిట్లు ఇప్పించాలి.

- పి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, అగ్రిగోల్డ్‌ కస్టమర్‌, ఏజెంట్స్‌ సంక్షేమ సంఘం, ఉమ్మడి విజయనగరం జిల్లా

స్పందనలో వినతులు

బాధితులు తమకు న్యాయం చేయాలని ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారంతా పలుమార్లు కలెక్టరేట్‌లో స్పందనలో అధికారులకు ఫిర్యాదు చేశారు. వైద్య ఖర్చులు, పిల్లల వివాహాలు, కుటుంబ అవసరాలకు డబ్బుల్లేక అప్పులు చేశామని పేర్కొన్నారు. డబ్బులు రాక ఉమ్మడి జిల్లాలో పది మంది వరకు సహజ మరణంతో పాటు ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితుల సంఘం నాయకులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు నిస్సహాయులుగా మారి ప్రభుత్వ ఓదార్పు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన మాట మేరకు మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.


 నేను, నా భార్య కలిపి రూ.5 లక్షల డిపాజిట్లు వేశాం. నేటికీ అతీగతి లేదు. రూ.10 వేల బాండుకు మాత్రమే డబ్బులు వచ్చాయి. రూ.50 వేలు, రూ.లక్ష బాండ్లకు నేటికీ డబ్బులు ఇవ్వలేదు. రూ.20 వేల లోపు మొత్తాలు ఇచ్చినప్పుడు నాకు రాలేదు.

 పి.సింహాచలం, బుడతనాపల్లి


 ఒకటికి మించి బాండ్లు కలిగిన వారికి డబ్బులు పడలేదు. రూ.5 లక్షలు డిపాజిట్లు వేశాను. రూ.10 వేల చొప్పున రెండు సార్లు పడ్డాయి. రూ.20 వేల డిపాజిట్ల చెల్లింపు సమయంలో రాలేదు.

 పి.అప్పలనర్సింహులు, గంట్యాడ


రూ.17 లక్షలు.. వచ్చింది రూ.10 వేలు

రూ.17 లక్షలు డిపాజిట్‌ వేశాను. ఇప్పటి వరకు రూ.10 వేలు వచ్చింది. నా వయసు 65 సంవత్సరాలు. ఆరోగ్యం బాగోలేదు. చికిత్సకు అవసరమైన డబ్బుల్లేక అక్కడక్కడ అప్పులు చేసుకుని బైపాస్‌ సర్జరీ చేయించుకున్నాను. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా. అగ్రిగోల్డ్‌ ఆస్తులు స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలి.

 కె.ఆనందరావు, విజయనగరం  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని