logo

తుస్‌.. ఫిష్‌

తక్కువ ధరకే తాజా.. చెరువులు, సముద్రంలో పెరిగే నాణ్యమైన చేపలను విక్రయిస్తామని భారీ ఎత్తున ప్రచారం చేసి ఏర్పాటు చేసిన ఫిష్‌ ఆంధ్ర అవుట్‌లెట్లు జిల్లాలో మూలకు చేరాయి.

Published : 15 Apr 2024 03:40 IST

మూలకు చేరిన యూనిట్లు
యువత దరిచేరని ఉపాధి

 మాంసం దుకాణాలుగా.. సాలూరు మండలం జీగిరాం, మామిడిపల్లి, బాగువలసలో ఫిష్‌ ఆంధ్ర కేంద్రాలు ప్రారంభించారు. జీగిరాంలో నడుస్తుండగా మిగిలిన చోట్ల కోడిమాంసం విక్రయ  దుకాణాలుగా మారాయి.

న్యూస్‌టుడే, సాలూరు గ్రామీణం


పార్వతీపురం, పట్టణం, పాచిపెంట, సీతంపేట, న్యూస్‌టుడే: తక్కువ ధరకే తాజా.. చెరువులు, సముద్రంలో పెరిగే నాణ్యమైన చేపలను విక్రయిస్తామని భారీ ఎత్తున ప్రచారం చేసి ఏర్పాటు చేసిన ఫిష్‌ ఆంధ్ర అవుట్‌లెట్లు జిల్లాలో మూలకు చేరాయి. యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రారంభించిన ఈ పథకం ఏమైందో తెలియని పరిస్థితి. చేపలు కొందామని కేంద్రాలకు వెళ్లే వారికి ఖాళీ బోర్డులు, కోడి మాంసం, కిరాణా సరకులు తప్ప ఏమీ దొరకని దుస్థితి.

మన్యం జిల్లాలో 74 మినీ యూనిట్ల ఏర్పాటుకు రూ.41.31 లక్షలు విడుదల చేశారు. వీటిలో స్పోక్స్‌ పేరుతో నాలుగు అంచెల్లో పథకాలకు రూపకల్పన చేశారు. రూ.10 లక్షలు, రూ.20 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి వ్యయంతో ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు నిర్ణయించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన మినీ కేంద్రాల్లో ఒకటి రెండు తప్ప మిగిలిన వాటిలో చాలా వరకు మూతపడ్డాయి. కొన్ని చోట్ల మాంసం, కిరాణా సరకులు విక్రయిస్తున్నారు. వీటితో ఉపాధి పొందుతున్న యువత సంఖ్య పదిలోపే ఉంది.

గిట్టుబాటు కాక..

సీతంపేటలో మూడు మంజూరు కాగా రెండు ప్రారంభమ్యాయి. కానీ ఒక్కటే అప్పుడప్పుడు తెరుస్తున్నారు. ఇక్కడ చేపలు చనిపోకుండా అవసరమైన ఆక్సిజన్‌ యూనిట్‌ ఇవ్వలేదు. శాఖాపరంగా చేపల సరఫరా లేదు. దగ్గరలో చెరువులు లేక ఇతర ప్రాంతాల నుంచి అధిక ఖర్చుతో తీసుకొచ్చి విక్రయించాల్సిన పరిస్థితి. దీంతో గిట్టుబాటు కావడం లేదని మత్స్యకారుల వాదన.  

ఇదీ పరిస్థితి

పాలకొండ నియోజకవర్గంలో రూ.కోటి వ్యయంతో ఆక్వా హబ్‌ను మంజూరు చేశారు. ఇక్కడ ఏర్పాటుకు స్థలం లేక దీనికి బదులు శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో మంజూరైన హబ్‌ను ఏర్పాటు చేసే పనిలో యంత్రాంగం ఉంది. రూ.50 లక్షల వ్యయంతో లాంజ్‌ ఏర్పాటు  చేయాల్సి ఉంది.  

తగినన్ని లేక..

పాచిపెంట మండలం పాచిపెంట, కేసలి, కోడికాళ్లవలస, మాతుమూరు, పాంచాలి, సాలూరు మండలం మామిడిపల్లి, బాగువలసలో మినీ అవుట్‌లెట్లు ఉన్నాయి. పాచిపెంట మండలంలోని కొన్నిచోట్ల నిర్వాహకులు సొంతంగా షెడ్లు నిర్మించుకున్నారు. పాచిపెంటలో పూర్తిగా మూతపడింది. మిగిలిన చోట్ల అదే పరిస్థితి. మామిడిపల్లి, బాగువలసలో మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. తమకు చేపలు పంపిణీ చేస్తే తప్ప కేంద్రాలు నిర్వహించలేమని లబ్ధిదారులు చెబుతున్నారు. మత్స్యశాఖ తగినన్ని చేపలను సరఫరా చేయడం లేదని చెబుతున్నారు.


కిరాణా సరకులు..

గుమ్మలక్ష్మీపురంలో రూ.20 లక్షలతో  సూపర్‌ ఫిష్‌ ఆంధ్ర యూనిట్‌ నెలకొల్పారు. ఇక్కడ నిరంతరం చేపలు విక్రయించేందుకు సిద్ధంగా ఉండాలి. కానీ అనుకున్న స్థాయిలో వ్యాపారం లేదు. దీంతో వినియోగదారులను ఆకర్షించేందుకు కిరాణా సామగ్రి విక్రయిస్తున్నారు.  

 న్యూస్‌టుడే, గుమ్మలక్ష్మీపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని