logo

ఈసీ చెప్పినా వినరే

వాలంటీర్లను రాజకీయాలకు, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసినా, వైకాపా మాత్రం వారిని వదలడం లేదు.

Published : 15 Apr 2024 03:44 IST

వాలంటీర్లతో ఇష్టారాజ్యంగా పనులు

పాచిపెంటలో రాజీనామా పత్రాలతో వాలంటీర్లు

పార్వతీపురం, న్యూస్‌టుడే: వాలంటీర్లను రాజకీయాలకు, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసినా, వైకాపా మాత్రం వారిని వదలడం లేదు. ఎన్నికల్లో ప్రచార కార్యక్రమం, ఓటర్లను తమకు  అనుకూలంగా మలచుకొనే బాధ్యత వారి నెత్తిన వేసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోంది. ఆదివారం పార్వతీపురం శాసనసభ్యుడు వాలంటీర్లను ఇంటికి పిలిచి, వారితో సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారని   తెదేపా బట్టబయలు చేసింది. శనివారం ఎమ్మెల్యే జోగారావు విడుదల చేసినట్లు ప్రచారమైన చరవాణి సందేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందిన వారిని కలిసి వైకాపాకే ఓటు వేసేలా వారందరినీ కోరాలని వాలంటీర్లను కోరిన విషయం విదితమే.

 వలస ఓటర్ల బాధ్యత వారిదే

వైకాపా ప్రచారాల్లోనూ వాలంటీర్లు చురుకుగా పాల్గొంటున్నారు. వారిని అభ్యర్థుల ప్రైవేటు సైన్యంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. వారి పరిధిలో ఉన్న 50 ఇళ్లలో ఉన్న ఓటరు జాబితాను తీసుకొని ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారో తెలుసుకోవాలని హుకుం జారీ చేశారు. అలాగే వలస ఓటర్లను గుర్తించి, వారు ఎక్కడ ఉన్నారు. ఏ పనిచేస్తున్నారు. రాకపోకలకు ఖర్చులు ఎంతవుతాయి? పని స్థలంలో వారి సంపాదన ఎంత వంటి విషయాలను కూడా తెలుసుకొని తమకు తెలియజేయాలని కొందరికి ఆ బాధ్యత అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. వారిని ఎన్నికల సమయానికి నియోజకవర్గానికి రప్పించే దిశగా ఏర్పాట్లు చేయాలని, వాలంటీర్లను, నాయకులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

అవసరాలు తెలుసుకుంటే...

వాలంటీర్లు తమ పరిధిలోని 50 ఇళ్లలో ఎవరి అవసరాలు ఏమిటో తెలుసుకోవాలని వైకాపా నేతలు చెబుతున్నారు. ఆ మేరకు సమాచారాన్ని పార్టీ నాయకులకు చేరవేయడం వరకే వారి పని. వాటిని తీర్చే బాధ్యత స్థానిక నాయకులే చూసుకుంటారని చెబుతున్నారు. అలాగే వృద్దులు, దివ్యాంగులను కలిసి వారంతా పార్టీకే ఓట్లు వేసేలా సమాయత్తం చేసే పని కూడా వాలంటీర్లకే అప్పగించారు. చాలా మంది తమ పనిని గుట్టుచప్పుడు కాకుండా పూర్తిచేసినా, నేరుగా బీఎల్‌వోలు దిగి దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో కొంత వరకు వీరి ప్రయత్నానికి గండి పడినట్లయ్యింది.

దివ్యాంగుల ఓట్ల వేటతో మొదలు

పార్వతీపురం నియోజకవర్గంలో దివ్యాంగుల ఓట్లను కొల్లగొట్టేందుకు వాలంటీర్లను రంగంలోకి దించి, వారిని బలిచేసే ప్రక్రియను ప్రారంభించారు. పెదబొండపల్లిలో ఫారం 12డి కోసం ఇద్దరు దివ్యాంగుల నుంచి సంతకాలు తీసుకున్న వాలంటీర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దివ్యాంగులు, వయోవృద్ధులైన ఓటర్లను కలుసుకునే బాధ్యత కూడా వాలంటీర్లకే అప్పగించి, వారి ఓట్లను కొల్లగొట్టాలని ఆ పార్టీ నాయకులే బహిరంగ సభల్లో చెబుతున్నారు.

రాజీనామా చేయకున్నా..

వాలంటీర్లు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో వారిపై నిఘా పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు రాజీనామా చేసి పార్టీ పనికి రావాలని పెద్దలే పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన వారి సంఖ్య జిల్లాలో తక్కువగానే ఉంది. భారీగా ఉండగా, పదుల సంఖ్యలోనే రాజీనామాలు ఇచ్చారు. ఇవ్వని వారిని పిలిపించి, బాధ్యతలు నిర్వహిస్తూనే ఎన్నికల్లో ఎలాంటి బాధ్యత తీసుకోవాలో? తెలిపేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు వాలంటీర్లకు రెండు నెలల వేతనాన్ని చెల్లించారనే ప్రచారం ఉంది. దీంతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా వారి దగ్గర కొంత మొత్తాన్ని సిద్ధంగా ఉంచినట్లు చెబుతున్నారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని