logo

అమ్మపైనే అక్కసు

ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పథకాలను భ్రష్టు పట్టించడమే ధ్యేయంగా జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారు. గత ప్రభుత్వంపై కక్ష సాధించేందుకు వసతి గృహాలను నిర్లక్ష్యం చేసి గిరిశిఖర గ్రామాల్లోని కాబోయే అమ్మకు అందే సేవలపైనే వేటు వేశారు.

Published : 15 Apr 2024 03:49 IST

గర్భిణుల వసతిగృహాల నిర్వహణపై నిర్లక్ష్యం

 

ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పథకాలను భ్రష్టు పట్టించడమే ధ్యేయంగా జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారు. గత ప్రభుత్వంపై కక్ష సాధించేందుకు వసతి గృహాలను నిర్లక్ష్యం చేసి గిరిశిఖర గ్రామాల్లోని కాబోయే అమ్మకు అందే సేవలపైనే వేటు వేశారు.

సాలూరు, గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే  

దేశంలోనే తొలిసారిగా 2018లో తెదేపా హయాంలో గిరిశిఖర గ్రామాల్లో గర్భిణులకు అత్యున్నత సేవలు అందించేందుకు ఓ వసతి గృహాన్ని సాలూరు పట్టణంలో ఏర్పాటు చేశారు. సత్ఫలితాలు రావడంతో గుమ్మలక్ష్మీపురంలో మరొకటి నెలకొల్పారు. ఏడు నెలల నిండిన ప్రతి గర్భిణినీ ఇక్కడ చేర్పించి ఫుడ్‌ బకెట్‌ పేరుతో పాలు, గుడ్లు, పండ్లు, మిఠాయి, ఖర్జూరం, శనగ చిక్కీలు, రాగిజావ అందించేవారు. రోజూ వైద్య పరీక్షలు, రక్తహీనత, బీపీ, షుగర్‌ పరీక్షలు చేసి కంటికి రెప్పలా కాపాడేవారు. మన్యంలో మాతృ మరణాలను తగ్గించారు. ఇక్కడ సేవలను అప్పటో రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌, ముఖ్యమంత్రి, నీతి ఆయోగ్‌ కమిటీ సభ్యులు ప్రశంసించి జాతీయ పురస్కారం అందజేశారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని 2019లో అప్పటి గవర్నర్‌ అధికారులకు సూచనలు సైతం చేశారు.  

 తెదేపా హయాంలో..

మన్యంలో కొండలపైకి వెళ్లేందుకు రోడ్లు లేకపోవడంతో గర్భిణులు అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి చేరుకునేందుకు డోలీలే దిక్కయ్యేవి. చాలా మందికి పోషకాహారం అందక రక్తహీనతతో బాధపడేవారు. ఇలాంటి సమస్యలతో గర్భిణులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని తెదేపా హయాంలో గర్భిణుల వసతి గృహాలు ఏర్పాటు చేశారు. వైద్యం, పోషకాహారంతో పాటు యోగా చేయిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపారు.  

గతంలో వసతి గృహంలో బోరు, విద్యుత్తు మోటారు పాడవడంతో రెండు రోజుల పాటు నీటి సరఫరా జరగలేదు. దీనిపై ఎవరూ స్పందించకపోవడంతో గర్భిణులే సమస్యను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు.  

 ఈ ప్రభుత్వంలో..

వైకాపా అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. వసతి గృహాల్లో సేవలు అరకొరగా మార్చేశారు. గతంలో అంబులెన్సులు వెళ్లలేని గ్రామాలకు కల్పించిన ఫీడర్‌ అంబులెన్సు సేవలు కనిపించడం లేదు. పోషకాహారం తగ్గించేశారు. చివరికి గర్భిణులే ఆరుబయట నీరు కాచుకుంటున్నారంటే వైకాపా పాలకులు పరిస్థితిని ఎంత దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు.  

ఇంధనానికీ డబ్బుల్లేవు..

ప్రస్తుత వైకాపా పాలనలో గర్భిణులను ఆసుపత్రులకు తీసుకెళ్లే అత్యవసర వాహనాలకు ఇంధనం కూడా అందించలేని గడ్డు పరిస్థితి నెలకొంది. మార్గమధ్యలో వాహనం నిలిచి నిండు చూలాలు నడిరోడ్డుపై నడిచిన ఘటనలూ జరిగాయి. అంబులెన్సు సేవలకు అంతరాయం కలగడంతో ఆటోలపై ఆసుపత్రికి చేరిన దుస్థితి ఎదురైంది. చలికాలంలో కట్టెల పొయ్యిపై స్వయంగా నీరు కాచుకోవడం, బకెట్లతో నీరు మోసుకోవడం మొదలైన ఘటనలతో ఇక్కడ చేరేందుకు గర్భిణులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.

వసతి గృహంలో గ్రీజర్లు పనిచేయకపోవడంతో చలికాలంలో ఆరుబయట చెట్ల కింద నీరు కాస్తున్న గర్భిణులు  (పాతచిత్రం)

జీతాలు ఇవ్వడం లేదు..

వసతి గృహంలో గర్భిణులకు సేవలు అందించే ఏఎన్‌ఎంలు, వైటీసీ సిబ్బందికి ఈ ప్రభుత్వం సక్రమంగా జీతాలు చెల్లించకపోవడంతో సేవలు తగ్గాయి.  రాత్రి వేళల్లో గర్భిణికి ప్రసవ నొప్పులు వస్తే 108 వాహనంపై ఆధారపడాల్సిన దుస్థితి. సాలూరులో సోలార్‌ విద్యుత్తు పలకలు ఏర్పాటు చేసినా వినియోగంలో లేవు. రెండు చోట్లా జనరేటర్లు లేకపోవడంతో విద్యుత్తు అంతరాయం ఏర్పడితే చీకటి కష్టాలు తప్పడం లేదు. వైటీసీలు విద్యుత్తు ఛార్జీలు చెల్లించకపోవడంతో పలుమార్లు అధికారులు సరఫరా ఆపేసిన సందర్భాలు నెలకొన్నాయి.

అవగాహన ఏదీ.. గతంలో గర్భిణుల వద్దకు వైద్య సిబ్బంది వెళ్లి అవగాహన కల్పించి వసతి గృహానికి తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి పెద్దగా లేదు.

వైద్యుల లేమి.. వైద్య పరీక్షలు చేసేందుకు తెదేపా పాలనలో ప్రత్యేకంగా వైద్యులను నియమించి, రోజూ పరీక్షలు చేసేవారు. అత్యవసర వైద్యం కావాల్సిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి చేర్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక వైద్యులు కానరావడం లేదు. చిన్న చిన్న సమస్యలకే ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.

కానరాని పోషకాహారం.. గతంలో మూడు పూటలా పోషకాహారం అందించేవారు. ఫుడ్‌ బకెట్‌ పథకంతో ఖర్జూరం, చిక్కీలు, నువ్వుల ఉండలు, మందులు ఇచ్చేవారు. ప్రస్తుతం అంగన్‌వాడీల నుంచి సరకులు వసతి గృహానికి రావడం లేదు. పాలు సరఫరా సక్రమంగా జరగడం లేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని