logo

అప్పటి నుంచే ఖర్చుకు లెక్క..!

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 17 Apr 2024 04:33 IST

రేపటి నుంచి నామపత్రాల స్వీకరణ

రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

ఈనాడు-విజయనగరం, న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్‌, ఉడాకాలనీ: ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల, అదే రోజు నుంచే నామపత్రాలను స్వీకరిస్తారు. 25వ తేదీ వరకు స్వీకరిస్తారు. 26న పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్‌ వేసినప్పటి నుంచి వారి ఖాతాలోనే ఖర్చును లెక్కిస్తారు. జెండా నుంచి భోజనం వరకు వారు చేసే ప్రతి ఖర్చును వారి ఖాతాలో లెక్కగడతారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారిణి నాగలక్ష్మి మంగళవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశంలో జేసీ కార్తీక్‌, డీఆర్వో అనిత, పార్టీల ప్రతినిధులు రొంగలి పోతన్న, సోములు, రమేశ్‌కుమార్‌, నరసింహరాజు హాజరయ్యారు.

పార్లమెంటు స్థానాలకు కలెక్టరేట్‌లో..

ఉమ్మడి జిల్లాలోని 11 అసెంబ్లీ, విజయనగరం, అరకు పార్లమెంటరీ నియోజకవర్గాల నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీ స్థానానికి జిల్లాల కలెక్టరేట్‌ల్లో దాఖలు చేయాలి. జిల్లాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఎస్‌.నాగలక్ష్మి, నిశాంత్‌ కుమార్‌ వీటిని స్వీకరిస్తారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి జేసీ కె.కార్తీక్‌ తహసీల్దారు కార్యాలయంలో నామపత్రాలు తీసుకుంటారు.

సహాయక కేంద్రాల ఏర్పాటు

కలెక్టరేట్లలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల తరఫున వారు కేంద్రంలో సమాచారం తీసుకుని, తప్పొప్పులు సరిచేసు కోవచ్చని డీఆర్వో ఎస్‌.డి.అనిత తెలిపారు.


గమనించాల్సినవి..

  •  సెలవు రోజుల్లో మినహా ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు స్వీకరణ.
  •  అభ్యర్థులు 13 రకాల ధ్రువపత్రాలు సమర్పించాలి.
  •  అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్లు, రెండు నియోజకవర్గాల నుంచి మాత్రమే దాఖలు చేయవచ్చు.
  •  నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత హార్డ్‌ కాపీలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేసేందుకు మూడు వాహనాలు, అయిదుగురు వ్యక్తులు (అభ్యర్థితో సహా) రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి అనుమతిస్తారు.
  •  100 మీటర్ల తర్వాత వాహనాలకు అనుమతిలేదు.  
  •  ప్రతి నియోజకవర్గంలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేస్తారు.

    అందుబాటులోకి ప్రత్యేక యాప్‌

  • నామపత్రాల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, దాఖలు చేసే విధానంపై ఇందులో పొందుపర్చారు. అన్ని పత్రాలను యాప్‌ ద్వారానే అందజేయాలి. ప్రచారానికి సంబంధించి కార్యక్రమాలు, వాహనాలు, ఇతర వాటికి ఈ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని