logo

Balineni: మీ ఇష్టం.. నాకేం నష్టం!

ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉండాల్సిందేనంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు పట్టుబట్టారు.

Updated : 01 Feb 2024 12:33 IST

మాగుంటకు స్థానంపై తగ్గిన బాలినేని
ఎవరికీ పట్టకపోతే నాకెందుకుని వ్యాఖ్య
అధిష్ఠానంతో ఘర్షణ పడాలా అంటూ నిర్వేదం

శ్రీనివాసరెడ్డి,  శ్రీనివాసులురెడ్డి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉండాల్సిందేనంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు పట్టుబట్టారు. ఆయనతో కలిసే ఎన్నికల బరిలోకి దిగుతానంటూ పదే పదే ప్రకటించారు. ఆ మేరకు అధిష్ఠానంపై అలకబూనారు కూడాను. మాగుంటకు ఒంగోలు కేటాయించకపోతే సీఎంతోనైనా తాను చర్చించేది లేదని తేల్చి చెప్పారు. ఇకపై తనకు ఫోన్‌ కూడా చేయొద్దంటూ భీష్మించారు. నిన్నటి వరకు మొండికేసిన బాలినేని చివరికి మెత్తబడ్డారు. తనయుడు ప్రణీత్‌రెడ్డి, వియ్యంకుడు కుండా భాస్కర్‌రెడ్డితో మంగళవారం రాత్రి సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మనస్సు మార్చుకున్నారు. ఈ మార్పు వెనుక వైకాపా తన మార్కు రాజకీయం నడిపినట్లు చర్చ సాగుతోంది.
తన దారి తాను చూసుకుంటానంటూ...: మాగుంట ఉండాల్సిందేనంటూ బాలినేని పట్టుబట్టారు. అధిష్ఠానం మాత్రం బాలినేని ఉండాలని, అదే సమయంలో మాగుంటను పక్కనపెట్టి తీరాల్సిందేనని ఎత్తులు వేసింది. ఈ క్రమంలో ఒంగోలులో ఇళ్లపట్టాలకు నిధులు కేటాయించింది. అయినప్పటికీ బాలినేని మాత్రం మాగుంట జపం మానలేదు. ఆయన కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. నేరుగా ఇంటికి వెళ్లి గంటల తరబడి చర్చించారు. ఇళ్ల స్థలాలకు నిధులు కేటాయించిన తర్వాత కూడా ఇలా వ్యవహరించడం వైకాపా పెద్దలకు మింగుడు పడలేదు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డి ఈ పరిస్థితిని చక్కదిద్దలేకున్నారని భావించింది. అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరును తెర పైకి తెచ్చింది. దీంతో బాలినేని మరింత అసహనానికి గురయ్యారు. మాగుంటకు స్థానం కేటాయించకపోతే తన దారి తాను చూసుకుంటానని చెప్పేశారు.
వ్యూహం మార్చి.. అటు నుంచి కథ నడిపి..!: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ తర్వాత కూడా మెత్తపడలేదు. జగన్‌ కుటుంబానికి బంధువు కావడం.. సీఎంకు అత్యంత సన్నిహితులు అనుకున్న కొందరు నేతలు ఇప్పటికే పార్టీని వీడటం.. బాలినేని కూడా ఇలాగే వ్యవహరిస్తే అది వైకాపాకు కచ్చితంగా నష్టం కలిగించే అంశమే అవుతుంది. దీంతో అధిష్ఠానం వ్యూహం మార్చి ఆఖరి అస్త్రాన్ని బయటకు తీసింది. బాలినేని వియ్యంకుడు కుండా భాస్కర్‌రెడ్డి వైపు నుంచి కథ నడిపింది. ఆయనతో మాట్లాడిన పార్టీ పెద్దలు.. మైనింగ్‌, అటవీ భూములు, భూ ఆక్రమణల ఆరోపణలు, ఇతరత్రా అంశాలను ఏకరవు పెట్టినట్లు సమాచారం. ఆ తర్వాత మీ ఇష్టం.. అంటూ హెచ్చరించినట్లు తెలిసింది.
బెడిసి కొట్టిన అలక మంత్రం...: ఇప్పటి వరకు పలు విషయాల్లో అధిష్ఠానంపై బాలినేని అలకబూనారు. మంత్రివర్గం నుంచి ఉద్వాసన, ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల్లో ప్రకాశం జిల్లాను తొలగించడం, మార్కాపురంలో ప్రొటోకాల్‌ వివాదం, ఒంగోలు భూ కుంభకోణంలో విచారణ సక్రమంగా చేయడం లేదంటూ వ్యక్తిగత అంగరక్షకులను వెనక్కి పంపటం వంటివి ఇందులో కొన్ని. తాజాగా ఇటు మాగుంట, అటు ఇళ్ల స్థలాలకు నిధుల కోసం అదే రాగం ఎంచుకున్నారు. ఆయన్ను శాంతింపజేయడానికి అధిష్ఠానం ప్రతిసారీ ఒక మెట్టు దిగుతూనే ఉంది. మాగుంట విషయంలో మాత్రం బెడిసి కొట్టింది. వ్యతిరేక సంకేతాలు అందడంతో తన తనయుడు ప్రణీత్‌రెడ్డి, వియ్యంకుడితో బాలినేని సుదీర్ఘంగా భేటీ అయ్యారు. లాభనష్టాలను బేరీజు వేసుకున్నారు. అంతరంగీకులతోనూ అర్ధరాత్రి వరకు సమాలోచనలు సాగించారు. అధిష్ఠానంతో ఘర్షణ పడితే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయానికి వచ్చి మాగుంట విషయంలో మెత్తబడినట్లు ప్రచారం. చివరికి ఒంగోలు ఎంపీ టికెట్‌ ఎవరికిచ్చేది మీ ఇష్టమని.. తనకొచ్చిన నష్టమేమీ లేదని.. జిల్లాలో ఇతరులెవరికీ పట్టకుంటే తనకెందుకంటూ వ్యాఖ్యానించారు. అధిష్ఠానంతో తాను మాత్రమే ఘర్షణ పడాలా అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు.
దిల్లీ సూచన మేరకే చెక్‌..!: ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరుంది. అటువంటి వ్యక్తిని వైకాపా ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దిల్లీ నుంచి కటువుగా అందిన ఆదేశాల మేరకే ఆయన్ను పక్కనపెట్టినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా భాజపా హవా నడుస్తోంది. రాజధాని దిల్లీ, పక్కనే ఉన్న పంజాబ్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలోని ఆమ్‌ ఆద్మీ(ఆప్‌) పార్టీ భాజపాను ఢీకొడుతోంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఉత్తరాదికి విస్తరించేందుకు మాగుంట.. ఆప్‌కు పంజాబ్‌ ఎన్నికల్లో ఆర్థికంగా సహకరించారనేది భాజపా అనుమానం. దిల్లీ మద్యం కుంభకోణంలో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా అరెస్టయ్యారు. మాగుంట తనయుడు రాఘవ్‌రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఆరునెలల పాటు ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారినప్పటికీ భాజపా అధిష్ఠానం పంజాబ్‌ పరాభవాన్ని మరిచిపోలేదని.. రాష్ట్రంలో వైకాపాతో తనకున్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని మాగుంటకు రాజకీయంగా చెక్‌ పెడుతున్నట్లు ప్రచారం.
హుటాహుటిన హైదరాబాద్‌కు...: బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. విజయవాడ నుంచి ఉదయం ఒంగోలు వచ్చిన ఆయన రోజంతా అసహనం, అసంతృప్తిగానే కనిపించారు. జిల్లా వైకాపా రాజకీయాల బాధ్యతలను అధిష్ఠానం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అప్పగించింది. ఇళ్లపట్టాల స్థల సేకరణకు సంబంధించి బుధవారం సాయంత్రం వరకు కూడా నిధులు జమ కాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన హుటాహుటిన హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని