logo

Balineni Srinivasa Reddy: చౌరస్తాలో బాలినేని..!

నిన్నమొన్నటి వరకు జిల్లాలో వైకాపాకు పెద్దన్నగా మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి పేరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. తమ అధిష్ఠానంపై వ్యూహాలు ప్రయోగిస్తున్నానని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు తానే ఉచ్చులో చిక్కుకుపోయారనే ప్రచారం సాగుతోంది.

Updated : 09 Feb 2024 08:45 IST

చిక్కుల వలలో వైకాపా పెద్దన్న
భవిష్యత్‌ వ్యూహాలపై తర్జనభర్జన

విజయవాడలోని ఓ హోటల్‌లో మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డిని కలిసిన ఒంగోలు మేయర్‌, కార్పొరేటర్లు (పాత చిత్రం)

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నిన్నమొన్నటి వరకు జిల్లాలో వైకాపాకు పెద్దన్నగా మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి పేరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. తమ అధిష్ఠానంపై వ్యూహాలు ప్రయోగిస్తున్నానని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు తానే ఉచ్చులో చిక్కుకుపోయారనే ప్రచారం సాగుతోంది. పదే పదే అలకబూనడంపై తాడేపల్లి ప్యాలెస్‌ సీరియస్‌గా దృష్టి సారించింది. వ్యూహాత్మకంగా ఆయన్ను దిగజార్చింది. ఈ విషయం గ్రహించలేని బాలినేని జిల్లా పార్టీపై ఇప్పటికే పట్టు కోల్పోయారు. నూతన సమన్వయకర్తగా తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రంగప్రవేశంతో మరింత డీలా పడిపోయారు. తన ప్రమేయం లేకుండా చకచకా సాగుతున్న ఈ పరిణామాలన్నీ బాలినేనిలో మరింత ఆందోళన పెంచుతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల భావన.

పార్టీ ప్రయోజనాల కోసమంటూ కొత్త రాగం...

జిల్లాలో తన పెత్తనమే సాగాలనేది మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి పట్టుదల. అందుకు అనుగుణంగానే సీట్ల కేటాయింపులో తన ముద్ర ఉండాలని భావించి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఒంగోలులో పాతిక వేల మందికి పట్టాలు అందజేశాకే తిరిగి తాను పోటీ చేస్తానని పదే పదే ప్రకటించారు. సిటింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసలురెడ్డితో కలిసే బరిలోకి దిగుతానని అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. మాగుంటకు తలుపులు మూసేసిన తాడేపల్లి ప్యాలెస్‌.. ఇళ్లస్థలాల భూసేకరణకు రూ.201 కోట్లు నిధులు కేటాయించింది. ఇలాగైనా బాలినేని మెత్తబడతారని భావించింది. నిధులు విడుదలైన తర్వాత కూడా మాగుంట కోసం బాలినేని స్వరం పెంచారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో అనూహ్యంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరును అధిష్ఠానం తెర పైకి తెచ్చింది. ఆయనకు ఒంగోలు పార్లమెంట్‌ సమన్వయకర్త బాధ్యతలతో పాటు సంతనూతలపాడు, కందుకూరు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలూ అప్పగించింది. ఈ అనూహ్య నిర్ణయంతో ఖిన్నుడైన బాలినేని మరోసారి అలకబూని హైదరాబాద్‌ వెళ్లిపోయారు. అనంతరం పార్టీ ప్రయోజనాల కోసమే తాను మాగుంట కోసం ప్రయత్నించాననీ, జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు పట్టించుకోకపోతే అధిష్ఠానంతో తాను మాత్రమే ఘర్షణ పడటం ఎందుకుని సరిచేసుకునే ప్రయత్నం చేశారు.

కొనసాగడమా.. ప్రత్యామ్నాయమా...

వైకాపా అధిష్ఠానం జిల్లాపై పెత్తనాన్ని చెవిరెడ్డికి కట్టబెట్టేలా వ్యూహం మార్చింది. ఇళ్లపట్టాలకు నిధులు కేటాయించినప్పటికీ వారం రోజులపాటు రైతుల ఖాతాలకు జమ చేయలేదు. బాలినేని అలిగి హైదరాబాద్‌ వెళ్లిపోవడానికి ఇదీ ఒక కారణమనే చర్చ సాగింది. ఆయన హైదరాబాద్‌ వెళ్లిపోయిన తర్వాత రోజే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఇళ్లపట్టాల బాధ్యతల్ని కూడా చెవిరెడ్డికి అప్పగించారు. తాజాగా ఒంగోలు పార్లమెంట్‌, అసెంబ్లీ సమన్వయకర్తల నియామకంలో పార్టీ పెద్దలు పునరాలోచనలో ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీలో కొనసాగాలా.. ప్రత్యామ్నాయం చూసుకోవాలా అని బాలినేని తన సన్నిహితులతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాతతో పాటు సుమారు పాతిక మంది కార్పొరేటర్లు విజయవాడ వెళ్లి బాలినేనిని కలిశారు. ఈ సందర్భంగానూ ఒంగోలు రాజకీయాల పైనే చర్చించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని