logo

ఇచ్చేది గోరంత.. చెప్పేది జగనంత!

విద్యా సుమాలు వికసించాల్సిన పాఠశాలలపై క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. చదువులపై ఆసక్తి రేకిత్తిస్తూ..

Published : 16 Apr 2024 04:01 IST

గోళీల్లా గుడ్లు.. బూజుపట్టిన చిక్కీలు
నిత్యావసరాల ధరలు కొండెక్కినా పాత ఛార్జీలే
భావి పౌరులపై నిర్లక్ష్యం
ఇదీ మిథ్యాహ్న భోజనం తీరు

పాలకుల నిర్లక్ష్యంతో ‘భావి’ భారతం నిర్వీర్యమవుతోంది. బడికి రప్పించి పౌష్టికాహారాన్ని అందివ్వడాన్ని వారు భారంగా భావించడంతో విద్యార్థి లోకం విలవిల్లాడుతోంది. గోళీల్లా గుడ్లు..బూజుపట్టిన చిక్కీలు..రుచీపచీ లేని వంటకాలతో మధ్యాహ్న భోజనమంటేనే బెంబేలెత్తిపోతున్నారు. నిత్యావసరాల రేట్లు ఆకాశాన్నంటినా పాత ఛార్జీలనే చెల్లిస్తుండటంతో నిర్వాహకులు నాణ్యత లేని భోజనాన్నే వండి వారుస్తున్నారు. అయిదేళ్లుగా జగన్‌ అందిస్తున్న గోరుముద్ద భావి పౌరులకు మింగుడు పడటం లేదు.


తాళ్లూరు వీకే ప్రభుత్వ పాఠశాలలో  నాణ్యత లేని ఆహారానికి చిన్నారుల కష్టాలు

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం : విద్యా సుమాలు వికసించాల్సిన పాఠశాలలపై క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. చదువులపై ఆసక్తి రేకిత్తిస్తూ..బలవర్థక ఆహారాన్ని అందిస్తూ ప్రభుత్వ విద్యను పటిష్ఠం చేయాల్సిన విద్యుక్త ధర్మాన్ని ముఖ్యమంత్రి జగన్‌ గాలికొదిలేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాల్సిన మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చేసి  విద్యార్థుల తల్లిదండ్రుల ఆశల్ని అడియాసలు చేశారు. జిల్లాలో 73 శాతం పిల్లలు పాఠశాలల్లోనే తింటున్నట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతున్నా.. వాస్తవంగా తినేది మాత్రం 65 శాతం మందికి మించరన్నది అసలు వాస్తవం. సాక్ష్యాత్తూ జిల్లా కేంద్రమైన ఒంగోలు డీఆర్‌ఆర్‌ మున్సిపల్‌ స్కూలులో 650 మందికి గాను కేవలం 500 మంది మాత్రమే మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు. ఇంటి నుంచి బాక్సు తెచ్చుకునే వెసులుబాటు లేనివారు నిరుపేద వర్గాల వారు గత్యంతరం లేక రుచీపచీలేని ఈ భోజనాన్నే తీసుకుంటున్నారు.


గొప్పలు.. తిప్పలు

గిద్దలూరు పట్టణం: మేం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేశామని ముఖ్యమంత్రి ప్రతి సభలోనూ చర్విత చరణంగా చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు మండలానికి ఇద్దరు మండల విద్యాశాఖ అధికారులను నియమించామని ఆయన గొప్పగా చెప్పారు. అయితే పశ్చిమ ప్రాంతంలోని పాఠశాలల పనితీరుపై వారి పర్యవేక్షణ కొరవడింది. సోమవారం చాలా ప్రాంతాలకు కోడిగుడ్లు సైతం అందలేదు. బియ్యం, చిక్కీలు సక్రమంగా సరఫరా అవుతున్నాయా లేదా అన్నది కూడా వారు పట్టించుకోవడం లేదు. బాధ్యతల బరువులు మోపడం తప్ప..సజావుగా పర్యవేక్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలేదని వారు వాపోతున్నారు.
నాలుగు రోజులుగా సరఫరాయే లేదు: పశ్చిమ ప్రకాశంలో గత శుక్రవారం నుంచే పాఠశాలల్లో గుడ్ల నిల్వలు ఖాళీ అయ్యాయి. గుత్తేదారుడు సోమవారం నాటికి కూడా వాటిని అందివ్వకపోవడంతో గుడ్డు కూర వడ్డించలేని దుస్థితి ఎదురైంది. ఫోన్‌ చేసినా స్పందన కరవైందని పలువురు ప్రధానోపాధ్యాయులు వాపోయారు.


అసలే చిన్నవి.. ఆపై పాడైపోయి

కనిగిరి, న్యూస్‌టుడే: ఇదిగో కన్పిస్తున్న ఈ చిత్రం కనిగిరి పట్టణంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలోనిది. అక్కడ గోళీల్లాంటి గుడ్లు సరఫరా చేస్తున్నారు. దీనిపై తాము గగ్గోలు పెడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వంట నిర్వాహకులు వాపోయారు. అధికభాగం పాడైపోయినవే ఇస్తున్నారన్నారు. బిల్లులు కూడా సకాలంలో ఇవ్వడం లేదన్నారు.
తాజా కోడిగుడ్లేవీ ?: కోడిగుడ్లు వారానికి సరిపడా ఒకసారివ్వాలి. అయితే వాటిని ఒక్కసారే ఇచ్చిపోతుండటంతో కుళ్లిపోతున్నాయి. దోర్నాల, యర్రగొండపాలెం మండలాల్లో పాఠశాలల్లో పలుమార్లు గుడ్లు మురిగిపోయిన సంఘటనలున్నాయి. మిగిలిపోయిన వాటిని రిటన్‌ తీసుకునే విధానం ఉండాలని, అది కూడా ఎంఈవో స్థాయిలో ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. కుకింగ్‌ ఏజెన్సీలు, సహాయకులకు ప్రతినెలా బిల్లు, గౌరవవేతనం వస్తుందనే గ్యారంటీ లేదు. ఎన్నికల వల్ల ఇటీవల బిల్లులు ఆపకుండా చెల్లిస్తున్నారు.


విద్యార్థులు అంతంతమాత్రం.. వారికీ గుడ్డు ఎగనామం

కనిగిరి : ఇదిగో కన్పిస్తున్న ఈ చిత్రం కనిగిరి మున్సిపాలిటీలోని చింతలపాలెం ఉన్నత పాఠశాలలోనిది. ఇక్కడ వాస్తవంగా 200 మందికిపైగా జగనన్న గోరుముద్ద భోజనం చేయాల్సి ఉండగా, 170 మంది మాత్రమే తినేందుకు వచ్చారు. కోడిగుడ్డు పెట్టాల్సి ఉన్నా..అందజేయలేదు. దీనిపై ప్రధానోపాధ్యాయుడు రామశర్మను వివరణ కోరగా, పాఠశాలకు ఏజెన్సీ వారు కోడిగుడ్లు పంపిణీ చేయలేదన్నారు.
అన్నీ లొసుగులే :  కనిగిరి నియోజకవర్గంలో 440 పాఠశాలలుండగా, రెండువేల మంది జగనన్న గోరుముద్ద భోజనం తింటున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకమైనదే అందుతోంది. సోమవారం కనిగిరి పట్టణంలో జడ్పీ బాలికోన్నత పాఠశాలను ‘న్యూస్‌టుడే’ పరిశీలించగా గోళీల్లాంటి కోడిగుడ్లు కన్పించాయి. కొన్ని మురిగిపోగా, బయట పడేశారు. రాజీవ్‌ నగర్‌ ప్రాథమిక పాఠశాలలో ముద్దగా ఉన్న పలావు, చాలీచాలని కోడిగుడ్ల కూర కన్పించింది.


పప్పులు, ఉప్పుల ధరలు పెరిగినా...

పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా భోజనం ఛార్జీలు పెంచకపోవడం వల్లే ఈ పథకం నీరుగారిపోయింది. ఎక్కువమంది పిల్లలున్న పాఠశాలల్లో కుకింగ్‌ ఏజెన్సీలకు ఎంతోకొంత దక్కుతోందని, తక్కువ పిల్లలున్నచోట వండిపెట్టేవారికి ప్రయాసే మిగులుతోందని నిర్వాహకులు వాపోతున్నారు.   దీనితో పిల్లలకు పెట్టే భోజనంలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. ఇటీవల టమోటా రేటు కొండెక్కింది. ఆ సమయంలో దాదాపు 20 రోజులు పాఠశాల భోజనంతో ఆ వాసనే కానరాలేదు. ఇక అల్లం, వెల్లుల్ని ధర అయితే వందల్లోకి చేరింది. ఇలా ఉంటే పలావు వంటివి ఎలా చేయగలమని వారు  వాపోతున్నారు. దీంతో పప్పులేని చారు, తాలింపు గింజల్లేని పులిహోర, అల్లం, మిరియాల వాసనలేని హాట్‌ పొంగల్‌ వంటివే పిల్లలకు వండి వారుస్తున్నారు.


ఫొటోలు.. యాప్‌లు తప్ప అసలుదేదీ

సంతపేట ప్రాథమిక పాఠశాలలో ముద్దగా వెజ్‌ బిర్యానీ

రోజూ మధ్యాహ్న భోజనం పెట్టేముందు ఆ రోజు మెనూ ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఫొటో వరకూ బాగానే ఉంది కానీ సమస్యల్లా నాణ్యత లోపమే! ఆదివారం పోను మిగిలిన ఆరు రోజుల్లో మూడు రోజులు రాగి జావ, మిగిలిన మూడు రోజులు వేరుశనగ చిక్కీలు అందిస్తారు. రాగిజావ కాయడానికి కుకింగ్‌ ఏజెన్సీలకు ఎక్కువ గ్యాస్‌ ఖర్చవుతోందని అదనంగా చెల్లించాలని ఎప్పటినుంచో వేడుకుంటున్నా పాలకుల తలకెక్కడం లేదని పలువురు వాపోతున్నారు.


కాలదోషం పడుతున్న చిక్కీలు

తయారు చేసిన మూడు నెలల్లోపు చిక్కీలను వినియోగించాలి. అయితే మరో వారంలో కాలంచెల్లేవాటిని, లేదా పూర్తిగా కాలం చెల్లినవాటిని పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. కాలంతీరిన వాటిలో ఫంగస్‌ చేరి విద్యార్థులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మూడు మాసాల క్రితం తాళ్లూరు, దర్శి మండలాల్లో కాలంతీరిన చిక్కీలను గుర్తించి సరఫరా నిలిపివేశారు.


బడుల్లో నీళ్లే లేవు

గిద్దలూరు: కృష్ణంశెట్టిపల్లె  పాఠశాలలో మూలకు చేరిననీటిశుద్ధి యంత్రం

గిద్దలూరు పట్టణం: నాడు - నేడు కింద పాఠశాలల్లో ఏర్పాటుచేసిన నీటిశుద్ధి యంత్రాలు నిర్వహణ లేక మూలకు చేరాయి. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు బయట శుద్ధిచేసిన నీటిని కొనుగోలు చేసి విద్యార్థులకు అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గిద్దలూరులోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం పాఠశాల ఉపాధ్యాయులు 250 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. కేవలం 13 కిలోల బియ్యం మాత్రమే అందజేస్తే అంతమందికి ఎలా వండగలమని నిర్వాహకులు ‘న్యూస్‌టుడే’ వద్ద వాపోయారు. గుడ్ల నిల్వలు లేకపోవడంతో వాటిని అందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని